ఆ మూడు సిద్దాంతాలను ఫాలో అవుతున్న వైసిపి...: కళా వెంకట్రావు
అనంతపురంలోని కియా కార్ల పరిశ్రమను పరిశీలించేందుకు వెళ్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు ఖండించారు.
గుంటూరు: ఏపీలో ప్రజలు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేక రావణ కాష్టంలో ఉన్నారా అనే పరిస్థితుల్ని ప్రభుత్వం సృష్టిస్తోందన్నారు ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు. పాలనను పక్కన ఎట్టి ఎమర్జెన్సీ పరిస్థితులు సృష్టించడమే ధ్యేయంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏ తప్పు చేయని మాజీ ఎంపీ హర్షకుమార్‌ను అన్యాయంగా 42 రోజుల పాటు జైలులో ఉంచి మనోవ్యధకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతికి మద్దతివ్వాలని వైసిపి ఎంపీ నందిగాం సురేష్‌కు విద్యార్థులు గులాబీలు ఇచ్చి విన్నవిస్తే దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారని... దీంతో పోలీసులు కనీసం విచారించకుండా 10 రోజులుగా విద్యార్థుల్ని జైల్లో పెట్టి హింసించారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం రెచ్చగొట్టడం, దాడులకు పాల్పడటం, ఆర్థిక మూలాలను నాశనం చేయడం అనే మూడు సిద్ధాంతాలతో పని చేస్తోందన్నారు. ఒక నేరస్థుడికి అధికారం అప్పగిస్తే రాష్ట్రం ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కల్లారా చూస్తున్నారని విమర్శించారు.
read more ఎన్నికలప్పుడు కూతలు కూశారు... ఇప్పుడు కోతలు మొదలయ్యాయి...: నారా లోకేశ్
సెక్షన్ 144 ను విచ్చల విడిగా వాడుతూ ప్రజాస్వామ్య రాజ్యంలో నియంతృత్వ పోకడలకు పోవడం బాధాకరమన్నారు. ''ఒక ప్రజాప్రతినిధికి ప్రతిష్టాత్మక కియా పరిశ్రమను పరిశీలిస్తే తప్పేముంది..? అసలు అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది...? పరిశ్రమను పరిశీలిస్తే మీకెందుకంత ఉలుకు.? ఇప్పటికే మీ అసమర్ధ చర్యలకు కొత్త పెట్టుబడులు రాకపోగా ఉన్న పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి'' అంటూ కియా కార్ల పరిశ్రమను పరిశీలించేందుకు వెళ్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేయడంపై విరుచుకుపడ్డారు.
రామకృష్ణను ప్రభుత్వమే అప్రజాస్వామికంగా పోలీసులచే అరెస్టు చేయించిందన్నారు. ఆయన అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు తెలిపారు.