గుంటూరు: రాష్ట్రముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏవర్గానికి కొమ్ముకాస్తారో, ఎవరిని ఎక్కువగా ఆదరిస్తారో, రాష్ట్రంలో చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడని, ఆయన ముఖ్యమంత్రి కావడం రెడ్లందరికీ ఎనలేని ఆనందం కలిగించిందని టీడీపీపొలిట్‌బ్యూరోసభ్యులు, మాజీమంత్రి కాలవశ్రీనివాసులు పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు, రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి కొమ్ముకాస్తుందో స్పష్టంచేశాయని ఆయన అన్నారు.

 మంగళవారం ఆయన మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తితో కలిసి గుంటూరులోని పార్టీరాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అన్నిసామాజికవర్గాలకు సమన్యాయం చేస్తే, రాజశేఖర్‌రెడ్డి, ఆయనవారసుడు జగన్మోహన్‌రెడ్డి ఎవరికి అధిక ప్రాధాన్యత ఇచ్చారో... ఇస్తున్నారో వారి నిర్ణయాలను బట్టే స్పష్టంగా అర్థమవుతోందన్నారు. తూతూమంత్రంగా పదవులు కొన్నివర్గాలకు ఇచ్చినా, అసలుసిసలు అధికారం చెలాయించేదెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. 

అటువంటి ప్రభుత్వంలో, పార్టీలో ఉన్న కొందరు బీసీనేతలు, స్పీకర్‌ స్థానంలో ఉండి తమ్మినేని చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను సమర్థిస్తూ, బీసీలంటే తెలుగుదేశానికి, చంద్రబాబుకి చిన్నచూపని ప్రచారంచేయడం ఎంతమాత్రం సరికాదని కాలవ హితవు పలికారు. రాజ్యాంగహోదాలో ఉన్నానని ఒప్పుకుంటూనే ప్రజాప్రతినిధిగా మాట్లాడుతున్నానని చెప్పిన తమ్మినేని చంద్రబాబుపై, ఆయన కుమారుడు నారాలోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. 

వాటిని సీతారామే స్వయంగా సమర్థించుకోవడం జరిగిందని, అటువంటాయనను వెనకేసుకొస్తున్న కొందరు వైసీపీ నేతలు, మంత్రులు ఆయనచెప్పిన మాటల్ని మర్చిపోయి, బీసీలంటూ కులం ప్రస్తావన తేవడం ఎంతమాత్రం భావ్యంకాదన్నారు. తన వ్యాఖ్యలకు, పదవికి సంబంధం లేదని తమ్మినేనే స్వయంగా ఒప్పుకుంటే, వైసీపీనేతలు, మంత్రులు బీసీ అయిన సీతారామ్‌ స్పీకర్‌ కావడం తెలుగుదేశానికి ఇష్టంలేదని మూర్ఖపుప్రచారం చేస్తూ అతిగా స్పందించడం విడ్డూరంగా ఉందని శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. 

READ MORE ఇక రంగంలోకి ఏసిబి...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు....: జగన్ హెచ్చరిక

తమ్మినేని సీతారామ్‌ని రాజకీయంగా పైకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీయేననే విషయాన్ని వైసీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. తనపై సీతారామ్‌ చేసిన నిరాధార ఆరోపణలకుగాను, నారాలోకేశ్‌  ఆయనకు లేఖరాస్తూ, అగ్రిగోల్డ్‌ ఆస్తులు కాజేశానన్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని, అలా చూపలేకుంటే మీరు స్పీకర్‌పదవికి రాజీనామాచేస్తారా.. అని ప్రశ్నించడం జరిగిందన్నారు. ఆధారాలుచూపితే తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని కూడా లోకేశ్‌ స్పష్టంచేయడం జరిగిందన్నారు. లోకేశ్‌ సవాల్‌ని,  స్పీకర్‌స్థానానికి ముడిపెట్టి వైసీపీనేతలు మాట్లాడటం మోకాలికి, బోడిగుండుకి ముడిపెట్టినట్లుగా ఉందని కాలవ ఎద్దేవాచేశారు. 

తమ్మినేని సీతారామ్‌ అనేవ్యక్తి  వైసీపీకి కొత్తగానీ, తెలుగుదేశానికి కాదన్నారు. తెలుగుదేశం లో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగిన సీతారామ్‌, తాను ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు రాజశేఖర్‌ రెడ్డి హాయాంలో ''రెడ్డివారే తమకు దొడ్డవారు.. కీలకపదవులన్నీ వారికేనా... ప్రజాస్వామ్య మా రెడ్డిస్వామ్యమా అంటూ సామాజిక సమతుల్యంలేని నాటి పరిస్థితులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధిక్కారస్వరం వినిపించిన విషయాన్ని, ఇప్పటి వైసీపీనేతలు గ్రహించాలని కాలవ సూచించారు. 

