మేం కష్టపడి వండిపెట్టాం... జగన్ కేవలం వడ్డించారంతే...: అగ్రిగోల్డ్ పై మాజీ మంత్రి వ్యాఖ్యలు

అగ్రిగోల్డ్ బాధితులకోసం జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదని... కానీ అంతా తామే చేశామన్నట్లుగా ప్రచారం మాత్రం చాలా అద్భుతంగా చేసుకున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. తమ కష్టాన్ని కూడా వారి ఖాతాలోకే వేసుకున్నారని అన్నారు. 

TDP leader nakka anand babu sensational comments on cm ys jagan

గుంటూరు: అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయంచేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసిందని టీడీపీ సీనియర్‌ నాయకులు, మాజీమంత్రి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. ఆ ప్రయత్నాలన్నీ పలించి తీరా బాదితులను ఆర్థిక సాయం చేద్దామని అనుకునేలోపే ఎన్నికలు వచ్చి తమ ప్రభుత్వం కూలిపోయిందన్నారు. ఇలా ఏజెంట్లకు, డిపాజిటర్లకు నిధులివ్వడానికి తాము అన్నీసిద్ధంచేస్తే ఈ ప్రభుత్వం కేవలం డబ్బులను మాత్రమే పంచిపెడుతోందన్నారు. ఎంతో కష్టపడి తాము వంటను వండిపెడితే సీఎం జగన్ దాన్ని కేవలం వడ్డించారని... దీంతో అంతా తానే చేసినట్లు ఆయన ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. 

శుక్రవారం ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. అగ్రిగోల్ట్‌ సమస్యను గుర్తించి ప్రస్తావించారు. కోర్టు పర్యవేక్షణలోబాధితులకు న్యాయం చేయడానికి ఆ సంస్థ ఆస్తులను వేలంవేసి..తద్వారా వచ్చినమొత్తాన్ని కోర్టుకు జమచేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు. కానీ   అంతా తామే చేసినట్లు వైసీపీనేతలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.  

న్యాయ స్థానం ఆదేశాల ప్రకారం పంపిణీ చేయడానికి బడ్జెట్లో నిధులు కేటాయించిన తెలుగుదేశం ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దుర్మార్గపుప్రచారం చేస్తున్నారన్నారు. ఒక ప్రైవేట్‌ సంస్థ ప్రజలను మోసగిస్తే బాధితుల పోరాటాన్ని గమనించి ప్రజలకు ఇబ్బంది ఉండకూడదన్న సదుద్దేశంతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేసు  విచారణను సీబీసీఐడికి అప్పగించారని ఆనందబాబు తెలిపారు. 

read more  చంద్రబాబు ఇసుక దీక్ష... ఇందిరాగాంధీ స్టేడియంలో కాకుంటే అక్కడే...: టిడిపి ఎమ్మెల్సీ

కేసువిచారణ త్వరితగతిన జరిగేలా చూడటమేగాక, సంస్థ ముసుగులో ప్రజల్ని మోసం చేసినవారిని జైళ్లకు కూడా పంపడం జరిగిందన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల్ని సీజ్‌చేసి కోర్టు పర్యవేక్షణలో ఉంచిన తెలుగుదేశం ప్రభుత్వంపై బురదజల్లాలని చూడటం ప్రభుత్వాధినేతగా జగన్ కు తగదన్నారు. న్యాయస్థానంలో కేసువిచారణ జరుగుతున్నందున అగ్రిగోల్డ్‌ బాధితులకు నిధులు చెల్లింపులో జాప్యం జరిగిందని నక్కా చెప్పారు. 

ఎన్నికలకు ముందు బాధితులకు న్యాయంచేయడానికి రూ.10వేల లోపు డిపాజిటర్లకు చెల్లింపులు చేయడానికి రూ.250కోట్లను కోర్టుకి అందచేయడం కోసం నిధులు కూడా విడుదల చేశామన్నారు. వాటితో పాటు అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తులవేలం ద్వారా వచ్చిన మరికొంత మొత్తాన్ని కూడా కలిపి, మొత్తం రూ.363కోట్లు బాధితులకు ఇవ్వడానికి సిద్ధంచేశామన్నారు. 

జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక టీడీపీప్రభుత్వం విడుదలచేసిన రూ.363కోట్లలో రూ.250కోట్లు అగ్రిగోల్డ్‌ బాధితులకిచ్చి, అంతాతానే చేసినట్లు డబ్బాలు  కొట్టుకుంటున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం విడుదలచేసిన నిధులన్నీ బాధితులకు ఇవ్వకుండా కొంతకాజేసిన ప్రభుత్వం టీడీపీపై ఆరోపణలు చేస్తోందన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను తెలుగుదేశం ప్రభుత్వం సంరక్షించిందని, ఆత్మహత్య చేసుకున్న 100 మందికి పైగా డిపాజిటర్ల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం అందించిందన్నారు.

 read more తెలుగు అకాడమీతో ఇక పనేముంది...లక్ష్మీపార్వతి ఏమంటారు..: అశోక్ బాబు

ప్రైవేట్‌ సంస్థ చేసిన మోసానికి ఏ ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోలేదన్నారు. 13 జిల్లాల్లో క్యాంపులు నిర్వహించి, అగ్రిగోల్డ్‌ బాధితులను గుర్తించి, నిధులు ఇవ్వడానికి టీడీపీ ప్రభుత్వం సర్వంసిద్ధంచేశాక అధికారంలోకి వచ్చిన జగన్‌ కేవలం చెక్కులు చేతికిచ్చాడని అన్నారు. దానిలోకూడా పక్షపాతం చూపాడని ఆనందబాబు ఆరోపించారు. 

తెలుగుదేశం ప్రభుత్వం తయారుచేసిన జాబితాలో టీడీపీకి చెందినవారంటూ కొంతమంది పేర్లను  తొలగించారన్నారు. అధికారమిచ్చిన ప్రజలకోసం పనిచేయకుండా, ప్రతిపనిలో తెలుగుదేశంపై నిందలేస్తూ పబ్బం గడుపుకోవడం వైసీపీ ప్రభుత్వానికి దినచర్యగా మారిందన్నారు.

హైడల్‌ప్రాజెక్ట్‌ పనుల నిలిపివేత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం...

పోలవరం రివర్స్‌టెండరింగ్‌ విషయంలో రాష్ట్రప్రభుత్వానికి కోర్టునుంచి మరోసారి అక్షింతలు పడ్డాయని... హైడల్‌ ప్రాజెక్ట్‌ పనులు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చిందని నక్కా తెలిపారు. గందరగోళ నిర్ణయాలతో ప్రాజెక్ట్‌ పనులు ఆపేసిన ప్రభుత్వం కుంటిసాకులు చెబుతూ, స్వార్థరాజకీయాలతో తమవాళ్లకు టెండర్లు అప్పగించిందన్నారు. హైడల్‌ప్రాజెక్ట్‌ పనులు నిలిపివేయాలన్న కోర్టు ఆదేశాలపై హర్షం వ్యక్తంచేస్తున్నామన్న ఆనందబాబు  ప్రభుత్వం ఇప్పటికైనా దుందుడుకు నిర్ణయాలు విడనాడాలన్నారు. 

 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios