''నేను ఉన్నాను...నేను విన్నాను'' డైలాగ్ జగన్ వీరికోసమే వాడారు...: హోంమంత్రి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పట్టణంలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం సమావేశమయ్యింది. ఈ సమావేశంలో మంత్రులు సుచరిత, బొత్స సత్యనారాయణ లు పాల్గొని సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు.
అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడం కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కనీస చొరవకూడా చూపించలేదనిహోమంత్రి సుచరిత ఆరోపించారు. కానీ ఆనాడు ఎలాంటి అధికారం చేతుల్లో లేకున్నా జగన్ మీకు ''నేను ఉన్నాను... నేను విన్నాను'' అంటే భరోసా ఇచ్చారని... అధికారంలోకి రాగానే చెప్పిన మాట నిలబెట్టుకున్నారని ఆమె తెలిపారు.
చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్ సంస్థను స్థాపించారని... దాదాపు ఏడు రాష్ట్రాల్లో ఈ సంస్థ 6500 కోట్లు వసూళ్లు చేపట్టిందని గుర్తుచేశారు. అగ్రిగోల్డ్ సంస్థలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే ఉన్నారని పేర్కొన్నారు. ఇలా మోసపోయింది...మోసం చేసింది కూడా తెలుగువారే కాగా బాధితులను మొర ఆలకించనిది కూడా ఓ తెలుగు ముఖ్యమంత్రేనని చంద్రబాబుకు చురకలు అంటించారు.
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని ఎన్ని సార్లు చెప్పినా సీఎం హోదాలో వున్న చంద్రబాబు పట్టించుకోలేదని...ఆయన మనిషిలా కాకుండా మరమనిషిలా ప్రవర్తించారని అన్నారు. కానీ బాధితుల కష్టాలు విన్న ఆనాటి ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని... తాజాగా అధికారంలోకి వచ్చిన తొలి కేబినెట్ లోనే ఆదుకుంటూ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.
read more రాజ్యాంగబద్దం కాదు...అయినా అగ్రిగోల్డ్ బాధితులకు సాయం...: అప్పిరెడ్డి
కులమతాలు చూడకుండా బాధితులకు సీఎం న్యాయం చేశారని కొనియాడారు. బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.1150 కోట్లు కేటాయించారని వెల్లడించారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఇంకా విచారణ జరుగుతోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ...చంద్రబాబు అగ్రిగోల్డ్ సమస్యను సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి పాలనలో సమస్య పరిష్కరమవుతోందన్నారు. అగ్రిగోల్డ్ స్కాం వలన బాధితుల కుటంబాలు చితికిపోయాయని..అసెంబ్లీలో బాధితుల తరుపున అప్పటి ప్రతిపక్ష నేతగా జగన్ పోరాటం చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
కోట్ల విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులు మీద టీడీపీ నాయకులు కన్ను పడిందని..వందల మంది చనిపోయిన లక్షల మంది బాధపడుతున్న చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. శవాలు మీద చిల్లర దండుకోవాలని టీడీపీ నాయకులు ప్రయత్నం చేశారని విమర్శించారు.
read more సిఎం జగన్ ప్లెక్సీకి నంద్యాల ఎమ్మెల్యే పాలాభిషేకం
మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి, ఆయన తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాట ఇచ్చి తప్పిపోయే అలవాటు లేదన్నారు. జగన్ మాట ఇస్తే మళ్ళీ పని చేయండని గుర్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా బాధితులను సీఎం ఆదుకున్నారని అన్నారు.
ఆస్తులు అమ్మిన తరువాత అగ్రిగోల్డ్ బాడుతులను అదుకుందామని కొంతమంది సలహా ఇచ్చారని..దానికి జగన్ ఒప్పుకోలేదని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం బాధితులను వెంటనే ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ....రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు తెలుసుకొనేందుకు వారికి అండగా ఉండేందుకు జగన్ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు.
పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితులు జగన్ కు తమ సమస్యలు చెప్పుకున్నారని..అధికారంలోకి వచ్చిన తరువాత బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇచ్చిన హామీ ప్రకారం రూ. 1150 కోట్లు ఇచ్చారని తెలిపారు.
ప్రత్యేక హోదా కోసం పోరాటం అంటూ ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయలని చూశారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం సీఎం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని...సీఎం జగనే బాధితులకు స్వయంగా చెక్ లు ఇవ్వాలని కోరుతామమని బొత్స తెలిపారు.