Asianet News TeluguAsianet News Telugu

ప్రజలను చంపే పిచ్చిమందు కోసం ప్రపంచబ్యాంక్ రుణమా?: .జగన్ సర్కార్‌పై బొండా ఉమ ఫైర్

మద్యం బకాయిలను చెల్లించడానికి ఏపి ప్రభుత్వం ఏకంగా ప్రపంచ బ్యాంక్ వద్ద రుణాన్ని పొందడానికి సిద్దపడటాన్ని టిడిపి నాయకులు బోండా ఉమామహేశ్వరరావు తప్పెబట్టారు. 

Bonda Uma Comments on AP govt to approach World Bank for Rs 1,783 cr loan to clear dues to distilleries
Author
Guntur, First Published Mar 5, 2020, 3:47 PM IST

అమరావతి ఓ శ్మశానమని... అక్కడ పందులు, గేదెలు తిరుగుతున్నాయి తప్ప ఎవరూ నివాసముండటం లేదని చెప్పిన ప్రభుత్వపెద్దలు నేడు అదే అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఎలా ఇస్తున్నారో చెప్పాలని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నిలదీశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

అధికారంలోకి రాకముందు పేదలసంక్షేమం గురించి ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన జగన్, ముఖ్యమంత్రయ్యాక వారి పొట్ట కొట్టే చర్యలకు పాల్పడుతున్నాడన్నారు. ఉగాదినాటికి 26 లక్షలమందికి ఇళ్లస్థలాలు ఇవ్వాలని ఆరాటపడుతున్న జగన్ ప్రభుత్వం లెక్కల గిమ్మిక్కులతో పేదలను మరోసారి మోసం చేస్తోందన్నారు. జగన్ ఉగాదినాటికి పంపిణీ చేయాలనుకుంటున్న 26లక్షల ఇళ్లపట్టాల్లో, 14లక్షల పట్టాలు టీడీపీ ప్రభుత్వం ఇచ్చినవేనని ఉమా స్పష్టంచేశారు.

తరతరాల నుంచి దళిత, బీసీ, మైనారిటీ వర్గాల్లోని పేదలు సాగుచేసుకుంటున్న భూములను, తొండలు కూడా గుడ్లు పెట్టని పోరంబోకు భూములను, అసైన్డ్ ల్యాండ్స్ ని, కాలువలు, డొంకలు, పొలిమేరల వంటి వాటిని ఇళ్లస్థలాల పేరుతో ప్రభుత్వం లాగేసుకుందన్నారు. తాత, ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని జగన్ ప్రభుత్వం లాగేసుకుందన్న మనస్తాపంతో కర్నూలు జిల్లాలోని పాములపాడు మండలం ఎర్రగూడూరుకు చెందిన భూలక్ష్మి అనే మహిళ బలవన్మరణానికి పాల్పడిందని ఉమా తెలిపారు.  (ఆమె మరణవార్తకు సంబంధించిన పత్రికా కథనాన్ని విలేకరులకు చూపించారు) 

టీడీపీ హాయాంలో మొత్తం 14లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇవ్వడానికి నిర్ణయించామన్నారు. వాటిలో 8.50లక్షలకు పైగా ఇళ్లను పూర్తిచేసి, పేదలకు ఇవ్వడం జరిగిందన్నారు. అనంతపురం జిల్లాలో 67,228 ఇళ్లను (అపార్ట్ మెంట్ తరహాలో) పూర్తిచేశామని, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో 50,540, విజయనగరంలో 46,846, విశాఖపట్నం జిల్లాలో 65,258, తూర్పుగోదావరి-1,03,079ఇళ్లను, పశ్చిమగోదావరిలో-75,853, కృష్ణాజిల్లాలో – 53,968, గుంటూరు-64,658ఇళ్లు, ప్రకాశంజిల్లాలో – 48,476, నెల్లూరులో-49,334, చిత్తూరుజిల్లాలో-57,449, కడపలో – 44901, కర్నూలుజిల్లాలో -66,408ఇళ్లను పేదలకోసం నిర్మించడం జరిగిందని బొండా వివరించారు. (పూర్తయిన ఇళ్లు, నిర్మాణంలోఉన్న ఇళ్ల ఫొటోలను ఈ సందర్భంగా ఉమా విలేకరులకు చూపించారు). 

టీడీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే పేదలకు ఆ ఇళ్లన్నీ ఉచితంగా అందచేయడం జరిగేదన్నారు. వైసీపీప్రభుత్వం మాదిరి, జగన్ లా పేదలకు కల్లబొల్లి మాటలుచెప్పి టీడీపీ ప్రభుత్వం మోసగించలేదన్నారు. ప్రభుత్వంలోని పెద్దలెవరైనా సరే తాము చెప్పిన ప్రదేశానికి వెళ్లి ఇళ్లను పరిశీలించవచ్చని ఉమా సూచించారు. చంద్రబాబు నాయుడు జిల్లా కేంద్రాలకు కూతవేటు దూరంలో సకలవసతులతో పేదలకు ఇళ్లను నిర్మిస్తే జగన్ మాత్రం కొండలు, శ్మశానాలు, వాగుల పక్కన ఊళ్లకుదూరంగా పేదలను ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. 

జనావాసాలకు దూరంగా ఎక్కడో ఊళ్లచివర పేదలకు సెంటుభూమి ఇస్తే దానిలో వారెప్పుడు ఇల్లు నిర్మించుకోవాలో, ఎలా నివాసముండాలో జగనే సమాధానం చెప్పాలన్నారు. జగన్ ప్రభుత్వ కేబినెట్ తీర్మానం ప్రకారం రాష్ట్రంలో 26లక్షల కుటుంబాలకు సెంటుస్థలం చొప్పున ఇవ్వాలంటే అందుకోసం మొత్తం 25వేల ఎకరాలు అవసరమవుతుందని బొండా స్పష్టంచేశారు. తిరిగి అక్కడ నివాసముండేవారికి రోడ్లు, డ్రైనేజ్ లు, ఇతరేతర సౌకర్యాలు కల్పించాలంటే అదనంగా మరో 20వేల ఎకరాలు అవసరమవుతుందన్నారు. జగన్ ఉద్దేశం ప్రకారం 26లక్షలకుటుంబాలకు న్యాయంచేయాలంటే మొత్తంగా 45వేల ఎకరాలభూమి కావాల్సి ఉందని, కానీ ఇప్పటివరకు జగన్ ప్రభుత్వం ఎక్కడాకూడా రూపాయివెచ్చించి ఒక్క ఎకరం కూడా కొనుగోలు చేయలేదన్నారు. 

read more   ఏపీలో బీసీ రిజర్వేషన్ల తగ్గింపు: సుప్రీంలో టీడీపీ పిటిషన్

అధికారంలోకి రాకముందు ప్రభుత్వమే భూమిని కొని పేదలకు పంచుతుందని చెప్పిన జగన్, ఇప్పుడు ఆఊసే ఎత్తడంలేదన్నారు. అధికారంలోకి రాగానే ఎడంచేత్తో పేదలస్వాధీనంలోని భూమిని లాక్కుంటున్న జగన్, కుడిచేత్తో తిరిగి వారికే ఇస్తూ, తానేదో పేదల ఉద్ధారకుడైనట్లు మాట్లాడుతున్నాడన్నారు. జగన్ ప్రభుత్వంలా తూతూమంత్రంగా కాకుండా, టీడీపీ హయాంలో 5లక్షలమందికి 2సెంట్ల చొప్పున, ఊళ్లపక్కనే ఇవ్వడం జరిగిందన్నారు. 

మంత్రులు కొడాలినాని, బొత్స సత్యనారాయణ అమరావతిని గురించి చులకనగా మాట్లాడారని, నేడు అదే అమరావతిలో భూమి ఎలా ఇస్తున్నారో చెప్పాలన్నారు.
జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూములను లాక్కొని పేదలకు ఇవ్వడంపై, కేవీపీఎస్ కు చెందిన దళిత నేత మాల్యాద్రి హైకోర్టుని ఆశ్రయించారని ఉమా తెలిపారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల సాయంతో పేదల భూములను లాక్కుంటున్న ప్రభుత్వ చర్యలను కోర్టు తప్ప్పుపట్టిందన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో -107పై కూడా రాజధాని ప్రాంత రైతులు కోర్టుకెళ్లారని ఉమా చెప్పారు. 

తాము అభివృద్ది కోసంభూములిస్తే, జగన్ ప్రభుత్వం వాటిని ఇళ్లస్థలాలపేరుతో దుర్వినియోగం చేస్తోందని వారు కోర్టుని ఆశ్రయించడం జరిగిందన్నారు.  ఈవిధంగా కోర్టుల పరిధిలో ఉన్న భూములను పేదలకు ఇస్తామని చెబుతూ, ప్రభుత్వం వారిని మరింత ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. 70గదులనివాసంలో ఉంటున్న జగన్మోహన్ రెడ్డి, పేదలకు మాత్రం సెంటు(40గజాలు) చాలని చెప్పడం సిగ్గుచేటని బొండా మండిపడ్డారు. పనికిరాని, నివాసయోగ్యం కాని భూమిని పేదలకు పంచుతూ, తానే భూములివ్వడం కనిపెట్టానన్నట్లుగా జగన్ మాట్లాడటం చూస్తుంటే అసహ్యం వేస్తోందన్నారు. 

టీడీపీప్రభుత్వం కేటాయించిన ఇళ్లపట్టాలను రద్దుచేసి వాటిని తిరిగిస్తూ, తమ ఖాతాలో వేసుకోవాలన్న ఉబలాటంలో జగన్ ప్రభుత్వముందన్నారు. ఇళ్లస్థలాల పంపిణీనే ఒక బోగస్ కార్యక్రమమని, భూములు కోల్పోయినవారంతా కోర్టులకు వెళుతుంటే జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్లస్థలాలు ఎలా ఇస్తుందో, ఇచ్చినా అవి వారికి ఎంతవరకు ఉపయోగపడతాయన్న సందేహం అందరిలోనూ ఉందన్నారు. స్థలాలపేరుతో సాగిస్తున్న బోగస్ కార్యక్రమంతో స్థానిక ఎన్నికల్లో లబ్ది పొందాలన్న దురుద్దేశం ప్రభుత్వంలో కనిపిస్తోందని ఉమా చెప్పారు. 

గత ప్రభుత్వహయాంలో పేదలు నిర్మించుకున్న ఇళ్లకు ఇవ్వాల్సిన రూ.1100కోట్లను ప్రభుత్వం 9నెలలైనా ఎందుకు చెల్లించడం లేదని ఉమా నిలదీశారు. పేదలు తమవంతు వాటాగా అప్పులు తెచ్చి ఇళ్లు నిర్మించుకుంటే  జగన్ ప్రభుత్వం వారిని రోడ్లపాలుచేసిందన్నారు.  ఆంధ్రప్రదేశ్ లో ధాన్యం రైతులకు చెల్లించాల్సిన బకాయిలు కేంద్రం నుంచి రాబట్టడంలో విఫలమైన జగన్ ప్రభుత్వంలోని మంత్రులు, చివరకు ఉపరాష్ట్రపతిని వేడుకునే స్థితికి దిగజారారన్నారు. 

ప్రభుత్వం  విక్రయిస్తున్న పిచ్చిమందు (లిక్కర్)తాగి జనం చనిపోతున్నారని చెబితే డిస్టిలరీ కంపెనీలకు జగన్ ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉందని, అవి చెల్లించడంలేదు కాబట్టి రాష్ట్రంలో పిచ్చిమందు అమ్ముతున్నామని మరో మంత్రి నిస్సిగ్గుగా సమాధానం చెబుతున్నాడని బొండా మండిపడ్డారు. డిస్టిలరీలకు చెల్లించాల్సిన రూ.1600కోట్లను వాడుకున్న ప్రభుత్వం ఆ మొత్తం రుణంగా ఇవ్వమంటూ ప్రపంచబ్యాంక్ ని అడగటం సిగ్గుచేటన్నారు. ఇటువంటి దారుణాలు ఈ రాష్ట్రంలో తప్పమరెక్కడా ఉండవని, ఇటువంటి తుగ్లక్ చర్యలను కూడా మరెక్కడా చూడబోమన్నారు.  

