గుంటూరు: అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న తీరుగా ఇటీవల జరిగిన ఐటీ దాడులపై వైసిపి నాయకులు అతిగా వ్యవహరిస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి లు 16 నెలలు జైల్లో ఉన్నామన్న అక్కసుతో కక్షగట్టి ఇతరులను కూడా అవినీతి కేసులలో ఇరికించాలనే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వీరిద్దరు చెప్పినట్లు ఆడే పెయిడ్‌ ఆర్టిస్టుగా కన్నబాబు మారారని అన్నారు.

దేశవ్యాప్తంగా జరిగిన సోదాలలో దొరికిన రూ.2 వేల కోట్లు అవకతవకలను ఒక్క టీడీపీకి ఆపాదించే కుట్ర చేస్తూ  వైసిపి నాయకులు ప్రజలలో అభాసుపాలయ్యారని అన్నారు. సీబీడీ 13.02.2020న విడుదల చేసిన పత్రికా ప్రకటనకు వైసీపీ నేతలు వక్రభాష్యాలు చెబుతున్నారని అన్నారు. అందులో మొదటి 2 పేరాలలో 3 ఇన్‌ఫ్రా కంపెనీలపై దాడుల గురించి ఉందని... ఆ ఇన్‌ఫ్రా కంపెనీలు కూడా వైసీపీ వాళ్లకు సంబంధం ఉన్నవేనని ఆరోపించారు.

3వ పేరాలో మాత్రమే ఒక ప్రముఖ వ్యక్తి పీఎస్‌ అంటూ పరోక్షంగా చెప్పారన్నారు. 3వ పేరాకు పైన చెప్పిన 2, కింద పేర్కొన్న 4, 5 పేరాలకు సంబంధం లేదని రామానాయుడు వివరణ ఇచ్చారు. అంతేగాక పీఎస్‌ ఇంట్లో జరిగిన సోదాలలో కూడా చెప్పుకోదగింది ఏమీ దొరకలేదని మీడియాలోనే వచ్చిందన్న విషయం వైసిపి నాయకులు గుర్తిస్తే మంచిదన్నారు. 

read  more  జగన్ డిల్లీ పర్యటన వెనకున్న రహస్యమిదే...అతడిని విడిపించడానికే...: వర్ల రామయ్య

ఇక వైసీపీ నాయకులకు ఉన్న మనీలాండరింగ్‌ చరిత్ర ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. మారిషస్‌, లగ్జెంబర్గ్‌, బ్రిటీష్‌ వర్జీనియా ఐలాండ్స్‌ తదితర 6 దేశాలలో వీళ్లు చేసిన మనీలాండరింగ్‌ సీబీఐ, ఈడీ బయటపడ్డాయని పేర్కొన్నారు. అందుకే హడావుడిగా ఈరోజు సీఎం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రికి మొరపెట్టుకోడానికి వెళ్లారని అన్నారు.

అమిత్‌షా తిట్లు, సీబీఐ కోర్టు చీవాట్లు ప్రజల చెవికి వినబడకుండా ఉండేందుకే కన్నబాబు ఐటీ బాకా ఊదుతున్నారని విమర్శించారు. రూ.43వేల కోట్ల అవినీతితో 11కేసుల అవినీతి బురదలో నిండా కూరుకుపోయిన జగన్ తన బురదను చంద్రబాబుకి పూసే క్రమంలో కన్నబాబు లాంటి పెయిడ్‌ ఆర్టిస్టులను రంగంలోకి దింపుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. 

read more  వికేంద్రీకరణ బిల్లుపై క్లారిటీ లేదు... ఏం జరుగుతుందో చూద్దాం...: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

కేవలం టీడీపీపై బురదజల్లేందుకు, చంద్రబాబును అప్రతిష్టపాలు చేసేందుకు ఐటీ దాడులను అస్త్రంగా వైసీపీ నేతలు వాడుతున్నారని అన్నారు. అది వాళ్లకే బూమరాంగ్‌ అవుతుందనేది గుర్తుంచుకోవాలని నిమ్మల రామానాయుడు హెచ్చరించారు.