అమరావతి: కరోనా వైరస్‌ నిరోధంపై సీఎం వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. చీఫ్‌ సెక్రటరీ నీలంసాహ్ని, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్‌ సహా ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ివీరంతా ఏపిలో కరోనా రాకుండా వుండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. 

ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. వారిలో  ఎవరైనా కరోనా లక్షణాలతో బాధపడుతున్నారా అన్న విషయాలను తెలిసుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వారి పూర్తి ఆరోగ్య వివరాలు సేకరించి జాగ్రత్తలు సూచిస్తున్నామన్నారు. 

ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. 24 అనుమానిత కేసుల్లో 20 నెగెటివ్‌ వచ్చాయని...మరో 4 కేసులకు సంబంధించి పరీక్షల వివరాలు రావాల్సి ఉందన్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తే చాలావరకు వైరస్ వ్యాప్తిని నిలువరించవచ్చని... పాజిటివ్‌గా నమోదైన కేసుల్లో కేవలం 5శాతం మందే ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

read more  ఏపిలో కరోనా కలకలం... ఇటలీనుండి వచ్చిన యువతికి కరోనా లక్షణాలు

ఇదివరకే ఇతర రకాల వ్యాధులతో సతమతం అయిన పరిస్థితుల్లోనే కరోనా వైరస్‌ ప్రమాదకరంగా మారుతోందన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో మార్చి 5వరకూ 6,927 మంది విదేశాల నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్‌ చేశామని...వైజాగ్‌లో 790, గన్నవరంలో 60, కృష్ణపట్నంలో 469 మంది నౌకలద్వారా వచ్చారని... వారికి కూడా స్క్రీనింగ్‌ నిర్వహించామని సీఎం కు వివరించారు. 

రాష్ట్ర వైద్య సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముందస్తుగా 351 బెడ్లు, 47 వెంటిలేటర్లు, 1.10లక్షల మాస్కులు, 12,444 పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. మరో 12వేల పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్వెప్‌మెంట్‌ కొత్తగా కొనుగోలు చేయడంతో పాటు మరో 50వేల మాస్కులు కూడా అందుబాటులో ఉంచుతామన్నారు.

ఐసోలేషన్‌ వార్డులు ప్రధాన ఆస్పత్రికి దూరంగా ఏర్పాటు చేస్తున్నామని... అన్ని రకాల సదుపాయాలతో వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. విజయవాడ, అనంతపురంలలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను కరోనా వైరస్‌ కేసు బాధితులకు చికిత్స అందించడానికి సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 

కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్నాయని ఎవరైనా కాల్‌చేస్తే ప్రభుత్వ అంబులెన్స్‌లో నేరుగా ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రోగిని తరలించిన వెంటనే ఆ అంబులెన్స్‌ను పూర్తిగా స్టెరిలైజ్‌ చేస్తున్నామని... దీనికి సంబంధించిన ప్రోటోకాల్స్‌ రూపొందించుకున్నామన్నారు. 

read more  కరోనా వైరస్: ఈటెలకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రశంసలు

ఎక్కడైనా పాజిటివ్‌ కేసు వస్తే ఆ ఇంట్లో ఉన్నవారికి, చుట్టుపక్కల వారిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచుతామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా 14 రోజులు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని చెప్తున్నట్లు తెలిపారు. 

ప్రజలు ఆందోళనకు గురిచేయాల్సిన అవసరం లేదన్నారు సీఎం. వారికి జాగ్రత్తలు జారీచేయడంతో పాటు అనుమానాలను నివృత్తి చేయడానికి కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. అనుమానిత కేసులుంటే వెంటనే కాల్‌చేయాలని... వారికి వెంటనే వైద్య సదుపాయం అందేలా చూడాలన్నారు. 

గ్రామ సచివాలయాలను ఈ కరోనా వైరస్‌ నిరోధంలో భాగస్వాములు చేయాలని అధికారులకు సూచించారు. కరోనా వైరస్‌ వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నదానిపై గ్రామ, వార్డు సచివాలయాలకు సమాచారం పంపాలని ఆదేశించారు. విజయవాడ, అనంతపురంల్లో ప్రత్యేక వార్డుల నిర్వహణకు రూ.60 కోట్లు, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రూ.200 కోట్లు నిధులు సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.