అమరావతి: పాక్‌ జైలు నుంచి  మంగళవారం విడుదలైన ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మత్స్యకారులు బుధవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ను కలుసుకున్నారు. 
క్యాంపు కార్యాలయంలో వారితో సమావేశమైన సీఎం వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారిని పేరుపేరునా పలకరించిన ఆయన ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.  తక్షణ సాయంకింద రూ. 5లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తూ చెక్కులు పంపిణీ చేశారు సీఎం

పాక్‌ సరిహద్దుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అని సీఎం వారిని ప్రశ్నించారు. పోర్టు అనేది లేకపోవడం వల్ల మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలసవెళ్లాల్సి వస్తోందని... ఇక్కడ కూడా ఓ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించాలన్న ఆలోచనను సీఎం వ్యక్తపర్చారు. అలా చేసే ఇతర రాష్ట్రాలకు వలసపోకుండా ఇక్కడే తమ కుటుంబాలతో కలిసి ఉంటామని మత్స్యకారులు సీఎం కు తెలిపారు.

వేటకు వెళ్లిన తర్వాత పట్టే చేపలను బట్టి తమకు కూలీ ఇస్తారని మత్స్యకారులు  సీఎం కు తెలియజేశారు. తమ ప్రాంతంలో సముద్ర తీరం ఉన్నప్పటికి 10–15వేల మంది గుజరాత్‌కు వసల వెళ్లాల్సి వస్తోందని... జెట్టీలు, ఫిషింగ్‌ హార్బర్‌ లేకపోవడం వల్ల తామంతా ఇలా వలస వెళ్లాల్సి వస్తోందన్నారు. చేసే పనిని బట్టే మాకు జీతాలు ఇస్తారని సీఎంకు తెలిపారు.

read more  నిరుద్యోగులకు శుభవార్త... 15,971 ఉద్యోగాల భర్తీకి సీఎం ఆదేశం

జైళ్లో మగ్గిపోతున్న మాకు మీరు నిజంగా ఊపిరి పోశారు... బతికినంత వరకూ మీ పేరు చెప్పుకుంటాం అంటూ మత్స్యకారులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. తమరిలో ఏదో కనిపించని శక్తి  ఉందని, అందుకనే మమ్మల్ని బయటకు తేగలిగారని అన్నారు. 

ఈ సందర్భంగా జగన్ మత్స్యకారుల కోసం జట్టీలు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. భావనపాడు పోర్టు నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని... అందులో మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా ఒక జెట్టీని కేటాయిస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు కోరిన విధంగా మంచి జెట్టీని కట్టిస్తామన్నారు.

ఇప్పటికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చేస్తున్నామని... ఉపాధికోసం వేరే ప్రాంతాలకు వలసవెళ్లకుండా ఈ ఆర్థికసహాయం ఉపయోగపడుతుందని సీఎం తెలిపారు. 
పాకిస్థాన్‌ జైల్లో ఉన్న మిగిలిన ఇద్దరినీ విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు జగన్ వెల్లడించారు.అలాగే బంగ్లాదేశ్‌ జైల్లో ఉన్న 8 మందినీ విడిపించేందుకు ప్రయత్నాలు చేయాలని అధికారులకు సీఎం సూచించారు.

read more  200 కోట్ల ఆదాయాన్ని కాదని... వారికోసమే 10లక్షల ఉద్యోగులపై వేటు: నారా లోకేశ్

2018 నవంబరులో చేపల వేటకు వెళ్లి పాకిస్ధాన్‌ తీర జలాల్లో యాధృచ్చికంగా ప్రవేశించిన 22 మంది మత్స్యకారులు పాక్ కోస్ట్ గార్డ్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. అరెస్టు అయిన 22 మంది మత్స్యకారుల్లో 15 మంది శ్రీకాకుళం, 5గురు విజయనగరం జిల్లా, 2 తూర్పు గోదావరి జిల్లా వాసులు వున్నారు. గుజరాత్‌కు చెందిన చేపలబోట్లలో పనికి వెళ్లి పాకిస్తాన్‌ కోస్ట్‌గార్డు దళాలకు వీరు చిక్కారు.

మత్స్యకారులు పాకిస్తాన్‌ అదుపులో ఉన్న విషయాన్ని ధృవీకరించుకున్న అనంతరం వారి విడుదలకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ మంత్రితో పాటు ప్రధానమంత్రిని కూడా పలు మార్లు విజ్ఞప్తి చేసింది. నిర్భందంలో ఉన్న మత్స్యకారుల విడుదల అయ్యేవరకు వారి కుటుంబాల ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది ఏపి ప్రభుత్వం. 

1) కుటుంబానికి నెలకు రూ.4500 చొప్పున ఫెన్షన్‌ మంజూరు

2) ప్రతి కుటుంబానికి నెలకు రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా

3) ప్రతి కుటుంబానికి 75శాతం సబ్సిడీపై వలలు, బోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

కేంద్రం ద్వారా మత్స్యకారుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వ నిరంతర విజ్ఞప్తుల ఫలితం జైల్లో నుంచి మత్య్యకారుల విడుదలకు అంగీకరిస్తూ భారత్‌ ప్రభుత్వానికి సమాచారమిచ్చింది పాకిస్తాన్‌.  దీంతో భారత్‌–పాక్‌ సరిహద్దుల్లోని వాఘా చెక్‌ పోస్టు వద్ద మత్స్యకారులను స్వయంగా రిసీవ్‌ చేసుకున్నారు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి శ్రీ మోపిదేవి వెంకటరమణ. ఆయన వెంటస్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ పూనం మాలకొండయ్య, మత్స్యశాఖ కమిషనర్‌ జి సోమశేఖరం కూడా  వున్నారు.