అమరావతి: రాజధాని గ్రామాల్లో పర్యటించాలనుకుంటున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుండి అమరావతి గ్రామాల సందర్శనకు బయలుదేరిన అతన్ని గేటు వద్దే పోలీసులు ఆపేశారు. దీంతో వారితో పవన్ వాగ్వివాదం జరిగింది. అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పర్యటనను విరమించుకోవాలని పవన్ ను పోలీస్ అధికారులు కోరుతున్నారు.  

ఈ పరిణామాల నేపథ్యంలో జనసేన ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం సాయంత్రం టెన్షన్ వాతావరణం నెలకొంది. జనసేన కార్యాలయాన్ని పోలీసులు భారీగా చుట్టుముట్టారు. జనసేన ప్రధాన కార్యాలయం చుట్టూ పోలీసులు మోహరించిన విషయం తెలుసుకొన్న జనసేన కార్యకర్తలు కూడా  ఇప్పటికే భారీ సంఖ్యలో పార్టీ కార్యాలయం వద్దకు చేరుకొన్నారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. 

read more  అక్కడికి వెళ్లి తీరుతాం, ఎలా అడ్డుకుంటారో చూస్తాం: నాగబాబు

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు సీఆర్‌డీఏ రద్దు బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను జనసేన వ్యతిరేకిస్తోంది. కానీ, జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం ఈ బిల్లులకు అనుకూలంగా అసెంబ్లీలో మాట్లాడారు.

రాజధానికి చెందిన మందడం, ఎర్రబాలెం, పెనుమాక గ్రామాల్లో  పర్యటించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.సోమవారం నాడు సాయంత్రం జనసేన  పీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే జనసేన కార్యాలయంలోకి పోలీసులు ప్రవేశించారు. పోలీసులు పార్టీ కార్యాలయంలోకి  రావడంపై   తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

read more  పవన్ కళ్యాణ్‌పై తిరుగుబాటు: అసెంబ్లీలో మూడు రాజదానులకు జై కొట్టిన రాపాక