అధికారంలో వుండగా ఆ తప్పు చేశా... ఫలితమే: చంద్రబాబు ఆవేదన
టిడిపి పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే అధికార పార్టీలోకి చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి కార్యకర్తల మనోధైర్యం దెబ్బతినకుండా చంద్రబాబు వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే మద్దాలి గిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అన్నీ సిద్దం చేసుకున్నారు. ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్ తో కూడా ఆయన ఇటీవల భేటీ అయ్యారు. దీంతో ఆయన పార్టీ మారడం కన్ఫర్మ్ అయ్యింది. ఈ నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నాయకులతో ఎన్టీఆర్ భవన్ లో భేటి అయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ పదవులు పొందిన నాయకులు పార్టీకి దూరం అయినా, పసుపు జెండాను మరింత సమున్నతంగా నిలబెట్టడం తెలుగుదేశం కార్యకర్తల్లో ఉన్న నిబద్దతకు నిదర్శనం. పార్టీ కోసం మరింత కసిగా కార్యకర్తలు పనిచేయడం టిడిపికి ఉన్న ఒక గొప్ప వరం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గత తొమ్మిది ఎన్నికల్లో ఐదుసార్లు టిడిపి గెలవడం, ఓడిన నాలుగుసార్లలో రెండు పర్యాయాలు స్వల్ప వ్యత్యాసంతో ఓడింది’’ అని గుర్తు చేశారు.
‘‘ప్రతి ఎన్నికకు కొత్త అభ్యర్ధిని నిలబెట్టినా, పార్టీకి అండగా నిలబడి ఐదుసార్లు గెలిపించడం అనేవి ఇక్కడి కార్యకర్తలకు పార్టీపై వున్న అచంచల విశ్వాసాన్ని తెలియజేస్తాయి. గత ఎన్నికల్లో నా తప్పు ఉంది, రాష్ట్రం కోసం తపనపడ్డా, అభివృద్ది కోసం ఆరాటపడ్డా, మిమ్మల్ని పట్టించుకోలేదు.. ఎవరి కోసం రాష్ట్రాన్ని అభివృద్ది చేశామో వారంతా సాధారణంగా తీసుకున్నారు. అప్పుడు, ఇప్పుడు పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలే...'' అని చంద్రబాబు టిడిపి కార్యకర్తలపై ప్రశంసలు కురిపించారు.
read more జగన్ కాదు ఆయన తాత రాజారెడ్డి వల్ల కూడా కాదు: కేశినేని నాని
''రాష్ట్రాభివృద్దిలో పడి పార్టీని పట్టించుకోలేదనే బాధ కార్యకర్తల్లో ఉంది. ఇదొక సంక్షోభం, అయినా దీనిని ఒక అవకాశంగా తీసుకుని పార్టీని క్షేత్ర స్థాయి నుంచి పునర్నిర్మాణం చేస్తున్నాం. యువతకు, మహిళలకు మూడోవంతు పదవులు ఇచ్చాం, సగంపైగా పదవులు బిసి,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకే ఇచ్చాం. 135నియోజకవర్గాలలో సమీక్షలు పూర్తి చేశాం, ఒక్కో నియోజకవర్గానికి రెండు మూడు గంటలు సమీక్షించాం, త్వరలోనే గుంటూరు జిల్లా సమీక్షలు చేస్తాం'' అని వెల్లడించారు.
''మరో 30ఏళ్లు తెలుగుదేశం బలంగా ఉండేందుకు వీలుగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేస్తున్నాం.గత 5ఏళ్లు పార్టీకి ప్రధాన కార్యాలయం లేకపోవడంతో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడీ కార్యాలయం అందుబాటులోకి వచ్చాక కార్యకర్తలు, నాయకులతో కమ్యూనికేషన్స్ కు ఇబ్బందులు తొలిగిపోయాయి.
గత 7నెలల్లో టిడిపి కార్యకర్తలపై అక్రమ కేసులు, రాజకీయ వేధింపులు పెరిగిపోయాయి. అయినా వెనుకంజ వేయకుండా మరింత కసిగా పార్టీ కోసం పని చేస్తున్నారు. తప్పుడు కేసులకు టిడిపి కార్యకర్తలు భయపడరనేది రుజువు చేస్తున్నారు. ఈ స్ఫూర్తిని మరింతగా ముందుకు తీసుకెళ్లాలి. అన్నివర్గాల ప్రజలతో నిరంతరం మమేకం కావాలని’’ అని చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.
read more ఒక్కటే ఇల్లు ఉండాలి... కనకదుర్గమ్మను కోరుకున్నదదే: చంద్రబాబు
ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు, జివి ఆంజనేయులు, పోలిట్ బ్యూరో సభ్యులు గల్లా అరుణ కుమారి, మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, గుంటూరు పశ్చిమ ఇన్ చార్జ్ కోవెలమూడి నాని తదితరులు పాల్గొన్నారు.