Asianet News TeluguAsianet News Telugu

''శవాన్ని పీక్కుతున్న ఎలుకలు... ముఖ్యమంత్రి రాజీనామాకు డిమాండ్..''

ఏలూరు ప్రభుత్వాసుపత్రి శవాగారంలోని మృతదేహం కళ్లను ఎలుకలు పీక్కుతినడం చూస్తుంటే వైసీపీ ప్రభుత్వం ఆసుపత్రుల నిర్వహణను ఎంత చిత్తశుద్ధితో అమలుచేస్తోందో అర్థమవుతోందన్నారు ఎమ్మెల్సీ అశోక్ బాబు. 

MLC Ashok Babu demands CM YS Jagan resign
Author
Guntur, First Published Jan 31, 2020, 7:33 PM IST

గుంటూరు: రాజకీయంగా, ఆర్థికంగా, పరిపాలనా విధానాల్లో విఫలమైన వైసీపీ ప్రభుత్వం చివరికి పేదలకు మెరుగైన వైద్య సేవలందించడంలో కూడా ఘోరాతిఘోరంగా విఫలమైందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ  పీ.అశోక్‌బాబు పేర్కొన్నారు. ఇందుకు ఏలూరు ప్రభుత్వాసుపత్రి చోటుచేసుకున్న ఘటనే పెద్ద ఉదాహరణ  అని పేర్కొన్నారు. 

శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి శవాగారంలోని మృతదేహం కళ్లను ఎలుకలు పీక్కుతినడం చూస్తుంటే వైసీపీ ప్రభుత్వం ఆసుపత్రుల నిర్వహణను ఎంత చిత్తశుద్ధితో అమలుచేస్తోందో అర్థమవుతోందన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పేదల ఆరోగ్యాన్ని దృష్టిలోపెట్టుకొని దోమలపై యుద్ధం కార్యక్రమాన్ని ప్రకటిస్తే అసెంబ్లీ సాక్షిగా అవహేళనలు చేసిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇప్పుడు జరిగిన ఘటనపై ఏం సమాధానం చెబుతాడని అశోక్‌బాబు ప్రశ్నించారు. 

టీడీపీ ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం విరివిగా నిధులు కేటాయించి పారిశుధ్య నిర్వహణ, పెస్ట్‌ కంట్రోల్‌ వంటి చర్యలను సమర్థవంతంగా నిర్వహించిందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఎలుకలు, బొద్దింకలు, దోమల నివారణకు నిధులు కేటాయించి చర్యలు తీసుకున్న టీడీపీ ప్రభుత్వాన్ని అపహాస్యం చేసిన వైసీపీ నేడు అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిందన్నారు. 

చంద్రబాబు హాయాంలో జరిగిన ఘటనలు, ఆసుపత్రుల నిర్వహణకు తీసుకున్న చర్యలను తప్పుపట్టిన వైసీపీ మంత్రులు ఏలూరు ఆసుపత్రి ఘటనకు బాధ్యతవహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ డిమాండ్‌ చేశారు. వైద్యరంగానికి అరకొరగా నిధులిస్తూ ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అప్పగించిన జగన్‌ సర్కారు, పేదలకు మెరుగైన వైద్యమందకుండా మోకాలడ్డిందన్నారు. 

read more  ఇప్పటికే ఆర్టీసి, పెట్రోల్ పై బాదుడు... త్వరలో ఏపి ప్రజలపై మరో భారం: అనిత

ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ రోగులకు మెరుగైన సేవలందించాలంటే వాటికి సకాలంలో నిధులు అందాలని, ఇన్సూరెన్స్‌ కంపెనీలు నిధుల విషయంలో కోతలు పెడుతుండటంతో ప్రైవేటు యాజమాన్యాలు రోగులను నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్టార్‌హెల్త్‌ ఇన్సూరెన్స్‌కి అప్పగించడంవల్ల మెరుగైన వైద్యసేవలందక పేదలు నానా ఇబ్బందులు పడిన విషయాన్ని జగన్‌ సర్కారు గుర్తించాలని అశోక్‌బాబు సూచించారు. 

చమురు, మద్యం, ఇసుక ధరలు పెంచిన జగన్‌ సర్కారు పేదలు, మధ్య తరగతి వారికి చుక్కలు చూపుతోందని, వైద్య రంగంలో కూడా ఆయావర్గాలకు అన్యాయం జరిగేలా అరకొరగా నిధులు కేటాయిస్తోందన్నారు. మార్చి 2019 నాటికి పెండింగ్‌లో ఉన్న 9వేల ఆరోగ్యశ్రీ దరఖాస్తులకు తక్షణమే నిధులు కేటాయించాలన్నారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా టీడీపీ తరుపున పోరాటంచేస్తామని అశోక్‌బాబు హెచ్చరించారు.

 గత ప్రభుత్వం ఆమోదించిన సీఎమ్‌ఆర్‌ఎఫ్‌ నిధుల్ని కూడా నిలిపివేశారన్నారు.  ప్రజారోగ్యం కోసం చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్యలను తప్పుపట్టి, ఆయన్ని తులనాడిన మంత్రులు, ముఖ్యమంత్రి ఏలూరులో జరిగిన ఘటనకు బాధ్యతవహిస్తూ తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. 

read more రాజధాని కోసం రెండెకరాలు... గుండెపోటుకు గురైన అమరావతి రైతు

మండలిని రద్దుచేసినా సభ్యులుగా తాము అమరావతి పోరాటాన్ని ఆపేదిలేదని, ప్రభుత్వం మండలిరద్దుతో పరిధిదాటిన నేపథ్యంలో తాముకూడా తమ పరిధులు దాటి రాజధాని కోసం పోరాటం చేస్తామని అశోక్‌బాబు స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios