యనమల, ఉమను హోంమంత్రి జైల్లో వేయమంటే...: ఉద్యోగ సంఘాల హెచ్చరిక
శాసన మండలిలో ఛైర్మన్ ఆదేశాలను అసెంబ్లీ సెక్రటరీ పాటించడం లేదంటున్న టిడిపి నాయకులపై ఏపి సెక్రటేరియట్ ఉద్యోగులు మండిపడుతున్నారు. అసెంబ్లీ సెక్రటరీకి మద్దతుగా వారు సీఎస్ నీలం సహానిని కలిశారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ బాలకృష్ణమాచార్యులకు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం బాసటగా నిలిచింది. అసెంబ్లీ సెక్రటరీకి మద్దతుగా బుధవారం సీఎస్ నీలం సాహ్నిని కలిశారు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు. నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్న సెక్రటరీపై రాజకీయాల్లోకి లాగి విమర్శలు చేయడం తగదన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ నేతలపై సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు.
అసెంబ్లీ సెక్రటరీకి తాము మద్దతుగా ఉన్నామని చెప్పేందుకే సీఎస్ నీలం సాహ్నిని కలిశామని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా అసెంబ్లీ సెక్రటరీ బాలకృష్ణమాచార్యులు పని చేస్తున్నారని సీఎస్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
read more ఆ మంత్రులను వెంటనే భర్తరఫ్ చేయాలి...: కొల్లు రవీంద్ర డిమాండ్
ఇటీవలే టిడిపి నాయకులు గవర్నర్ ను కలిసి సెక్రటరీపై ఫిర్యాదు చేశారని గుర్తుచేస్తూ రూల్సుకు విరుద్దంగా వెళ్లాలని గవర్నర్ కూడా చెప్పరని అన్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా నిబంధనలకి లోబడి వ్యవహరించే అధికారులకు భద్రత కల్పించాలని గవర్నరును కోరనున్నట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు.
రూల్సుకు విరుద్దంగా వెళ్లమని ప్రతిపక్ష నాయకులు అధికారులపై ఒత్తిడి తేవడం వారికే మంచిది కాదన్నారు. రూల్స్ లేవు... తొక్కా లేదన్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమను జైల్లో వేయమని హోం మంత్రి చెబితే ప్రతిపక్షం ఏమంటుంది..? అని ప్రశ్నించారు.
read more విద్యుత్ రంగాన్ని గట్టెక్కించేందుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం
హోం మంత్రి చెప్పారు కదా అని పోలీసులు వారిని జైల్లో పెడితే ప్రతిపక్షం సమర్థిస్తుందా..? అని అన్నారు. అలాగే అధికారుల జోలికి వస్తే కూడా తాము సహించమని వెంకట్రామిరెడ్డి టిడిపి నాయకులను హెచ్చరించారు.