జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వీటిలో పోషకాల లోపం ఒకటి. శరీరంలో కొన్ని పోషకాలు లోపించడం వల్ల కూడా జుట్టు విపరీతంగా రాలుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి జుట్టు రాలకుండా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నూటిలో ఏ ఇద్దరిముగ్గురికో ఒత్తైన, పొడవాటి జుట్టు ఉంటుంది. మిగతా అందరికీ పొట్టి జుట్లే ఉంటాయి.కానీ వీరిలో చాలా మందికి హెయిర్ ఫాల్ సమస్య ఉంటుంది. ఈ హెయిర్ ఫాల్ సమస్య వల్ల నెత్తి మరింత పల్చగా మారుతుంది. అమ్మాయిలకేమో ఒత్తైన, పొడవాటి జుట్టే ఇష్టం. మీ జుట్టు పొడుగ్గా ఉండాలంటే సరైన హెయిర్ కేర్ తో పాటుగా డైట్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే జుట్టు రాలడానికి శరీరంలో పోషకాహార లోపం, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యతతో పాటుగా ఎన్నో కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలడం ఆగాలంటే మాత్రం ఐరన్, కాపర్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తినాలని నిపుణులు చెబుతున్నారు.
జుట్టు రాలడానికి ప్రధాన కారణం శరీరంలో ఇనుము, రాగి లేకపోవడం. అందుకే జుట్టు రాలడం ఆగడానికి చాలా మంది ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తింటుంటారు. కానీ అది ఉపయోగపడదని నిపుణులు చెబుతున్నారు.
ఇనుము ఎక్కువగా ఉండే ఆహారాన్ని గట్లో సరిగ్గా గ్రహించడానికి, రాగి ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఆహారంలో చేర్చడం కూడా చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.
హిమోగ్లోబిన్ మన కణాలకు ఆక్సిజన్ ను అందించడానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే మన శరీరంలో ఇనుము లోపం వల్ల జుట్టు బలహీనంగా, నిర్జీవంగా మారుతుంది. శరీరంలో ఐరన్ లోపాన్ని పోగొట్టాలంటే ఖర్జూరాలు, దానిమ్మ, పప్పులు, ఆకుకూరలు, నల్ల ఎండుద్రాక్ష, మునగాకును మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవాలి.
అలాగే మీరు దానిమ్మ జ్యూస్ ను కూడా మీ డైలీ డైట్ లో చేర్చుకోవచ్చు. వీటితో పాటు ఆపిల్, క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ లు కూడా శరీరంలో ఐరన్ లోపాన్ని పోగొడుతాయి. ఇనుము పాత్రలో ఆహారాన్ని ఉడికించినట్టైతే ఇది శరీరంలో ఇనుము లోపాన్ని చాలావరకు తగ్గిస్తుంది. అలాగే జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది.
బాదం, జీడిపప్పు, పిస్తా, నువ్వులు, గుమ్మడికాయ గింజలు, పుట్టగొడుగులు, ముదురు ఆకుపచ్చ కూరగాయలు వంటి తినడం వల్ల కూడా శరీరంలో ఇనుము సక్రమంగా శోషించబడుతుంది. ఇది మీరు ఆరోగ్యంగా ఉండటానికి, జుట్టు రాలకుండా చేయడానికి సహాయపడుతుంది.