వైసీపీఎమ్మెల్యే రోజాచేసిన వ్యాఖ్యలను, నాడు సీతారామ్‌చేసిన వ్యాఖ్యలతో పోల్చిచూస్తే, తండ్రి కొనసాగించిన సామాజిక పరంపరను జగన్మోహన్‌రెడ్డి తూచాతప్పకుండా పాటిస్తున్నాడని అర్థమవుతోందన్నారు. రెడ్లకు కీలకపదవులు కట్టబెట్టిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో నామ్‌కేవాస్తే నేతలుగా చలామణి అవుతున్న బీసీనేతలు తమ్మినేని గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. గతంలో భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ మోదీ గుడ్డలూడదీస్తామంటే, తమ్మినేని చంద్రబాబుని ఉద్దేశించి బట్టలిప్పిస్తా నని చెప్పడం చూస్తుంటే, వైసీపీనేతలకు గుడ్డలూడదీయించే జబ్బుపట్టుకున్నట్లుందన్నారు. 

గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న జగన్‌ ఎంతటి నీచంగా, అసంబద్ధంగా, సభ్యసమాజం తలదించుకునేలా ఎలా మాట్లాడారో, వైసీపీనేతలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబుని ఉద్దేశించి ఎంతటి పరుషపదజాలం వాడారో వారే ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.  అధికారపార్టీలో ఉన్నామనే అహంకారంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న వైసీపీనేతలు,  ప్రతిపక్షం తిరిగి ఏదైనా అంటే వారిపై ఎస్సీలు, ఎస్టీలు, బీసీలని దుష్ప్రచారం చేయడం జరుగుతోందన్నారు. 

READ MORE  చంద్రబాబు దత్తపుత్రుడు: పవన్ కల్యాణ్ కు పెద్దిరెడ్డి కౌంటర్

ఢిల్లీవెళ్లినా, రాష్ట్రంలో ఉన్నా జగన్మోహన్‌రెడ్డి చుట్టూ ఉండేది రెడ్లేనని, ఈ విషయం వైసీపీలోని ఇతరవర్గాలకు చెందిన నేతలకు తెలియకపోవడం బాధాకరమన్నారు. సామాజికవర్గాలను ఓటుబ్యాంకు యంత్రాలుగా చూసే వైసీపీ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ఎంతమంది బీసీలకు న్యాయం చేసిందో, ఇసుకదొరక్కుండా చేసి ఎందరు దళితులైన కార్మికుల చావులకు కారణమైందో వైసీపీ నేతలే సమాధానం చెప్పాలన్నారు.  తెలుగుదేశంపై బురదజల్లడంకోసం కులాలు, మతాల ప్రస్తావన తీసుకురావద్దని కాలవ తీవ్రస్వరంతో హెచ్చరించారు.

తమ్మినేనికి రాజకీయ బతుకునిచ్చింది తెలుగుదేశమే : బండారు  

బీసీలను అవమానించింది, అణగదొక్కింది రాజశేఖర్‌రెడ్డేనని, ఆయన చర్యలను జగన్‌ కొనసాగిస్తున్నారని టీడీపీ సీనియర్‌నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి  ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీలను గుర్తించింది స్వర్గీయ ఎన్టీఆర్‌అని, బీసీల పేటెంట్‌ రైట్స్‌న్నీ తెలుగుదేశానికి మాత్రమే సొంతమని ఆయన తేల్చిచెప్పారు. 

దళితులను, బీసీలను స్పీకర్లను చేసింది చంద్రబాబునాయుడని, ఎంతోమంది బీసీలను రాజకీయంగా పైకి తీసుకొచ్చింది తెలుగుదేశమనే విషయాన్ని వైసీపీలోని బీసీనేతలు గ్రహిస్తే మంచిదన్నారు.  ఉమ్మడిరాష్ట్రంలో తమ్మినేని సీతారామ్‌కి అవమానం జరిగినప్పుడు, ఆయన్ని కాపాడింది చంద్రబాబు కాదా అని బండారు ప్రశ్నించారు. తమ్మినేని తన జీవితమంతా ఎన్టీఆర్‌కి, చంద్రబాబుకి రుణపడిఉండాలని, ఆయనకు రాజకీయ బతుకునిచ్చింది తెలుగుదేశం పార్టీఅనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. 

వయసులో చిన్నవాడైనా నారా లోకేశ్‌ తనలేఖ ద్వారా హుందాగా ప్రవర్తించారని, నిరాధార ఆరోపణలు నిరూపించాలని కోరితే, దానిపై స్పందించడం చేతగాక కులాల ప్రస్తావన తీసుకురావడం వైసీపీ నేతలకే చెల్లిందన్నారు. తమ్మినేని గతచరిత్రను తవ్వితీయడంలాంటి పనులు టీడీపీ చేయలేదన్నారు. బీసీనాయకులకు జగన్‌ప్రభుత్వం ఎంత విలువనిస్తుందో, వైసీపీలోని బీసీనేతలు, మంత్రులు తెలుసుకోవాలని సత్యనారాయణమూర్తి సూచించారు. 

అత్యున్నతమైన 146 కీలకస్థానాలను రెడ్లకు కట్టబెట్టిన జగన్మోహన్‌రెడ్డి, తక్కువస్థాయి పదవులను బీసీలకు, దళితులకు కట్టబెట్టాడని బండారు మండిపడ్డారు. ఢిల్లీ నుంచి గల్లీవరకు రెడ్ల రాజ్యమే నడుస్తోందన్న నిజాన్ని విస్మరించిన వైసీపీకి చెందిన బీసీనేతలు, జగన్‌ విసిరే బిస్కట్లకోసం ఆరాట పడుతూ, నోరెత్తలేనిస్థితికి తమస్థాయిని దిగజార్చుకున్నారని సత్యనారాయణమూర్తి  దుయ్యబట్టారు.