ఆధారాలు దొరక్కపోతే.. తప్పుడు కేసులు పెడతారా: వైసీపీపై ప్రత్తిపాటి ఫైర్

టీడీపీ నేతలపై వైసీపీ  చేసిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలపై  ఏమీ చేయలేక సీఐడీతో కేసు పెట్టారని టీడీపీ నేత, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.

ex minister prathipati pulla rao slams ycp govt over insider trading

టీడీపీ నేతలపై వైసీపీ  చేసిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలపై  ఏమీ చేయలేక సీఐడీతో కేసు పెట్టారని టీడీపీ నేత, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.  గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

వైసీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తోందని ప్రత్తిపాటి మండిపడ్డారు. తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేస్తామని, వైసీపీ దళితుల్ని అడ్డుపెట్టుకుని ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు.

Also Read:మండలి రద్దు ఖాయం: వైఎస్ జగన్ చెప్పకనే చెప్పారు

నరసింహరావు అనే వ్యక్తికి, ఎస్సీ రైతుకు చెందిన భూమిని మాజీ మంత్రి నారాయణ, తాను బెదిరించి ఇప్పించినట్లుగా తప్పుడు కేసులు పెట్టారని పుల్లారావు ధ్వజమెత్తారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని రాజకీయ దురుద్దేశంతోనే తనపై, నారాయణపై కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు.

విపక్ష నాయకులపై తప్పుడు కేసులతో వేధించాలని అనుకుంటున్నారని, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు విని అక్రమ కేసులు పెట్టే అధికారులను కోర్టుకు లాగుతామని ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు.

తాను బినామీల పేర్లతో రాజధానిలో భూములు కొన్నట్లు వైసీపీ నేతలు ఆరోపించారని వాటిని తేల్చాలని ఆయన సవాల్ విసిరారు. తప్పుడు కేసులకు భయపడేదిలేదని స్పష్టం చేశారు.  

ఎక్కడైనా చట్టాన్ని ఉల్లంఘించి ఉంటే చర్యలు తీసుకోమని ఆరు నెలలుగా ప్రభుత్వాన్ని  కోరుతున్నామని, కానీ ఎలాంటి ఆధారాలు దొరకపోవటంతో తప్పుడు కేసులు పెడుతున్నారని పుల్లారావు దుయ్యబట్టారు.

Also Read:రాజ్యాంగంలో ఆ పదం లేదు, జయలలిత ఊటీ నుంచి పాలించారు: జగన్

తప్పుడు కేసులు పెడుతున్న ప్రభుత్వంపై పరువునష్టం దావా వేస్తామని, చట్టసభలకు రావాలంటేనే భయపడేలా అధికారపక్షం వ్యవహరిస్తోందన్నారు. మండలిలో మంత్రులు వ్యవహరించిన తీరు చట్టసభల గౌరవాల్ని తగ్గించేదిగా ఉందని ప్రత్తిపాటి ఆవేదన వ్యక్తం చేశారు.

మండలిలో వైసీపీ మంత్రులు చేసే అరాచకాలు బయటికి రాకుండా లైవ్‌ ప్రసారాలు కట్‌ చేసారని ఆయన ఆరోపించారు. వైసీపీ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుని ప్రజాప్రాయం ప్రకారం నడుచుకోవాలని పుల్లారావు హితవుపలికారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios