గుంటూరు: ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ను పాలిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళ హక్కులను కాల రాస్తోందని టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. స్థానికసంస్థల ఎన్నికల్లో మహిళలు పోటీచేయకుండా నామినేషన్ల దగ్గరే ఆపేశారని మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి విజయమ్మ కూడా ఎన్నికల్లో పోటీ చేశారని... అప్పుడు ఆమె నామినేషన్ అడ్డుకొని ఉంటే ఆ బాధ ఎలా వుంటుందో జగన్మోహన్ రెడ్డికి తెలిసేదని అన్నారు. 

గత 9నెలలుగా మహిళలను ఉద్దరిస్తున్నామని... నవరత్నాల్లో మొత్తం పథకాలు రూపోందించి పంచిపెడుతున్నామని ప్రభుత్వం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తోందని మండిపడ్డారు. .మహిళ రక్షణ కోసం దిశ చట్టం తీసుకువచ్చామని చెప్పుకుంటున్నారు... ఇప్పడు ఆ దిశ ఎక్కడ పడుకుందని ప్రశ్నించారు. 

మంత్రాయలం, పుంగనూరు, కర్నూలు, తిరుపతి, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, అదోనితో పాటు రాష్ట్రంలోని అనేక చోట్ల మహిళలు నామినేషన్లు వేసే పరిస్థితి లేదన్నారు. మహిళలు నామినేషన్ల వేయడానికి వస్తే స్వయంగా పోలీసులే అడ్డుకునే పరిస్థితి వుందన్నారు. తిరుపతిలో అయితే ఏకంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను నామినేషన్ వేయకుండా పోలీసులు, వైసీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారని ఆరోపించారు. 

గిరిజన, మైనార్టీ మహిళ లు కూడా నామినేషన్ వేసే పరిస్థితి లేదన్నారు. అదోనిలో ఎస్సీ మహిళ నామినేషన్ వేస్తే ఆమెకు రక్షణ లేదని మీనాక్షి నాయుడు ఇంటిలో పెడితే అర్ధరాత్రి వచ్చి పంపించాలని బెదిరింపులకు దిగారన్నారు. పుంగనూరులో మహిళలు నామినేషన్లు రవికలో దాచుకొని వెళ్లితే రవికలోపల చేయి పెట్టి తీసే ప్రయత్నం వైసీపీ నాయకులు చేశారన్నారు. ఇంత దారుణంగా ప్రవర్తిస్తే  ప్రభుత్వం ఏ గుడ్డి గాడిద పళ్లు తోముతోందని మండిపడ్డారు. విజయమ్మ అనే మహిళ అవమానంతో అత్యాహత్యాయత్నం చేసుకుందని అన్నారు. 

read more  సీఎం జగన్ సొంతజిల్లాలోనే అక్రమాలు... ఎన్నికల కమీషన్ పై హైకోర్టు ఆగ్రహం

ఎలక్షన్ నిఘా యాప్ ఏమైంది? అని ప్రశ్నించారు. ఎలక్షన్ కమీషనర్ చేయాల్సిన పని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని పేర్కొన్నారు.     నామినేషన్ల వేయడానికి వచ్చిన మహిళలపై ఇలా దాడులు చేస్తే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. రాష్ట్ర వాప్తంగా ఎంపీటీసీలకు  166చోట్ల మహిళలు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని తెలిపారు. జడ్పీటీసీ నామినేషన్ల వేయకుండా 5చోట్ల అడ్డుకోవడం జరిగిందన్నారు. 

కడప జిల్లా సింహాద్రి చలంలో మహిళ నామినేషన్ వేయకుండా కిడ్నాప్ డ్రామా అడారని అన్నారు. మున్సిపల్ వార్డులో 40 మంది మహిళలను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని... కార్పోరేషన్ నామినేష్లల్లో 14మంది మహిళలపై దాడులు జరిగాయని వెల్లడించారు. 5కోట్ల జనాభాలో 50శాతం మహిళలకు వైసీపీ నాయకులు ఈ గతి పట్టించారంటే ఏమనాలి అని ఆవేదన వ్యక్తం చేశారు.  

గతంలో జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మను వైజాగ్ లో నామినేషన్ వేయకుండా ఇదే రకంగా అడ్డుకుని ఉంటే ఆ బాధ జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఉండేదన్నారు.  రాజ్యాంగబద్దంగా మహిళలకు ఉన్న హక్కును కాల రాసే పరిస్తితి ఉందని... ఆ హక్కులు కాపాడే వ్యక్తి చంద్రబాబునాయుడు అని ఆ రాష్ట్ర మహిళలకు అర్ధం అయిందన్నారు. 

నిజంగా మహిళ పట్ల చిత్తశుద్ధి ఉంటే మళ్లీ నామినేషన్ల వేయడానికి రీ నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. అర్డినెన్స్ తీసుకొచ్చి ఎవరెస్టు ఎక్కినట్లు ఫీల్ అవ్వుతున్నారని... అయితే మద్యం షాపులు నడిపేది ప్రభుత్వమేనని, మరి మద్యం బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు.టీడీపీ నాయకులు నామినేషన్ల వేయకుండా మద్యం సీసాలను టీడీపీ నాయకుల ఇళ్లల్లో పెట్టి భయపెట్టుతున్నారని ఆరోపించారు. 

తమ ప్రాణాలు పోయిన మేము ప్రజాస్వామ్యం కాపాడటం కోసం పోరాటం చేస్తామన్నారు. రీ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మహిళ ద్రోహులుగా వైసీపీ నాయకులు మిగిలిపోతారన్నారు.  మహిళలపై జరుగుతున్న దాడులకు డీజీపీ  సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమకు రక్షణ కావాలంటే తాము కెమెరాలు పెట్టుకోవాలా? అని అనురాధ ప్రశ్నించారు.