అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని  అమరావతిలో మాత్రమే కొనసాగించాలని ఆ ప్రాంత ప్రజలు  నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. తమ ప్రాంతం నుండి రాజధాని తరలిపోతే పిల్లల భవిష్యత్ ఏమయిపోతోందోనన్న బెంగతో అమరావతి ప్రాంతాల  ప్రజలు తీవ్ర ఆవేదనకు లోనవున్నారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యలు, గుండెపోటులకు లోనయి ఇప్పటికే పలువురు మృత్యువాతపడగా తాజాగా మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. 

ఈ విషాద సంఘటన వెంకటపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన మహిళ పెదప్రోలు నందకుమారి(56)కి భర్త లేడు. దీంతో ఇద్దరు పిల్లలకు అన్నీతానై పెంచుకుంది. అయితే రాజధాని విశాఖకు తరలించాలన్న ప్రభుత్వం నిర్ణయం తర్వాత తమ పిల్లల  భవిష్యత్ ఏమవుతుందోనని ఆమె గతకొన్నిరోజులుగా బాధపడుతున్నారు. 

ఈ క్రమంలోనే ఇవాళ ఓవైపు రాజధాని కోసం నిరసనలు జరుగుతున్న సమయంలోనే నందకుమారి తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. దీంతో ఒక్కసారిగా గుండెపోటుకు గురయి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించినా ఫలితంలేకుండా పోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు.  

READ  MORE  అమరావతి మహిళలపై పోలీసుల దాడి... జాతీయ మహిళా కమీషన్ సీరియస్

రాజధాని ఆందోళనల్లో ఇప్పటికే పలువురు రైతులు, మహిళలు ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఐనవోలుకు చెందిన పాలకాయల మాధవ అనే 60 ఏళ్ల రైతు గత బుధవారం గుండెపోటుతో మరణించాడు.

ల్యాండ్‌పూలింగ్ విధానంలో ఆయన రాజధానికి అర ఎకరం పొలం ఇచ్చాడు. ఈ క్రమంలో రాజధానిని అమరావతి నుంచి తరలించేందుకు ప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకోవడంతో ఆయన గత కొన్నిరోజులుగా ఆందోళనల్లో పాల్గొంటున్నాడు.

 ఇటీవల తీవ్ర మనస్తాపానికి గురైన మాధవ మంచానికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో బుధవారం గుండెపోటుకు లోనై మరణించారు. దీంతో ఐనవోలులో విషాద వాతావరణం నెలకొంది. 

రాజధాని ప్రాంతం  కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన రైతు  అద్దేపల్లి కృపానందం (68) బుధవారం తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందాడు. ఆయన గత 22 రోజులుగా రాజధాని అమరావతికి మద్దతుగా  నిరసనల్లో పాల్గొంటున్నారు.

READ  MORE  రాజకీయాల కోసమేనా ఉత్తరాంధ్ర... రాజధాని కోసం వద్దా...?: పవన్ ను నిలదీసిన అవంతి

 సీఎం జగన్‌ రాజధాని మార్పు ప్రకటన చేసినప్పటి నుంచి ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో ఆయన  తనకున్న  0.50 సెంట్ల భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ కోసం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున  గుండెపోటు వచ్చింది.

వెంటనే కుటుంబ సభ్యులు కృపానందంను మంగళగిరి లోని  ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. ఇప్పటికే రాజధాని తరలింపు నిర్ణయంతో బాధల్లో వున్న అమరావతి ప్రజలు ఇలా రైతులు మరణాలతో మరింత విషాదంలోకి జారుకున్నారు.