అమరావతి: 2020 చివరికల్లా లక్ష ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వెల్లడించారు. ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాలలో కలిపి రాష్ట్ర యువతకు లక్ష ఉద్యోగాల కల్పనకు కృషి చేయాలని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలోని సమావేశమందిరంలో గురువారం మంత్రి గౌతమ్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పారిశ్రామిక విధానం, ఉపాధి కల్పన, పాలసీలో దృష్టి పెట్టవలసిన కీలక రంగాలపై ఈ సమావేశంలో ప్రధానంగా మంత్రి చర్చించారు. 

లక్నో, ఢిల్లీ పర్యటనల విజయవంతానికి కృషి చేసిన ఈడీబీ బృందాన్ని మంత్రి మేకపాటి అభినందించారు. ఇప్పటివరకూ సంక్షేమం దిశగా ప్రభుత్వ పాలన సాగిందని, ఇకపై పారిశ్రామికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించినట్లు మంత్రి తెలిపారు. అందుకు తగ్గట్లుగా ఈడీబీని మరింత పటిష్టం చేయాలని  పరిశ్రమల శాఖ డైరెక్టర్ కు మంత్రి సూచనలిచ్చారు. రాష్ట్రం తరపున ఢిల్లీ కేంద్రంగా ప్రత్యేక ఈడీబీ బృందాన్ని నియమించే ప్రక్రియ చేపట్టాలని మంత్రి గౌతమ్ రెడ్డి ఆదేశించారు. 

ఇండస్ట్రియల్ పాలసీ 2020-2025తో పెట్టుబడుల ప్రవాహం ఖాయం

పారిశ్రామిక విధానం - 2020-2025 పెట్టుబడుల ప్రవాహాన్ని తీసుకువచ్చేలా ఉండాలని మంత్రి మేకపాటి అధికారులకు దిశానిర్దేశం చేశారు. పారిశ్రామిక వేత్తలతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికీ అనువైన పాలసీగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. పరిశ్రమలకు అందించే పవర్ సబ్సిడీ వివరాలు ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉందన్న విషయంపైనా మంత్రి ఆరా తీశారు. పెట్టుబడిదారులు పదే పదే రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేలా పాలసీ ఉండాలని తద్వారా రాష్ట్రం పారిశ్రామికవృద్ధి సాధించాలని మంత్రి వ్యాఖ్యానించారు. 

read more  ప్రధానితో జగన్ భేటీ... విజయసాయికి కేంద్ర మంత్రి పదవి కోసమే...: దేవినేని ఉమ

పారిశ్రామిక విధానంలో ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్, డిఫెన్స్, ఆటో మోటివ్, ఆహారశుద్ధి, వస్త్ర, ఫార్మా, వ్యవసాయ, విద్య, నైపుణ్య రంగాలకు అధిక ప్రాధాన్యమివ్వాలని మంత్రి అన్నారు. సరైన సదుపాయాలు కల్పించి ప్రోత్సహిస్తే అన్ని రంగాలకు అనుకూల వాతావరణముండే ఏపీలో పెట్టుబడుల ప్రవాహం ఖాయమని మంత్రి తెలిపారు. రంగాల వారిగా పరిశ్రమల స్థాపనకు జిల్లాలలో అందుబాటులో ఉన్న ఏపీఐఐసీ భూముల వివరాల లెక్క తేల్చాలని మంత్రి తెలిపారు. 

చక్కెర పరిశ్రమలను చక్కదిద్దే చర్యలు

రాష్ట్రంలోని చక్కెర పరిశ్రమలను చక్కదిద్దే చర్యలపై ఆ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండేతో మంత్రి చర్చించారు. ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, వాటిలో పునరుద్ధరించాల్సినవి ఎన్ని ఉన్నాయన్న వివరాలపై ఆరా తీశారు. చక్కెర పరిశ్రమను గాడిన పెట్టడానికి ఉన్న మార్గాలను, వివరాలను మంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. మిగతా రాష్ట్రాలలో ఉత్పత్తి, స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు ప్రభుత్వం అందించే సాయం తదితర వివరాలను మంత్రి కనుక్కున్నారు. 

అనంతరం మంత్రి గౌతమ్ రెడ్డితో సమావేశమైన ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ సుమిత్ ఫైబర్ నెట్ పై పూర్తి వివరాలు మంత్రికి వెల్లడించారు. ఫైబర్ నెట్ కు తీసుకుంటున్న ప్రస్తుత, గత ధరల వివరాలు, ఎన్ని ఛానళ్లు వంటి అంశాలపై మంత్రి అడిగి తెలుసుకున్నారు.  

read more  ఈ ఐదింటిపై అప్పుడేమన్నారు...? ఇప్పుడేం చేస్తున్నారు...?: జగన్ ను నిలదీసిన బోండా ఉమ

పారిశ్రామిక విధానంపై మంత్రి మేకపాటి నిర్వహించిన సమీక్ష సమావేశంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, ఫుడ్ ప్రాసెసింగ్, షుగర్ కార్యదర్శి కాంతిలాల్ దండే, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఓఎస్డీ పద్మావతి, పరిశ్రమల శాఖ సలహాదారులు జి.వి.గిరి (ప్రమోషన్),  లంకా శ్రీధర్ (ఇన్ఫ్రా స్ట్రక్చర్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్), ఈడీబీ అధికారులు పాల్గొన్నారు. 

మంత్రిని కలిసిన ‘స్టేట్ ఆటో ఫైనాన్సియల్ కార్పొరేషన్’ కంపెనీ ప్రతినిధులు

 మంత్రి కార్యాలయంలో అమెరికాకు చెందిన ‘స్టేట్ ఆటో ఫినాన్సియల్ కార్పొరేషన్’(STFC) కంపెనీ సీఐఎస్ఓ గ్రెగ్ టచ్చేటి, వైస్ ప్రెసిడెంట్ సురేశ్ దండు, సీటీవో రాము లింగాల మంత్రి గౌతమ్ రెడ్డిని కలిశారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యానికి ఆసక్తిగా ఉన్నట్లు ఎస్ టీఎఫ్ సీ కంపెనీ ప్రతినిధులు మంత్రికి తెలిపారు. 

రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు, నిర్ణయాలను మంత్రి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ , ఐ.టీ సలహాదారు (టెక్నికల్) విద్యాసాగర్ రెడ్డి పాల్గొన్నారు.