Asianet News TeluguAsianet News Telugu

ఆ అమరావతి నిర్మాణం నిజంగానే ఆగిపోయింది...: డిప్యూటీ సీఎం సంచలనం

చంద్రబాబు ప్రభుత్వంలో ప్రారంభించిన ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి  నిర్మాణం నిజంగానే నిలిచిపోయిందని ఏపి డిప్యూటీ సీఎం అంజద్ బాషా అన్నారు. కానీ సీఎం జగన్ కొత్త తరహాలో రాజధాని నిర్మిణాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.    

ap deputy cm amzath basha sensational comments on amaravati
Author
Amaravathi, First Published Nov 28, 2019, 6:11 PM IST

విజయవాడ: అధికారంలో ఉన్న ఐదేళ్లు రాజధాని కట్టకుండా అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మాయ చేసిన చంద్రబాబు ఇప్పుడు దానిపై రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ధి పొందడానికి నడుం బిగించారని ఉపముఖ్యమంత్రి అంజాత్ భాషా ఆరోపించారు. ఆయన గ్రాఫిక్స్‌లో చూపించిన రాజధాని ఆగిపోయిందని, కాగితాల్లో తాను సృష్టించిన లక్ష కోట్ల సంపద ఆవిరైపోయిందని మంత్రి ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు కల్లబొల్లి కబుర్లతో మళ్లీ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికే అమరావతి పర్యటన చేపట్టాడని... దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నారు. అధికారానికి దూరమైనప్పటి నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ పై బురద చల్లడమే లక్ష్యంగా పని చేస్తున్నారని అన్నారు. పసుపు పార్టీ రౌడీలతో తాజాగా రాజధానిపై రాద్ధాంతం చేసి ఈ రోజు రైతులతో చెప్పు దెబ్బలు తిన్నారని అన్నారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి దుబారా వద్దనడం తప్పా? అని ప్రశ్నించారు. రాజధానిని అడ్డుపెట్టుకుని గతంలో టిడిపి ప్రభుత్వం సాగించిన అడ్డగోలు వ్యవహారాలపై వైసిపి ప్రభుత్వం నిపుణుల కమిటీని వేసిన విషయాన్ని గుర్తుచేశారు. రాజధాని పేరుతో వేల కోట్ల దుబారా జరిగిందని, లెక్కలేనన్ని అక్రమాలు జరిగాయని ఈ కమిటీ తేల్చిందన్నారు. 

గతంలో జరిగిన తప్పులను సరిచేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఆర్భాటం, దుబారా లేకుండా రాజధాని పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలిపారు. బెదిరింపులతో చంద్రబాబు ప్రభుత్వం భూ సమీకరణ చేశారని... తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల్లోని రైతులు ఈ బెదిరింపులకు బలయ్యారని అన్నారు. 

కృష్ణా నది తీరంలో మూడు, నాలుగు పంటలు పండే అత్యంత విలువైన భూములను ఇవ్వలేమని రైతులు గగ్గోలు పెట్టినా... పర్యావరణవాదులు, ప్రతిపక్షాలు ఆందోళనలు చేసినా  ఆనాడు పట్టించుకోలేదని గుర్తుచేశారు. భూములివ్వని రైతుల తోటలను దగ్ధం చేయడం... రైతులపై కేసులు పెట్టి వేధించడం, టీడీపీ నాయకుల చేత బెదిరించడం, పొలాలకు నీరు, విద్యుత్‌ నిలిపివేయడం, రుణాలు ఇవ్వకపోవడం, భూములను దున్నేయడం వంటి అరాచకాలకు పాల్పడినట్లు ఆరోపించారు.

read more  వాటిని కాదని రాజధాని కోసం ఖర్చు చేయమంటారా..?: చంద్రబాబును నిలదీసిన వైసిపి ఎమ్మెల్యే

చిన్న రైతుల నోట్లో మట్టికొట్టి వారి భూముల పేరుతో స్థానికంగా టీడీపీ నాయకులకు ప్లాట్లు ఇచ్చారని అన్నారు. దళిత రైతుల అసైన్డ్, లంక భూములను అధికార పార్టీ నేతలు భయపెట్టి కారుచౌకగా తీసుకున్నారన్నారు. రైతుల నుంచి సేకరించిన భూముల్లో 1,691 ఎకరాలను స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు పేరుతో సింగపూర్‌ కన్సార్టియంకు కట్టబెట్టిందని... దీనిపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఏపీఐడీసీ చట్టాన్నే మార్చివేసినట్లు తెలిపారు.

సింగపూర్‌ కన్సార్టియంకు కారుచౌకగా భూములిచ్చి రూ.5,500 కోట్లతో అందులో మౌలిక వసతులు అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని ఒప్పుకుందన్నారు.  అయినప్పటికీ ప్రాజెక్టులో 58 శాతం వాటా వారికిచ్చిందన్నారు.   

వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలకు ఎవరూ ఊహించని విధంగా రూ.వెయ్యి కోట్ల వరకు గత ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.  ఆరు లక్షల చదరపు అడుగుల్లో ఆరు బ్లాకులను మొదట రూ.180 కోట్లతో మొదలు పెట్టి అంచెలంచెలుగా దాని ఖర్చు పెంచుకుంటూ వెళ్లిందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా చదరపు అడుగుకు రూ.10 వేలు ఖర్చు చేసి నిర్మించిన ఈ భవనాలు చిన్నపాటి వర్షానికే ధారగా కారిపోతున్నాయని ఎద్దేవా చేశారు. 

read more  అమరావతిపై చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ నేను కట్టుబడే వున్నా: బొత్స

నార్మన్‌ పోస్టర్స్‌ సంస్థ డిజైన్లు సమర్పించకుండానే బాహుబలి సినిమాలో మాహిష్మతి సెట్టింగ్, గౌతమీపుత్ర శాతకర్ణిలోని అమరావతి సెట్టింగ్‌లపై మనసుపడిన చంద్రబాబు వాటి దర్శకులతో చర్చలు జరిపారని అన్నారు. ఇలా రకరకాల డిజైన్లను అనుకూల మీడియాలో చూపిస్తూ అదే రాజధాని అని హడావుడి చేశారని తెలిపారు.

నాలుగైదు వేలతో చదరపు అడుగు నిర్మించే అవకాశం ఉన్న భవనాలను రూ.7 వేల నుంచి రూ.పది వేల వరకు అంచనాలతో చేపట్టడంతో నిపుణులే విస్తుపోయే పరిస్థితి నెలకొందన్నారు. 

ఎన్నికల ముందు తమ ముఖ్యమంత్రి  వైఎస్ రైతులకు భరోసా ఇస్తూ రూ.12,500/- ప్రకటించినప్పటికీ ప్రస్తుతం రూ.13,500/- గా రైతుల వ్యక్తిగత ఖాతాల్లో చెల్లించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు.  ఇకపై చంద్ర బాబు గారు డ్రామాలు ఆడేది ఆపకుంటే ప్రతి ఊరిలో రైతులు తరిమికొట్టే రోజులు వస్తాయని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios