స్థానిక సంస్థల ఎన్నికలపై వీడని ఉత్కంఠ... ఎటూతేల్చని హైకోర్టు
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్ధల ఎన్నికలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. రిజర్వేషన్ విషయంలో ఏపి హైకోర్టు ఇవాళ ఇరుపక్షాల వాదనలు విన్నప్పటికి తీర్పును మాత్రం రిజర్వ్ లో పెట్టింది.
ఆంధ్ర ప్రదేశ్ స్థానికసంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై మరో సారి హైకోర్టు విచారణ జరిపింది. ఇరపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును మాత్రం వెలువరించలేదు. దీనిలో లోతుగా విశ్లేషణ జరపాల్సిన అవసరం వుండటంతో తీర్పును రిజర్వ్ చేసింది.
స్థానిక రిజర్వేషన్లపై పిటిషనర్ తన వాదనను గట్టిగా వినిపించారు. గతంలో కె.కృష్ణ మూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని వుందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితితుల్లో రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు వుందని ఏజీ ప్రభుత్వ వాదనను వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.
read more కరెంట్ తీగలు పట్టుకుని ప్రాణత్యాగానికి సిద్దమే...: దేవినేని ఉమకు మాజీ హోంమంత్రి సవాల్
ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50శాతాన్ని మించడంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల శాతం 50కి మించకూడదని చెబుతోంది. దీన్నిబట్టి చూస్తే హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే అవకాశాలున్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు ప్రభుత్వం మాత్రం రిజర్వేషన్లను పెంచుకునే వెసులుబాటు వుందని చెబుతోంది. దీన్ని దృష్టిలో వుంచుకునే స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు చెబుతోంది. ప్రభుత్వం, పిటిషనర్లు తమ వాదనలు గట్టిగానే కోర్టు ఎదుట వినిపించినప్పటికి తీర్పు వెలువడలేదు. రిజర్వ్ చేసిన తీర్పు ఎప్పుడు వెలువడుతుందో కూడా క్లారిటీ లేకపోవడంతో ఇప్పట్లో ఏపిలో స్థానిక సంస్థలు వుండే పరిస్థితులు కనిపించడం లేదు.