మీడియా ఆంక్షలపై ప్రకటనల ఎఫెక్ట్: రామచంద్రమూర్తి, అమర్‌లపై వర్ల రామయ్య ఫైర్
ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 2430 వివాదానికి కారణమవుతున్న విషయం తెలిసిందే. ఇది మీడియా స్వేచ్చకు భంగం కలిగించేలా వుందని ప్రతిపక్షాలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి.
అమరావతి: సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్, రామచంద్రమూర్తిలపై టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. మీడియా స్వేచ్చను హరించేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుంటే వారు నోరు మెదపక పోగా ఆ చర్యలనే సమర్థించడం సిగ్గుచేటని అన్నారు. వారసలు ఉద్యమ నాయకులేనా అని రామయ్య ప్రశ్నించారు.
వారు నిజంగానే ఉద్యమ నాయకులా..? లేక ఉత్తర కుమారులా.? అనేది స్పష్టం కావాలన్నారు. పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టులాంటి జీవో నెం.2430పై ఎందుకు స్పందించడం లేదు.? 2007లో జారీ చేసిన జీవో నెం.938కు వ్యతిరేకంగా పత్రికల్లో వ్యాసాలు, రోడ్లపై ధర్నాలు చేసిన రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్‌ల గొంతు ఇప్పుడు ఎందుకు కదలడం లేదు.? అని ప్రశ్నించారు.
పత్రికా స్వేచ్ఛకు ఉరితాడు వేసేలా ఉన్న జగన్ నిర్ణయాలను చూస్తూ కూడా మిన్నకుండిపోవడానికి కారణమేంటి.? జగన్ వేసిన బొనికలు మీ నోరు మెదపకుండా చేశాయా.? జగన్ ఇచ్చిన పదవులకు పత్రికా విలువలను తాకట్టు పెట్టారా.? మీ అక్రమాస్తుల భాగోతాలు బట్టబయలవుతాయని నిరంకుశత్వ విధానాలకు మద్దతుగా నిలుస్తున్నారా.? అంటూ ప్రశ్నలతోనే విరుచుకుపడ్డారు.
read more మీడియాపై ఆంక్షలు: జగన్ ప్రభుత్వానికి ప్రెస్ కౌన్సిల్ నోటీసులు
సమాజానికి కన్ను చెవిగా ఉండాల్సిన వారే ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు, అనైతిక విధానాలకు సలాం చేయడానికి సిగ్గుగా లేదా.? మీ సంకుచిత ప్రయోజనాల కోసం జర్నలిజం విలువలను తాకట్టు పెట్టడం హేయం అనిపించడం లేదా.? అని అన్నారు.
వ్యవస్థలోని లోపాలను, ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను ఎండగట్టే స్వేచ్ఛను నిస్సిగ్గుగా కాలరాస్తుంటే.. సీనియర్ జర్నలిస్టులుగా మీరు స్పందించకపోవడం స్వప్రయోజనాల కోసం కాదా.? కుండ బద్దలు గొట్టినట్లు వాస్తవాటు బయటపెడితే మీ ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నారా...? అంటూ రామయ్యా అమర్, రామచంద్రమూర్తిలపై ద్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం నిరాధారమైన వార్తలు రాసినా, ప్రచారం చేసినా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఓ జీఓను విడుదల చేసిందని....దీని వల్ల మీడియా స్వేచ్చకు ఎలాంటి భంగం కలగదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహావదారు దేవులపల్లి అమర్ పేర్కొన్నారు. మీడియాపై ఆంక్షలు, లక్ష్మణ రేఖ ఉండాల్సిన అవసరం ఉందా అని అంశంపై గతంలోనే చర్చలు జరిగాయని...జాతీయ మీడియా ప్రముఖులు, సంపాదకులు అనేకమందితో 2007 లో జరిగిన సదస్సు లో మీడియాకు లక్ష్మణ రేఖ ఉండాలని పేర్కొన్నారని తెలిపారు.
read more ఆ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలి: సోమిరెడ్డి
పత్రికలకు ప్రత్యేకమైన స్వేచ్ఛ ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచలేదు. కానీ ఎన్నో ఏళ్లుగా మీడియా కు స్వేచ్ఛ అనే అంశాన్ని అందరూ గౌరవిస్తూ వస్తున్నారు. కానీ గత కొంత కాలంగా రాజకీయ అండదండలతో, కొందరికే స్వలాభం కలిగేలా వార్తలు ప్రచురిస్తున్నారని ఆరోపించారు. వ్యక్తికి గాని, సంస్థకు గాని, నష్టం కలిగేలా, బురదజల్లే ప్రయత్నాలు ఏ మీడియా కూడా చేయకూడదు. అలా ఎవరైనా చేస్తే..న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం కొత్త జీఓ ను తీసుకొచ్చారని అమర్ వివరించారు.
జర్నలిజమ్ అంటే వాస్తవాలు తప్ప కల్పితాలు రాయడం కాదని, అలా చేస్తే అసలు అది జర్నలిజమ్ కానే కాదని సీనియర్ సంపాదకులు, ప్రభుత్వ సలహాదారు కె.రామచంద్రమూర్తి స్పష్టం చేశారు. ఎవరిపై అయినా వార్త రాస్తే వారి వివరణ తీసుకోవాలన్న ఆయన, అది జర్నలిజమ్‌లో ప్రాథమిక సూత్రమని చెప్పారు.
కానీ వాస్తవానికి ఇప్పుడు అలా జరుగుతోందా? అని ప్రశ్నించారు. ఇప్పుడు వచ్చిన జీఓ కొత్తది కానే కాదని, ఇప్పటి వరకు ఐ అండ్ పీఆర్ కమిషనర్‌కు మాత్రమే ఉన్న అధికారాలను శాఖాధిపతులకు కూడా ఇస్తూ అధికార వికేంద్రీకరణ చేశారని వెల్లడించారు. అంతే తప్ప దీని వెనక ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు.