Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ సొంతజిల్లాలోనే అక్రమాలు... ఎన్నికల కమీషన్ పై హైకోర్టు ఆగ్రహం

ఆంధ్ర ప్రదేశ్ స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణ తీరుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల కమీషన్ తన పనితీరును మార్చుకోవాలని హైకోర్టు ఆదేశించింది. 

AP High Court Angry  on Election Commission over Local  Body Elections
Author
Kadapa, First Published Mar 14, 2020, 2:01 PM IST

అమరావతి: ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘంపై హై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పదేపదే చెబుతున్నా అధికారుల తీరు మారకపోవడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. చిత్తూరు, కడప జిల్లాలలో అధికార దుర్వినియోగం జరిగిందంటూ టీడీపీ నేత కోవెలముడి రవీంద్ర  న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఎన్నికల సంఘం తీరును తప్పుబట్టింది. 

చిత్తూరులో చీరల పంపిణీ, కడపలో డిప్యూటీ సీఎం గ్రామ వాలంటీర్లతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై రవీంద్ర న్యాయ స్థానానికి ఫిర్యాదు చేశారు. ఇళ్ల స్థలాలు రావాలంటే తమకు అనుకూలంగా ఓట్లు వేయాలని ప్రచారాలు నిర్వహించిన వీడియో ఆధారాలు  పిటిషనర్ సమర్పించారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని అందువల్లే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని  పిటిషనర్ తెలిపారు. 

read more   జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్తాకి బైండోవర్

దీంతో న్యాయస్థానం అతడి ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ఈసీని కోరింది. ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి దీనిపై నివేదిక కోరామని ఈసీ తరపు న్యాయవాది తెలపడంపై సిజే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ విశేష అధికారాల గురించి ఈసీని ప్రశ్నించారు. పిటిషనర్ 3వ తేదీన ఫిర్యాదు చేస్తే ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని న్యాయమూర్తి నిలదీశారు. 

ఎన్నికల సమయంలో కలెక్టర్లు, ఎన్నికల సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం ఎన్నికల సంఘం పరిధిలోనే ఉంటారని సీజే గుర్తు చేశారు. కలెక్టర్ల నుంచి నివేదికలు కూడా తెప్పించుకోలేని స్థితిలో రాష్ట్ర ఈసీ ఉండటం దారుణమన్నారు. ఇంత తక్కువ సమయంలో ఎన్నికలు ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.

ఎన్నికల నిర్వహణ ప్రభుత్వ ఇష్టమని అనడంతో నామినేషన్లకు 5రోజుల గడువు ఇవ్వాల్సి ఉండగా 3రోజులే ఇచ్చారని పిటిషనర్ తరపు న్యాయవాది వీరారెడ్డి  కోర్టుకు విన్నవించారు. ఈసీ పని తీరు మార్చుకోవాలని సీజే హెచ్చరించారు. 

readmore   విశాఖలో నా స్థలమే కబ్జా చేశారు, గన్ ఎక్కుపెట్టి సెటిల్మెంట్లు: కన్నా

ఎన్నికల ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సోమవారం నాటికి కోర్టుకు తెలపాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ఎన్నికల సంఘానికి తెలపాలని హై కోర్ట్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios