Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగులకు శుభవార్త... ప్రభుత్వ విభాగాల్లో భారీ ఉద్యోగాల భర్తీకి సీఎం ఆదేశం

ఆంధ్ర ప్రదేశ్ లో భారీ స్థాయిలో ఉద్యోగ భర్తీ చేపట్టాలని  ముఖ్యమంత్రి జగన్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు సూచించారు. ప్రాధాన్యతా క్రమంలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని సూచించారు. 

AP CM Jagan Announces to Fill Job Vacancies In All Departments
Author
Amaravathi, First Published Jan 31, 2020, 2:47 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి జగన్ చర్యలు చేపట్టారు. అత్యవసరంగా ఉద్యోగులు అవసరమున్న విద్య, వైద్యం, రెవెన్యూ, పోలీస్ శాఖల్లో భారీగా స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. ఇందుకోసం శాఖలవారిగా ఖాళీలను గుర్తించాలని సీఎం ఆదేశించారు. 

ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రతి సంవత్సరం క్యాలెండర్‌ రూపొందించాలని....దాని ప్రకారమే భర్తీ  ప్రక్రియ కొనసాగించాలని సీఎం జగన్  కోరారు. క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఉన్నతాధికారులతో జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశంలో మంత్రి కొడాలి నాని, సీఎస్ నీలం సహాని, డీజీపీ గౌతమ్ సవాంగ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వారికి పలు  సలహాలు, సూచనలు ఇచ్చారు.  

వైద్య, విద్యా రంగాల్లో సమూల మార్పులను ఆశిస్తున్నట్లు తెలిపారు. వీటిలో అవసరమైన ఉద్యోగాలన్నింటినీ భర్తీచేయాలని ఆదేశించారు. పోస్టుల సంఖ్య... వాటిని శాంక్షన్‌ చేశారా లేదా అనే దానికన్నా అవసరాల మేరకు ఈ రెండు విభాగాల్లో సిబ్బందిని ఉంచాలన్నారు. ఆ మేరకు ఉద్యోగులను భర్తీచేసి ఈ రెండు విభాగాల్లో ఖాళీలు ఉంచకుండా చూడాలని ఆదేశించారు. 

సివిల్ సఫ్లైస్ డిపార్టుమెంట్ పై వైఎస్ జగన్ సమీక్ష

అలాగే పోలీసు విభాగంలో వీక్లీ ఆఫ్‌లను ప్రకటించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. దీన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. 

ప్రభుత్వ ఆస్పత్రికి ఎవరైనా రోగులు పోతే ఉండాల్సిన సిబ్బంది లేకపోతే ఆస్పత్రిని నిర్వహించడం వృథా అవుతుంది. ఇప్పటికే నాడు–నేడు ద్వారా రాష్ట్రంలోని అన్ని  ఆస్పత్రులను బాగుచేయడానికి ముందడుగు వేస్తున్నామన్నారు. అందుకే డాక్టర్లు, నర్సులు, ల్యాబ్‌ టెక్నిషియన్లు, ఫార్మసిస్టుల పోస్టుల భర్తీపై దృష్టిపెట్టాలని సీఎం  సూచించారు. 

అలాగే స్కూళ్లలో కూడా నాడు–నేడు చేపడుతున్నామని... సరిపడా సిబ్బంది లేకపోతే స్కూళ్లపై ఇంత డబ్బు ఖర్చుపెట్టిన వృథా అవుతుందన్నారు. టీచర్లు సరిపడా లేకపోతే స్కూలు సమర్థత తగ్గుతుందన్నారు. స్కూళ్లలో ల్యాబ్‌ టెక్నీషియన్లు కూడా ఉండాలని సీఎం సూచించారు. అప్పుడే స్కూళ్లలో మనం చేపడుతున్న ఆధునీకరణ పనులు, అమ్మ ఒడి, మధ్యాహ్న భోజనంలో నాణ్యతల కోసం తీసుకున్న చర్యలకు అర్థం ఉంటుందని తెలిపారు. 

పోలీసు విభాగంలో వీక్లీ ఆఫ్‌లు ప్రకటించామని...దీనివల్ల ఆ శాఖ సామర్థ్యం తగ్గకూడదన్నారు. ఇలా ఆలోచనలు చేసి ప్రాధాన్యతలు నిర్ధారించుకుని ఆమేరకు చేపట్టాల్సిన భర్తీపై కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించారు.

 read more  జగన్ కన్నా.. చంద్రబాబే నయం... మెగా బ్రదర్ నాగబాబు

రెవిన్యూ విభాగంలో కూడా ప్రాధాన్యమైన పోస్టుల భర్తీపై దృష్టిపెట్టాలన్న సీఎం సూచించారు. రెవిన్యూ డిపార్ట్‌మెంటులో సర్వే సిబ్బందికి అవసరమైన పరికరాలను సమకూర్చాలని చెప్పారు. 

ప్రభుత్వంలోని ప్రతి విభాగంతోనూ కూర్చొని ప్రాధాన్యతా క్రమంలో భర్తీ చేయాల్సిన పోస్టులపై చర్చించాలని సీఎం ఆదేశించారు. మరో మూడు వారాల్లో పూర్తిస్థాయి పరిశీలన చేసిన ప్రాధాన్యతా పోస్టులను నిర్దారిస్తామని.. వాటిని ఏయే విభాగాల ద్వారా భర్తీచేస్తామో ఒక ప్రణాళిక రూపొందిస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. ఫిబ్రవరి 21న మరోసారి సమావేశమై ఉద్యోగాల భర్తీపై కార్యాచరణ తెలియజేయని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios