మచిలీపట్నం: బందరు కాంట్రాక్టు వర్కు టెండరులలో అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించిన రాష్ట్ర మంత్రి పేర్ని నాని. కాంట్రాక్టు పనులలో అవినీతి జరిగిందని... అందులో వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని నిరూపిస్తే ప్రాణం తీసుకుంటానని అన్నారు. పరువు కోసం బతికే మనిషిని తాను అంటూ కొల్లు రవీంద్రపై విరుచుకుపడ్డారు. 

మచిలీపట్నం ఆర్ అండ్ బి అతిధి గృహంలో మంత్రి మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 2015లో రెండు కోట్లు, 2016లో 3 కోట్లు నిధులు వస్తే పనులకు టెండర్లు పిలిచినా రద్దు చేసి పనులు చేయకుండా తాత్సారం చేశారు మామా అల్లుళ్ళు అని ఆరోపించారు.

కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక 19 కోట్లు మంజూరు అయ్యాయని అన్నారు. 2015-16 మిగులు నిధులు 5 కోట్లు కలిపి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించామని తెలిపారు. ఇలా చేయడంలో తప్పేముందని ప్రశ్నించారు. దీనిపై మాజీ మంత్రి చాలా ఎక్కు మాటలు మాట్లాడుతున్నారని... నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.

read more  సీఎం జగన్ ఇంటివద్దే గంజాయి దందా...: పంచుమర్తి అనురాధ సంచలనం

ప్రస్తుతం 6.50 కోట్లతో డ్రైనుల పనులు సాగుతున్నాయని తెలిపారు. రూ.25 కోట్ల రూపాయలు కాంట్రాక్టు పనులు ఒక్క కాంట్రాక్టర్ కు అప్పచెప్పలేదని... ఆన్లైన్లో టెండర్ వేసిన కాంట్రాక్టర్ లకే ఈ పనులు అప్పజెప్పామన్నారు. వారు ఇప్పటికే పనులు కూడా ప్రారంభించారని మంత్రి తెలిపారు. 

పేద పిల్లలు చదువుకునే బడుల్లో క్లాసురూములు నిర్మాణాల్లో కూడా అవినీతికి పాల్పడిన మామా అల్లుళ్లు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు.  ఒకొక్క క్లాసు రూముకి 25 వేలు లంచం తీసుకున్నది ఈ మామా అల్లుళ్లే కాదా అని అన్నారు. ఇలాంటి వారు తనపై ఆరోపణలు చేయటం హాస్యాస్పదంగా వుందని... పచ్చకామెర్లు ఉన్నవాడికి ప్రతిదీ పచ్చగా కంపించినట్లు అవినీతిలో కూరుకుపోయిన మామా అల్లుళ్ళు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మంత్రి పేర్ని నాని ఘాటు విమర్శలు చేశారు.