Kodi Pandalu: ఈ ట్రిక్ తెలిస్తే ఈ సంక్రాంతికి మీరే రాజు
సంక్రాంతి సంబరమంతా ఏపీలోనే ఉంటుంది. అన్ని పండుగలకన్నా ఇదే పెద్ద పండుగ కూడాను. సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటేనే ముందుగా చెప్పుకోవాల్సింది కోడిపందేలు. అయితే కోడిపందెలు ఎలా నిర్వహించాలో తెలుసుకునేందుకూ ఓ శాస్త్రం ఉందట. మరి ఆ శాస్త్రం ఏం చెప్తుందో చూద్దాం.

సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరమంతా ఏపీలోనే ఉంటుంది. పండుగొస్తుందంటే చాలు ముందు నుంచి బోలెడన్నీ ప్లాన్స్ ఉంటాయి, కొత్త బట్టలు, ఇంట్లో కొత్త అల్లుళ్ల సందడి, పిండివంటలు, గాలిపటాలు, ముగ్గులు, ఘాటైన ఘుమఘుమలతో సంక్రాంతిని ఎంజాయ్ చేస్తారు. ఎక్కడెక్కడ ఉన్నవారు కూడా..సంక్రాంతి సమయానికి సొంతూళ్లకు చేరుకుంటారు. సంక్రాంతి వారం రోజులు ఇంట్లో వాళ్లతో గడుపుతారు. బంధువుల పలకరింపులు, ఫ్రెండ్స్ తో ముచ్చట్లు....ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడనున్నాయి..సంక్రాంతి కబుర్లు.
సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ మాత్రం కోడిపందేలే
ఇక సంక్రాంతి అంటే అన్నింటికన్నా ముందు చెప్పుకోవాల్సింది కోడిపందెలు. సంక్రాంతికి సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ మాత్రం కోడిపందెలే. కోడి పందెలు నిర్వహించడం చట్టరీత్యా నేరం అని తెలిసినా…సంక్రాంతి బరిలో ఈ కోడిపందేలు ఉండాల్సిందే. ముఖ్యంగా గోదారోళ్లకు...ఇదొక ఎమోషన్ తో పాటు పరువు, మర్యాద కూడా. కోడి పందేల కోసం ప్రత్యేకంగా బరులు సిద్ధం చేస్తారు. ముందు నుంచే పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంటారు. పందేలు చూసేందుకు వచ్చేవారి కోసం సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. డీజేలు, డాన్స్ లు, ఫుడ్ స్టాళ్సు ఇలా ఒక్కటేమిటీ..తిరునాళ్లను తలపించేలా ఉంటుంది. అంత క్రేజ్ ఉంది....ఈ కోళ్ల పందెలకు. పందెంలో గెలిస్తే పందెం రాయుళ్లకు లక్షల్లో డబ్బు వచ్చి పడుతుంది.
అయితే ఈ కోడి పందెలు నిర్వహించడం అంత ఆషామాషీ కాదు. ఎలా పడితే అలా ఏర్పాటుచేయరు. దానికి మూహుర్తం, మంచి చెడ్డలతో పాటు శాస్త్రం ఫాలో అవుతారంట. ఏ కోళ్లను బరిలోకి దింపాలి, ఏ సమయంలో కోడిపందెలు నిర్వహించాలో తెలుసుకునేందుకూ ఓ శాస్త్రం ఉందట. అదే కుక్కుట శాస్త్రం.
కుక్కుట శాస్త్రం ఏం చెబుతోందంటే..
ఈ కుక్కుట శాస్త్రంలో పందెం కోళ్లు గురించి, దాని పెంపకం, వాటిలో ఉండే జాతులకు సంబంధించి ఉంటుంది. అంతేకాదు..పందెం ఎప్పుడు వేయాలి, ఏ కోడిని పందెం బరిలో పెట్టాలి అనేది ఉంది. అందుకే ఈ శాస్త్రం ప్రకారం కోళ్ల పందెలు నిర్వహిస్తారు. దీని కోసం వారం, వర్జ్యం చూసి పందెం పెడతారు. అలా చేస్తే పందెంలో గెలుస్తామని నమ్ముతారు. కుక్కుటశాస్త్రం...పందెం రాయుళ్లకు ఆయుధం లాగా. కోడిని సంస్కృతంలో కుక్కుట అంటారు. అందుకే దీనికి కుక్కుట శాస్త్రం అని పేరు వచ్చింది.
కోడి పుంజుల్లో ఇన్ని రకాలా?
కోడి పుంజుల్లో చాలా రకాలు ఉంటాయి. వాటిని రంగుల బట్టి కోడి పుంజు జాతులను శాస్త్రం వివరిస్తుంది. అందులో కాకి, సేతు, పర్ల, సవల, కొక్కిరాయి, డేగ, నెమలి, కౌజు, మైల, పూల, పింగళ, నల్లబోర, ఎర్రపొడ, ముంగిస, అబ్రాసు, గేరువా ఇలా ఉంటాయి. కాకి కోడిపుంజుకు నల్లని ఈకలుంటాయి. సేతుకు మొత్తం తెల్లగా ఉంటాయి, పర్లకు మెడపై నలుపు, తెలుపు ఈకలు. కొక్కిరాయికి శరీరం నల్లగా ఉంటుంది. 2, 3 రకాల ఈకలుంటాయి. సవలకు మెడపై మొత్తం నల్లని ఈకలుంటాయి. డేగ ఈకలు ఎర్రగా ఉంటాయి. నెమలి కోడికి వీపుపై పసుపు రంగు ఈకలు. కౌజుకు నలుపు, ఎరుపు, పసుపు ఈకలు. మైల కోడికి ఎరుపు, యాష్ కలర్ లో ఈకలు ఉంటాయి. పింగళ కోడికి రెక్కలు తెలుపు రంగులో ఉంటాయి. అక్కడక్కడా నలుపు, గోదుమ రంగులో ఉంటాయి. ఇక ముంగిస కోడికి ఈకలు జూలు రంగులో ఉంటాయి. అబ్రాసుకు లైట్ గోల్డెన్ కలర్ లో ఉంటాయి. గేరువా కోడికి తెలుపు, లేత ఎరుపు రంగులో ఈకలుంటాయి.
కోడిపుంజుల గెలుపోటములపై నక్షత్రాల ప్రభావం
అయితే ఈ కోడి పందేలు గెలుపోటములపై నక్షత్రాల ప్రభావం ఉంటుంది. కుక్కుటశాస్త్రంలో 27 నక్షత్రాలు ఉంటాయి. ఏ నక్షత్రంలో ఏ కోడిపుంజు గెలుస్తుందో, ఏ కోడి ఓడిపోతుందో ఈ కుక్కుటశాస్త్రంలో వివరంగా రాశారు. అంతేకాదు ఏరోజు, ఏ దిశలో కోడి పందేలకు నిర్వహిస్తే…మంచి ఫలితాలొస్తాయన్నది క్లియర్ గా పొందుపరిచారు. అందుకే పందెం రాయుళ్లు ఈ శాస్త్రం ప్రకారం బరిలోకి దిగుతారు.
ఇక పందెం కోడి చచ్చిపోయినా ఏం బాధపడక్కర్లేదు. ఏనుగు చచ్చినా , బతికినా వెయ్యే అన్నట్లు,. ఈ పందెం కోడి కూడా చచ్చినా, గెలిచినా వేలల్లో పలుకుతుంది. బరిలో నిలిచిన కోడి కోసం వేలల్లో డబ్బులు పెడతారు. ఎందుకంటే కొన్ని నెలల నుంచి పెంచుతారు. వాటికి మంచి ఆహారం బాదం, పిస్తా, జీడిపప్పు పెట్టి మేపుతారు. బరిలో గెలవడానికి కోడి కండ బలం కోసం వ్యాయామం చేయిస్తారు. బలవర్థకమైన ఆహారం తింటుంది కాబట్టే...చచ్చినా కూడా దాని రుచి అదిరిపోద్ది. అందుకే చచ్చిన కోడిని కూడా కొనేందుకు జనం ఎగబడతారు.

