గుంటూరు: రాజధాని పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశారని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఆయనకు అమరావతి, విశాఖపట్నం దేనిపైనా ప్రేమలేదు.... కేవలం తన రియల్ ఎస్టేట్ వ్యాపారం, దోపిడీకి  అనుకూలంగా వుంటుందనే రాజధానని వైజాగ్ కు మారుస్తున్నాడని అన్నారు.  అంతేకాని విశాఖపట్నంపై ఆయనకు ప్రేమ వుందంటే పొరబడినట్లేనని అన్నారు.

గతంలో టిడిపి తప్పులు చేసిందని విమర్శించిన వైసిపి అధికారంలోకి రాగానే అలాంటి తప్పులే చేస్తోందన్నారు. అమరావతి ఐదు కోట్ల ప్రజలు ఆమోదించిన రాజధాని అని.... దాన్ని తరలించడం అసాధ్యమన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి తాము అమరావతి కోసం పోరాడుతున్నామని... ప్రభుత్వం కూడా ఆ ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తే బావుంటుందన్నారు. 

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్  వైసీపీ స్టాండ్‌ తీసుకోవడం బాధ కలిగించిందన్నారు. ఏపీలో చోటుచేసుకున్న పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. జాతీయస్థాయిలో రాష్ట్ర రాజధాని ఉద్యమాన్ని తీసుకెళతామన్నారు. 

read more జనసేన ఆఫీస్ లోనే పవన్‌ కల్యాణ్‌... గేటు కూడా దాటనివ్వని పోలీసులు  

పోలీసుల లాఠీ ఛార్జ్ లో గాయాలపాలైన రైతులు, మహిళలను పరామర్శించేందుకు బయల్దేరిన పవన్ కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలోనే అడ్డుకున్నారు. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ తోపాటు 30 పోలీస్ యాక్టు అమల్లో ఉందని పర్యటన విరమించుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. ఆయన్ను జనసేన కార్యాలయంలోనే హౌస్ అరెస్ట్ చేశారు. 

ఆందోళనలో గాయపడ్డ ప్రజలను పరామర్శించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీగా తమపై ఉందని... ఎర్రబాలెం గ్రామం వరకు వెళ్లి గాయపడ్డ రైతులు, మహిళలకు సానుభూతి తెలుపుతామని పవన్ కళ్యాణ్ చెప్పినా పోలీసులు ముందుకు కదలనివ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ ఆఫీసులోకే వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం అన్యాయమన్నారు.

read more  అక్కడికి వెళ్లి తీరుతాం, ఎలా అడ్డుకుంటారో చూస్తాం: నాగబాబు

'' ఆక్టోపస్, యాంటీ నక్సల్ స్క్వాడ్,  రిజర్వ్ , సివిల్ పోలీసులు తదితర విభాగాల నుంచి సుమారు 7 వేల 200 మంది పోలీసులను తీసుకొచ్చి రైతులపై దాడులు చేయడం బాధాకరం.  రాజధాని అమరావతిలోనే ఉంటుందని ఇక్కడ ప్రజలకు మాటిచ్చాం. ఇది భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి తీసుకున్న నిర్ణయం. రాజధాని పర్యటనకు వెళ్తామంటే లా అండ్ అర్డర్ పేరు చెప్పి అడ్డుకుంటున్నారు.'' అని మండిపడ్డారు. 

''లాస్ట్ టైంలాగా కంచెలు దాటుకొని వెళ్లిపోగలం. అయితే పోలీసు శాఖ, లా అండ్ అర్డర్ పై ఉన్న గౌరవంతో ఇంతసేపు ఆగాను. మీది నిజంగా లా అండ్ అర్డర్ సమస్యే అయితే  నా వాహనంతోపాటు మరో వాహనానికే పర్మిషన్ ఇవ్వండి. మీరే నన్ను దగ్గరుండి రాజధాని గ్రామాల్లోకి తీసుకెళ్లండి. బాధిత రైతులు, మహిళలను పరామర్శించాక మీరే తీసుకురండి" అని పోలీసులను పవన్ కోరారు. అయినా పోలీసులు అందుకు అంగీకరించకుండా పవన్ ను బయటకు రాకుండా అడ్డుకున్నారు.