200 కోట్ల ఆదాయాన్ని కాదని... వారికోసమే 10లక్షల ఉద్యోగులపై వేటు: నారా లోకేశ్
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల కోసమే దాదాపు 10లక్షల మంది ఉద్యోగులను రోడ్డుపై పడేయడానికి సిద్దపడుతోందని మాజీ మంత్రి, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు.
విజయవాడ: నగరంలోని ధర్నా చౌక్ లో మీసేవ ఆపరేటర్లు, సిబ్బంది చేస్తున్న ధర్నాకు మాజీ మంత్రి, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొని సంఘీభావం తెలిపారు. మీసేవ ఆపరేటర్లకు ఉద్యోగభద్రత కల్పించాలని... ప్రభుత్వోద్యుగులతో సమానంగా ప్రజలకు సేవలు అందిస్తున్న వారి డిమాండ్లన్నింటిని పూర్తిచేయాలని లోకేశ్ ప్రభుత్వానికి సూచించారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ... 4 లక్షల మంది వైసిపి కార్యకర్తలకు ఉద్యోగాలు కల్పించడానికి జగన్ 10 లక్షల మంది ఉద్యోగాలు తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే మీసేవ, అంగన్వాడీ, ఆశా, ఉపాధి హామీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను తొలగిస్తున్నారని ఆరోపించారు.
దాదాపు 17 సంవత్సరాల నుండ ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉన్న మీసేవ వ్యవస్థని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 వేల కుటుంబాలు మీసేవ పై ఆధారపడి ఉన్నాయని... వీరందరిని రోడ్డునపడేయడం బావ్యం కాదన్నారు. మీ సేవ ద్వారా ప్రభుత్వానికి సంవత్సరానికి సుమారుగా 200 కోట్ల ఆదాయం కూడా వస్తుందని లోకేశ్ తెలిపారు.
READ MORE నిరుద్యోగులకు శుభవార్త... 15,971 ఉద్యోగాల భర్తీకి సీఎం ఆదేశం
పాదయాత్రలో మీ సేవ ఆపరేటర్లు జీవితాలు మారుస్తానని అనేక హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో మీసేవ ఆపరేటర్లను,30 వేల కుటుంబాలను రోడ్డు మీదకు నెట్టారని ఆరోపించారు. తమ భవిష్యత్ పై ఆందోళనతో మీ సేవ ఆపరేటర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఇవి ఆత్మహత్యలు కావు ప్రభుత్వ హత్యలేనని లోకేశ్ పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న మీ సేవ సిబ్బంది కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మీసేవ సెంటర్ల ద్వారా ప్రజలకు సేవలు అందించడానికి సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్ ఉండేదని... కానీ జగన్ తీసుకొస్తున్న వ్యవస్థ ద్వారా ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి ఉండదన్నారు. పెట్టుకున్న ఆర్జి కి ఎప్పుడు పరిష్కారం దొరుకుతుందో అర్థం కాని పరిస్థితి వుంటుందన్నారు.
READ MORE ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తాను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నపుడు ఒక్క ఈ మెయిల్ ఇస్తే సమస్యలు పరిష్కరించానని... ఈ రోజు మీసేవ సిబ్బంది రోడ్లపై ఉన్నా సమాధానం చెప్పే పరిస్థితి లేదన్నారు. వీరి సమస్యలను పట్టించుకుని పరిష్కరించే వారు ప్రభుత్వంలో ఒక్కరు లేరన్నారు.
మీసేవ వ్యవస్థను కొనసాగించాలని... సిబ్బంది పోరాటానికి టిడిపి మద్దతు ఉంటుందన్నారు. మీసేవ ఆపరేటర్లు, సిబ్బందికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని...శాసనసభ, మండలిలో దీనిపై టిడిపి తరపున పోరాటం చేస్తామని నారా లోకేష్ వెల్లడించారు.