read more   అశోక్ గజపతిరాజుకు చెక్ : ట్రస్ట్ చైర్మన్ గా సంచిత గజపతిరాజు

ప్రభుత్వం ఇప్పటికైనా పేదలకు ఇవ్వడానికి ఏ జిల్లాలో ఎంతెంత భూమి కొన్నదో, ఎన్ని వేల ఎకరాలు పంచిందో వెల్లడించాలని బొండా డిమాండ్ చేశారు. 26లక్షల మందికి ఇవ్వడానికి అవసరమైన 25వేల ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళికలేమిటో, ఎకరం ఎంతచొప్పున కొని, పేదలకు పంచుతున్నారో పూర్తివివరాలు బయటపెట్టాలని, దానిపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చించడానికి టీడీపీ సిద్ధంగా ఉందని ఉమా తేల్చిచెప్పారు.

 

జగన్ ప్రభుత్వం ఆడవాళ్లతో మందు అమ్మిస్తుంటే రోజాకు కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. 

జగన్ ప్రభుత్వం సాగిస్తున్న మద్యం మాఫియాపై రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు వెల్లడించడానికే, ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న కల్తీమద్యం సీసాలను తాము విలేకరుల సమావేశంలో చూపించామని బొండా స్పష్టంచేశారు. తాము అడిగిన వివరాలపై సమాధానం చెప్పకుండా నోటికొచ్చినట్లు పిచ్చిపిచ్చిగా రోజానో, మరొకరో మాట్లాడితే వాస్తవాలు అవాస్తవాలు కావన్నారు. 

జే-ట్యాక్స్ వసూలు తట్టుకోలేక ప్రధానమైన డిస్టిలరీ కంపెనీలన్నీ మద్యం సరఫరా చేయకుండా చేతులెత్తేశాయన్నారు. చీప్ లిక్కర్ పై క్వార్టర్ కు అదనంగా వసూలుచేస్తున్న రూ.100రూపాయలు ఎవరి జేబులోకి వెళుతోందో వైసీపీ మంత్రులు సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోని ఎక్సైజ్ మంత్రి సెక్రటేరియట్ లో, మందు బాటిళ్లుచూపి విలేకరులతో మాట్లాడాడన్నారు. మద్యం వ్యాపారాన్ని నియంత్రించాల్సిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలోని మహిళా సిబ్బందితోనే మందు అమ్మిస్తున్న ప్రభుత్వనిర్వాకంపై రోజా ఏం సమాధానం చెబుతుందని ఉమా నిలదీశారు. 

పక్కరాష్ట్రాల నుంచి వస్తున్న ఎన్ డీపీ లిక్కర్ ని వాలంటీర్లే డోర్ డెలివరీ చేస్తున్నారని, అదిచాలక గ్రామాల్లో నాటుసారా విక్రయాలు యథేచ్చగా సాగిస్తున్నారని, వీటన్నింటిపై నోరువిప్పే, దమ్ము, ధైర్యం రోజాకుగానీ, ఇతర మంత్రులకుగానీ లేదన్నారు. సిగ్గులేకుండా ఇంకా ఆంధ్రప్రదేశ్ లోని తాగుబోతులకోసం ప్రపంచబ్యాంక్ రుణమిస్తుందని చెప్పడం జగన్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ప్రభుత్వలోపాలను ఎత్తిచూపుతున్న ప్రతిపక్షంపై దుమ్మెత్తిపోసినంత మాత్రాన వాస్తవాలు ప్రజలకు తెలియకుండా పోతాయని భావిస్తే అంతకంటే ఆత్మవంచన మరోటి ఉండబోదన్నారు. ప్రతిపక్షం ఎత్తిచూపిన తప్పులు సరిదిద్దుకోకుండా కేసులుపెడతాం.. అంతుతేలుస్తామంటూ సొల్లు కబుర్లు చెప్పి డాంభికాలు ప్రదర్శిస్తే భయపడేవారెవరూ లేరని బొండా తేల్చిచెప్పారు.

 


 
 
 

Follow Us:
Download App:
  • android
  • ios