మహిళలపై కరోనా ప్రభావం.. 70లక్షల అవాంఛిత గర్భాలు
మరో ఆరునెలలు ఇదే పరిస్థితి కొనసాగితే ఈ మహిళల సంఖ్య 4.7 కోట్లకు చేరుతుందని యూఎన్‌ఎ్‌ఫపీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాలియా కానెమ్ హెచ్చరించారు.
ప్రశాంతంగా ఉన్న జీవితాల్లో కరోనా వైరస్.. దాని మూలంగా దేశంలో విధించిన లాక్ డౌన్ ఎంతలా ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ కరోనా వైరస్ మహిళలపైనా తీవ్ర ప్రభావం చూపుతోందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
రానున్న రోజుల్లో విశ్వవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది మహిళలు అవాంఛిత గర్భధారణ పొందే అవకాశముందని ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ (యూఎన్‌ఎ్‌ఫపీఏ) చేసిన పరిశోధనలో తేలింది.
కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌తో పాటు మరిన్ని చర్యలు చేపట్టడంతో ఆరోగ్య సదుపాయాలు, కుటుంబ నియంత్రణ లాంటి పద్ధతులకు మహిళలు దూరమవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోందని ఆ పరిశోధన చెబుతోంది.
మరో ఆరునెలలు ఇదే పరిస్థితి కొనసాగితే ఈ మహిళల సంఖ్య 4.7 కోట్లకు చేరుతుందని యూఎన్‌ఎ్‌ఫపీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నటాలియా కానెమ్ హెచ్చరించారు.
అలాగే గృహహింస, బాలికలపై వేధింపులు వంటి తీవ్రమైన పరిణామాలను కూడా మున్ముందు చవిచూడాల్సి ఉంటుందని ఆమె వెల్లడించారు.
ఇలాంటి విపత్కర సమయంలో మహిళల ఆరోగ్యం, వారికి కావాల్సిన సదుపాయాలు, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆయా దేశాలు ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవకాశముందని ఐక్యరాజ్యసమితి గుర్తుచేస్తోంది.