గుంటూరు: జిల్లాలోని దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలో ముక్కుపచ్చలారని చిన్నారిపై ఓ కామాంధుకు అఘాయిత్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ దారుణానికి పాల్పడిన నిందితున్ని కాపాడేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు ప్రతిపక్ష టిడిపి ఆరోపిస్తోంది. ఇవాళ(శనివారం) టిడిపి నాయకులు కొందరు బాధిత చిన్నారిని పరామర్శించారు.  

నరసరావుపేట ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాలికను  టీడీపీ నేతలు నన్నపనేని రాజకుమారి,మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, నజీర్,చదలవాడ అరవింద బాబులు పరామర్శించారు. చిన్నారి తల్లిదండ్రులకు దైర్యం చెప్పిన నాయకులు ఎట్టి పరిస్థితుల్లో నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. 

ఆస్పత్రి బయట నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ.... రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవన్నారు. వైసీపీ నేతలు నిందితుడిని కాపాడుతున్నారని....దీంతో పోలీసులు కేసును పక్కదారి పట్టించేలా వ్యవరిస్తున్నారని ఆరోపించారు. 

read more చిన్నారిపై అత్యాచార ఘటన: జగన్ సీరియస్, సుచరిత మాట ఇదీ..

గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘటనే దాచేపల్లిలో జరిగినప్పుడు కేవలం 24 గంటల్లోనే 18 పోలీస్ బృందాలు నిందితున్ని గుర్తించి అరెస్ట్ చేశాయని తెలిపారు. అలాగే బాలిక తల్లిదండ్రులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి బాధితులని అన్ని విధాలుగా ఆదుకున్నామని గుర్తుచేశారు. పసిపిల్లలపై అఘాయిత్యానికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు.

నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ... ఈ సంఘటన చాలా బాధాకరమన్నారు. నిందితున్ని శిక్షించే విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమన్నారు. కేసును నీరుకార్చేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. నిందితుడిని కాపాడేందుకు వైసిపి నాయకులు ప్రయత్నించడం శోచనీయమని...పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని నిజాయితీగా విచారణ చేపట్టి నిందితున్ని శిక్షించాలని ఆయన కోరారు.

read more  రాష్ట్రం తర్వాత... ముందు నీ ఇంటి సమీపంలో పర్యటించు..: జగన్ పై ఉమ కౌంటర్

అయితే ఈ అత్యాచార ఘటనపై  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సీరియస్ అయ్యారు. నిందితులను వదిలిపెట్టవద్దని, ఎంతటివారైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని, జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. రాష్ట్రంలో మరెక్కడ కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు బాధిత బాలికకు అండగా నిలుస్తామని చెప్పారు. 

లైంగిక దాడి జరిగిన 24 గంటల లోపలే నిందితుడిని అరెస్టు చేశారమని హోం మంత్రి సుచరిత కూడా వెల్లడించారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అదికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో కోలుకుంటోందని చెప్పారు. ప్రభుత్వం తరఫున బాధితురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూస్తామని అన్నారు.