గతంలో సొంత మామ, టిడిపి వ్యవస్థాపకక అధ్యక్షులు ఎన్టీఆర్ ని అధికారం కోసం వెన్నుపోటు పొడిచిన అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు శాసనమండలి గ్యాలరీలో కూర్చొని ప్రజాస్వామ్యానికి కూడా వెన్నుపోటు పొడిచాడని వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. శాసనసభలో 2004 జూలై 8వ తేదీన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు ఏం మాట్లాడారో గుర్తు లేదా?  ఆరోజు శాసనమండలిని పునరుద్దరించే బిల్లును వ్యతిరేకించిన ఆయన ఇప్పుడు మండలి రద్దును వ్యతిరేకించడం ఏంటని చెవిరెడ్డి ప్రశ్నించారు. 

శాసనమండలిని చంద్రబాబు కేవలం రాజకీయ పునరావాసం కోసమే వాడుకున్నారని విమర్శించారు. మండలి వల్ల రాష్ట్రంకు ఎటువంటి ప్రయోజనం లేదని చంద్రబాబు గతంలో అన్నాడని గుర్తుచేశారు. శాసనమండలి వల్ల బిల్లుల ఆమోదంలో జాప్యం అవుతుందని ఆరోజు చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశాడని... కానీ  ఈరోజు అదే మండలిలో మెజార్టీ ఉందని బిల్లులు అడ్డుకుంటున్నాడని మండిపడ్డారు. 

రాష్ట్రంలో మండలి ఏర్పాటు వల్ల రూ. ఇరవై కోట్లు భారం పడుతుందని చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశాడని పేర్కొన్నారు. శాసనసభ నుంచి బిల్లు పంపిస్తే శాసనమండలికి వెళ్ళి అక్కడ కూడా చర్చ జరపడం వల్ల  జాప్యం జరుగుతోందని అన్నాడని... ఇటువంటి శాసనమండలి మనకు అవసరమా అని చంద్రబాబు ప్రశ్నించాడని చెవిరెడ్డి  గుర్తుచేశారు.

read more  ఏపీ శాసనమండలి రద్దు: అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన జగన్.  

శాసనమండలి చేతికి ఆరో వేలు లాంటిదంటూ గతంలో అసెంబ్లీ సాక్షిగా చాలా గట్టిగా శాసనమండలిని వ్యతిరేకించిన అదే చంద్రబాబు ఈ రోజు శాసనమండలిని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించడం విడ్డూరంగా వుందని అన్నారు. శాసనమండలిని ఎందుకు రద్దు చేస్తారు... ? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు  వ్యతిరేకం అని చంద్రబాబు చిలుక పలుకులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. 

తనకు కావాలని అనిపించినప్పుడు ఒకలా... వద్దు అనుకున్నప్పుడు ఒకలా మాట్లాడటం చంద్రబాబుకు బాగా అలవాటన్నారు.  23 మంది ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకున్నప్పుడు ప్రజాస్వామిక విలువలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబులా సభ్యులను కొనుగోలు చేసి పార్టీని, ప్రభుత్వాన్ని నడపాల్సిన అవసరం తమకు లేదన్నారు చెవిరెడ్డి. 

ఆనాడు సభలో చంద్రబాబు శాసనమండలి వద్దని అన్నారని... దాన్నే నేడు వైసిపి ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. తన మాట నెగ్గుతున్నప్పుడు చంద్రబాబు దీనిని సమర్థించాలి కాని వ్యతిరేకించడం ఎందుకన్నారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం వుంటే శాసనమండలి గురించి సభలో చర్చకు రావాలని చెవిరెడ్డి సవాల్ విసిరారు. 

read more  వారి స్వార్థం కోసమే పెద్దల సభ... జాతీయ నాయకులు వద్దన్నా...: ధర్మాన

ఆరోజుకు, ఈ రోజుకు చంద్రబాబు మాటల్లోని వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. గతంలో మాట్లాడిన మాటలను ప్రజలకు చూపిస్తుంటే కలుగులో దాక్కున్నట్లు ఎందుకు చంద్రబాబు సభకు రాకుండా ముఖం చాటేస్తున్నాడన్నారు.

 ప్రజల ముందుకు వచ్చి ఎందుకు శాసనమండలి కావాలో స్పష్టం చేయాలన్నారు.  ప్రజాస్వామ్యంను రక్షించుకునేందుకు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని... ఈ నిర్ణయంను ప్రజలందరూ స్వాగతిస్తున్నారని చెవిరెడ్డి తెలిపారు.