అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక భారీస్థాయిలో సంక్షేమ పథకాల్లో కోత పెరిగిందని... అర్హులకు కూడా ప్రభుత్వ పథకాలు అందడం లేదని మాజీ సీఏం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యగా నిరుద్యోగ భృతి రాక యువత, పించన్లు రాక పండుటాకుల్లాంటి వృద్దులు, ఆధారం కోల్పోయిన మహిళలు అష్టకష్టాలు పడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. వారిని  జగన్ ప్రభుత్వం మోసం చేస్తోందంటూ ట్విట్టర్ ద్వారా విరుచుకుపడ్డారు. 

''కేంద్రం ఇచ్చిన రూ 6వేలకు అదనంగా రూ 12,500 ఇస్తామని చెప్పి, రైతులను మోసం చేశారు. నిరుద్యోగ భృతి రద్దు చేసి యువతకు టోపి పెట్టారు. ఇంత మోసకారి కాబట్టే 12 చార్జిషీట్లలో ఇప్పటికీ 420 సెక్షన్ కింద విచారణ ఎదుర్కొంటున్నారు. అయినా మోసాలు చేయడం మాత్రం మానుకోవట్లేదు.''
 
''పింఛను అర్హత వయసు 5ఏళ్లు తగ్గిస్తే, ఉన్న పింఛన్లు ఇంకా పెరగాల్సింది పోయి తగ్గడం వింతగా ఉంది. ఏమిటీ జగన్మాయ. 8నెలల్లో 7లక్షల పించన్లకు కోత పెట్టడం, పండుటాకులను మోసం చేయడం కాదా? 45ఏళ్లకే బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి మహిళలకు పింఛను ఇస్తామని హామీ ఇచ్చి ఏమార్చడం మోసం కాదా?''

read more  నిరుద్యోగులకు శుభవార్త... ప్రభుత్వ విభాగాల్లో భారీ ఉద్యోగాల భర్తీకి సీఎం ఆదేశం

''అమెరికాలోని న్యూజెర్సీ ప్రవాసాంధ్రుల ప్రతినిధులు నన్ను కలిసి, అమరావతి పరిరక్షణ జెఏసి తరఫున సేకరించిన ఎన్నారైల విరాళం రూ. 7,76,022ల చెక్కును అందజేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులు, మహిళలు, రైతుకూలీలు, కార్మికులకు సంఘీభావంగా ప్రవాసాంధ్రులు కూడా ముందుకు రావడం ముదావహం.''

''అంతేకాదు లండన్, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ తదితర గల్ఫ్ దేశాల్లో కూడా ఎన్నారైలు రాజధాని రైతుకు సంఘీభావ ర్యాలీలు జరపడం అభినందనీయం. ఎందుకంటే ఇది ఏ కొందరి సమస్యో, ఒక ప్రాంతం సమస్యో కాదు. వైసిపి ఆడుతున్న ఈ మూడు ముక్కలాట మొత్తం రాష్ట్రాన్నే అతలాకుతలం చేస్తుంది.''

read more  ఎన్టీఆర్ టైమ్ లో కూడా జరిగింది: శాసన మండలి రద్దుపై తమ్మినేని

''ఇప్పటికే వచ్చిన పెట్టుబడులు వెనక్కి పోయాయి. కంపెనీలన్నీ వేరే రాష్ట్రాలకు పోయాయి. కొత్త పెట్టుబడులు ఆగిపోయి, ఉపాధి కల్పనకు అడ్డుగోడ కట్టినట్టయ్యింది. తెదేపా అభివృద్ది అంతటినీ రివర్స్ చేశారు. ఈ పరిస్థితుల్లో రాజధాని అమరావతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.'' అని చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు.