Mahesh Babu:బాలయ్య డైరక్టర్ తో మహేష్ ? మధ్యలో మైత్రీ కండీషన్
మహేష్ తో సినిమా అంటే మామూలుగా ఉండదు. ఆ విషయం యంగ్ డైరక్టర్స్ అందరికీ తెలుసు. అందుకే వారి టార్గెట్ మహేష్ బాబు అన్నట్లుగా ఫీల్డ్ లో ట్రైల్స్ వేస్తూంటారు.
హిట్ అనేది ఇండస్ట్రీలో చాలా అత్యవసరమైన విషయం. మంచి హిట్ పడితే ఆ డైరక్టర్ ని పిలిచి మరీ సినిమాలు ఇస్తున్నారు స్టార్ హీరోలు. అలా ఒక్కసారిగా చిన్న సినిమా నుంచి పెద్ద సినిమాలకు హై జంప్ చేసే అవకాసం ఈ జనరేషన్ డైరక్టర్స్ కు వస్తోంది. అలాగే మార్కెట్ లో బజ్ ఉన్న డైరక్టర్స్ ని పిలిచి వారి కథలు స్టార్స్ విని ప్రాజెక్టులు సెట్ చేస్తున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు తన సినిమాలకు డైరక్టర్స్ ని ఇలాగే ఎంచుకుంటున్నారు. సరిలేరు నీకెవ్వరు చిత్రంకు దర్శకుడుగా అనీల్ రావిపూడిని, "గీత గోవిందం" సినిమా చూసి తన సర్కారు వారి పాటకు పరుశురామ్ ని డైరక్టర్ గా ఎంచుకున్నారు. అలాగే ఇప్పుడు మహేష్ దృష్టిలో మరో డైరక్టర్ పడ్డారని వినికిడి.
ఆ డైరక్టర్ మరెవరో కాదు గోపీచంద్ మలినేని. రవితేజ తో చేసిన "క్రాక్" తో బ్లాక్ బస్టర్ అందుకున్న గోపీచంద్ మలినేని మార్కెట్ లో హాట్ టాపిక్ గా మారారు. ఆయన దర్శకత్వంలో ప్రస్తుతం సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి టీజర్,ట్రైలర్ లు కూడా ఇంకా బయటకు రాలేదు. అయినా బ్రహ్మాండమైన బజ్ ఉంది.
ఇది గమనించిన మహేష్ బాబు ఆ డైరక్టర్ ని పిలిచి కథ వింటానని చెప్పినట్లు సమాచారం. మైత్రీ మూవీస్ వారు ఈ ప్రాజెక్టు సెట్ చేయటానికి ప్రయత్నిస్తున్నారట. అయితే ఓ కండిషన్ అని చెప్పారట.. బాలయ్యతో సినిమా సూపర్ హిట్ అయితేనే ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతుంది. ఈ మేరకు గోపీచంద్ మలినేని ఓ యాక్షన్ ఓరియెంటెడ్ కథను తన టీమ్ తో రెడీ చేయిస్తున్నట్లు చెప్తున్నారు.
ఇక బాలయ్య చిత్రం విషయానికి వస్తే... ఈ సినిమా లో హై ఓల్టేజి సీన్స్ ఉండబోతున్నాయట. లముఖ్యంగా హీరో, విలన్ మధ్య సన్నివేశాలు మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా అదిరిపోయేలా ప్రిపేర్ చేస్తున్నారట. అలాగే ఈ సినిమాలో హీరోకు ఓ రేంజి ఎలివేషన్లు, స్ట్రాంగ్ విలన్ పాత్ర, అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయట. బాలయ్య ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అవన్నీ సినిమాలో ఉంటాయని చెప్తున్నారు.