ఎన్నికలప్పుడు కూతలు కూశారు... ఇప్పుడు కోతలు మొదలయ్యాయి...: నారా లోకేశ్

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి కోసం జరిపే పోరాటంలో కేసులు పెట్టినా భయపడకూడదని... టిడిపి ప్రభుత్వం వచ్చాక ఆ కేసులన్నీ ఒక్క జీవోతో కేసులన్నీ తొలగిస్తామన్నారు. 

Nara Lokesh fires on AP CM YS Jagan

నందిగామ: ఆంధ్ర ప్రదేశ్ కు రాజధానిగా అమరావతి ఏర్పాటుచేసే సయమంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదని మాజీ మంత్రి, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అసెంబ్లీలో చర్చించి ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్ జై కొట్టిన తరువాతే అమరావతిని రాజధానిగా నిర్ణయించామన్నారు. 

అమరావతిని రాజధానిగా ప్రకటించిన రోజే అప్పటి సీఎం చంద్రబాబు రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రణాళిక ప్రకటించారని తెలిపారు. అందులోభాగంగా రాయలసీమను ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్స్ హబ్ గా, విశాఖను ఐటీ కేంద్రంగా తీర్చదిద్దారని లోకేశ్ వెల్లడించారు.

ఎన్నికలకు ముందు కూతలు కుసిన వైసిపి నాయకులు, సీఎం జగన్ ఇప్పుడు కోతలు మొదలెట్టారని అన్నారు. ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అన్న జగన్ గెలిచిన తరువాత మూడు ముక్కల రాజధాని అంటున్నారని ఆరోపించారు. 

read more  సీఎం జగన్ ఎక్కడినుండయినా పాలించవచ్చు..: మంత్రి పెద్దిరెడ్డి

ప్రపంచంలో కేవలం ఒక్క దేశంలో మినహా ఎక్కడా మూడు ముక్కల రాజధాని లేదు...మన దేశంలో అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ లో కూడా ఒకే రాజధాని ఉందని లోకేశ్ అన్నారు.

57 రోజులుగా రైతులు, మహిళలు, యువకులు రాజధాని కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా... ఒక రాష్ట్రం ,ఒకే రాజధాని అని నినదిస్తున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అంతేకాకుండా ఉద్యమిస్తున్న రైతుల్ని పెయిడ్ ఆర్టిసులు అంటున్నారని మండిపడ్డారు. రైతులు కేవలం బురదలోనే ఉండాలన్నది వారి ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. 

రాజధాని కోసం పోరాడుతున్న మహిళల్ని పోలీసు బూటు కాలుతో తన్ని అవమానించారని  గుర్తుచేశారు. అమరావతి కోసం రైతులు చనిపోతే పట్టించుకోని ప్రభుత్వం తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి సిగ్గు లేదా అని విమర్శించారు. 

read more  ఆ విషయంలో కుప్పం ప్రజల మద్దతు మాకే... తీర్మానం కూడా...: ఆదిమూలపు సురేష్

నందిగామలో స్థానిక వైసిపి ఎంపీకి గులాబీ పూలు ఇచ్చి యువకులు గాంధేయ మార్గంలో నిరసన తెలిపారని..ఆయన ముందు కేవలం జై అమరావతి అన్నందుకు యువకులపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. 

రైతులు, మహిళలు, యువకులు బయటకు రాకుండా ఉండాలని ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని వివరించారు. బ్రిటీషు కాలంలో జై హింద్ అంటే జైలుకి పంపేవారని కానీ ఇప్పుడు జై అమరావతి అంటే జగన్ జైలుకి పంపుతున్నారని మండిపడ్డారు.

విశాఖ ని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడేనని అన్నారు. హుద్ హుద్ వస్తే చంద్రబాబే ముందుండి విశాఖ పరిస్థితిని చక్కదిద్దారని అన్నారు. ఎన్నికల సమయంలో జగన్ సంక్షేమ పథకాలను పెంచుకుంటూ పోతా అన్నారని... ఇప్పుడేమో సంక్షేమ కార్యక్రమాలు ఎత్తేస్తున్నారని అన్నారు. ఆర్టీసీ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, ఫైబర్ గ్రిడ్, ఇసుక ధర, పెట్రోల్ ధరలు ఇలా అన్ని ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. 

సీఎం జగన్ తుగ్లక్ ని మించిపోయారన్నారు. జగ్లక్ జగ్లక్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఎన్ని కేసులు పెట్టినా అమరావతి ఉద్యమం ఆగదన్నారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని... అప్పుడు ఒక జీవో తో కేసులన్నీ తొలగిస్తామని లోకేశ్ అన్నారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios