ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడి చంద్రబాబు కుట్రే... ఆధారాలివే: డిప్యూటీ సీఎం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అమరావతి రైతుల ముసుగులో టిడిపి కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని... ఇదంతా చంద్రబాబు పన్నిన కుట్రేనని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆరోపించారు.
అమరావతి: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టిడిపి గూండాలు హత్యాయత్నంకు పాల్పడ్డారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ దుర్ఘటనను ప్రజలు టీవిల్లో ప్రత్యక్షంగా చూశారని... ఈ దాడికి పాల్పడిందెవరో అందరూ గమనించారన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు ఈ దుర్మార్గాన్ని ప్రోత్సహించడం దారుణమన్నారు.
రైతుల రూపంలో టిడిపి గూండాలను ప్రేరేపించి ఒక ప్రజాప్రతినిధిపై హత్యాయత్నంకు పాల్పడటం ప్రతిపక్ష నాయకులు, మాజీ సీఎం చంద్రబాబు తగదన్నారు. ఈ చర్యలపై ప్రజలే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వుందన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని...అయినా ఆయన ఇంత సిగ్గుమాలిన పనులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
దేశంలో నెంబర్ వన్ యాంటీ సోషల్ ఎలిమెంట్ చంద్రబాబేనని ఆరోపించారు. ఆయన మనుషులు, వారు ఉపయోగించిన భాష, వారు తిట్టిన బూతులను ప్రజలు గమనించారన్నారు. ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఆయన గన్ మెన్ లపై కూడా దాడులు చేశారని... దాడి సమయంలో సాధారణ రైతులు అటువంటి భాషను ఉపయోగించరని అన్నారు. సోషల్ మీడియాలో కూడా జరిగిన సంఘటనను వక్రీకరించి చూపుతున్నారని తెలిపారు.
read more పిన్నెల్లి హత్యకు చంద్రబాబు కుట్ర: అంబటి రాంబాబు
అసెంబ్లీకి, సెక్రటేరియట్ కు ఎవరూ రాలేని పరిస్థితిని చంద్రబాబు సృష్టించారని పేర్కొన్నారు. రైతు సోదరుల ముసుగులో చంద్రబాబు తన గూండాలను మోహరించి
అమరావతి ప్రాంతంలోకి ఎవరూ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. లెజిస్లేచర్ క్యాపిటల్ కూడా వుండకుండా చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ అధికారులతో పాటు మిగిలిన ప్రాంతాల వారు ఇక్కడకు రాలేని విధంగా ఇక్కడ భయానక పరిస్థితిని సృష్టించారన్నారు. ఈ దాడితో అందరూ భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. కొన్ని మీడియా చానెల్స్ జరిగిన దాడిని వక్రీకరించి చూపుతున్నారని అన్నారు. ఇటువంటి సంఘటన పునరావృత్తం కాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనే దుష్ర్పచారం కోసం చంద్రబాబు ముందుకు వెడుతున్నారని ఆరోపించారు. ఇటువంటి ఘటనలు ఎవరు చేసినా పోలీసులు సహించకూడదని సూచించారు. సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రంలో శాంతియుత వాతావరణం వుందని... భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏనాడు ఇలాంటి ఘటనలకు పాల్పడలేదన్నారు. వైఎస్ఆర్ మరణం తరువాత కూడా సంయమనంగా వున్నామని...వైఎస్ జగన్ ను జైలు పాలు చేసినా కూడా మౌనంగా సహించామన్నారు. పదహారు నెలలు జైలులో వున్నా కూడా సహనం కోల్పోలేదన్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై హత్యాయత్నం జరిగినా వైఎస్ఆర్‌సిపి శ్రేణులు సంయమనంతో ఎటువంటి గొడవలకు, దాడులకు దిగలేదని... టిడిపి ఎమ్మెల్యేలు, నాయకులపై దాడులు చేయలేదన్నారు.
read more రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్నదే నా అభిప్రాయం... కానీ..: వైసిపి ఎమ్మెల్యే
ఆనాడు రాష్ట్రంను విడగొట్టినప్పుడు కూడా చంద్రబాబుకు ఆవేశం రాలేదు కానీ మూడు రాజధానులు అంటే ఎందుకు అంత ఆవేశం వస్తోందని నిలదీశారు. చంద్రబాబు ఆవేశం వెనుక ఆయన బినామీలకు చెందిన భూముల విలువలు తగ్గిపోతున్నాయనే బాధ వుందన్నారు. రాష్ట్రంలో రాజధాని రైతులు, ఉత్తరాంధ్ర, రాయలసీమ రైతులు నీళ్ల కోసం పోరాటం చేస్తుంటే చంద్రబాబు తన బినామీల భూములకు రేట్ల కోసం పోరాడుతున్నారని ఎద్దేవా చేశారు.
''చంద్రబాబుకు కావాల్సింది స్టేట్ కాదు రియల్ ఎస్టేట్ మాత్రమే. ఆయన బినామీలకు చెందిన భూముల విలువలు పడిపోతున్నాయన్నదే ఆయన ఆందోళన. విశాఖలో సెక్రటేరియట్ పెడుతామంటే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట? కర్నూలులో హైకోర్ట్ పెడతామంటే ఎందుకు ఆయనకు ఆక్రోశం?'' అని ప్రశ్నించారు.
''మా ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని అనేక కమిటీల రిపోర్ట్ లను పరిశీలిస్తోంది. ఈ కమిటీల నివేదికలను కూడా చంద్రబాబు తప్పుపడుతున్నారు. జీఎన్ రావు, బిసిజి కమిటీలనుకూడా ఎందుకు చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు? అందులోని అధికారుల గురించి చంద్రబాబు ఏరకమైన బాషను మాట్లాడుతున్నారు? దళిత ఐఎఎస్ అధికారి పట్ల చంద్రబాబు అవమానకరంగా మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై దళితసంఘాలు చంద్రబాబును ఛీ కొడుతున్నారు'' అని డిప్యూటీ సీఎం వెల్లడించారు.