వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పత్రికలపై ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన జీవో నెం.2430పై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మండిపడింది. ఈ జోవను సుమోటోగా తీసుకున్న ప్రెస్ కౌన్సిల్ ... దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సమాచారశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.

నిరాధార వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా, సామాజిక మాధ్యమాల్లో ఉంచినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆయా శాఖల కార్యదర్శులకు ప్రభుత్వం అధికారాలు కల్పిస్తూ జీవో నెం. 2430 విడుదల చేసింది.

ప్రభుత్వ పరువుకు నష్టం కలిగించేలా వార్తలు రాస్తే ఇకపై పరువు నష్టం దావా వేసేందుకు అధికారం కల్పించింది. ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉద్దేశ్యపూర్వకంగా కథనాలను రూపొందిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకురావడంతో ఆయన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.

Also Read:కలానికి సంకెళ్లు... పత్రికా స్వేచ్చకు కళ్లెం...: పేర్ని నాని సెటైర్లు

ఈ క్రమంలో పత్రికలను న్యాయస్థానాలకు ఈడుస్తామని హెచ్చరికలు జారీ చేయడం మొత్తం పాత్రికేయ ప్రపంచం నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తుందని.. ఇది పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగించేలా ఉందంటూ కౌన్సిల్ ఛైర్మన్ చంద్రమౌళీ కుమార్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం జీవోలో పేర్కొన్న అంశాలన్నింటిని ప్రెస్ కౌన్సిల్ ద్వారా పరిష్కరించుకోవచ్చునని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. 

కలానికి సంకెళ్లు... పత్రికా స్వేచ్చకు కళ్లెం.....రెండు  రోజులుగా కొన్ని పత్రికలు, చానళ్ళలో ఆకర్షణీయమైన హెడ్డింగ్స్ చూస్తున్నామని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి 
పేర్ని నాని తెలిపారు. అయితే వీరు రాసినట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వల్ల మీడియా స్వేచ్చకువ ఎలాంటి భంగం కలగడం లేదని తెలిపారు.  

కేంద్ర చట్టాల ప్రకారమే పత్రికల నియంత్రణ ఉంటుందని తెలిపారు. పత్రికల్లో ఏ వార్త, ఎప్పుడు, ఎక్కడ రాయాలో నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని...అందంతా కేంద్ర పరిధిలోని అంశమన్నారు. ఆర్టికల్ 19(A)ప్రకారం రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్ట్ ల స్వేచ్ఛ కు వచ్చిన ముప్పు ఏమి లేదని మంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జీఓ పత్రికా స్వేచ్ఛకు విఘాతం కాదన్నారు. రాజకీయ దురుద్ధేశాలతో ప్రభుత్వంపై నిరాధార వార్తలు రాస్తే సంబంధిత కార్యదర్శి స్పందనను ప్రచురించాలని జీఓ చెబుతోందన్నారు. సంబంధిత శాఖ కార్యదర్శి తన వివరణ ప్రచురించకపోతే న్యాయస్థానంను ఆశ్రయించేందుకు అనుమతించామన్నారు. 

Also Read:ఆ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలి: సోమిరెడ్డి

రాష్ట్రంలోని కొన్ని పత్రికా యాజమాన్యాలు సుప్రీంకోర్టు కన్నా తామే ఉన్నతులమన్న భావనలో ఉన్నాయన్నారు. దేశంలోని మీడియా, రాష్ట్రంలోని మీడియా వేరువేరు విధంగా పనిచేస్తున్నాయని...ముఖ్యంగా రాష్ట్రాల్లోని మీడియాకు రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని ఆరోపించారు.

కొన్ని మీడియా సంస్థలు దురుద్ధేశపూరితంగా వార్తలు రాసి రిజాయిన్డెర్ ఇస్తే వాటిని ప్రచురించకపోతే ఏం చేయాలని అన్నారు. ప్రజలు మీడియా తీరును గమనించాలని...ఏ మీడియా ఎవరి పక్షాన నిలబడి రాస్తున్నాయో ప్రజలు పరిశీలించాలని అన్నారు.