- Home
- Sweet Heart
- Viral News
- Open to Marry: నన్ను పెళ్లి చేసుకుంటారా? లింక్డ్‌ఇన్ లో యువకుడి పెళ్లి ప్రపోజల్ వైరల్
Open to Marry: నన్ను పెళ్లి చేసుకుంటారా? లింక్డ్‌ఇన్ లో యువకుడి పెళ్లి ప్రపోజల్ వైరల్
Open to Marry: లింక్డ్‌ఇన్ లో కేవలం వృత్తిగత విషయాలనే పంచుకుంటారు. కానీ ఒక యువకుడు పెళ్లి కాకపోవడంతో విసిగిపోయి లింక్డ్‌ఇన్ లోనే పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. OpentoMarry హ్యాష్ ట్యాగ్ తో వైరల్ అయ్యాడు.

లింక్డ్‌ఇన్ లో పెళ్లి ప్రపోజల్
ఆ యువకుడి పేరు శుభమ్ గుణే. ఆయన ఒక సంస్థను స్థాపించాడు. సీఈఓగా మంచి ప్రొఫెషనల్ కెరీర్ ను కూడా కలిగి ఉన్నాడు. కానీ పెళ్లి మాత్రం కావడం లేదు. డేటింగ్ యాప్‌లు, పెళ్లి వెబ్ సైట్లలో ప్రయత్నించాడు. కానీ తన జీవిత భాగస్వామిని కనుగొనలేకపోయాడు. దీంతో చివరికి లింక్డ్‌ఇన్ ను ఉపయోగించుకునేందుకు సిద్ధపడ్డాడు. తన ఫోటోపై OpentoMarry హ్యాష్ ట్యాంగ్ క్రియేట్ చేసి తన బాధను లింక్డ్‌ఇన్ పోస్ట్ లో చెప్పుకున్నాడు.
నన్ను పెళ్లి చేసుకుంటారా?
శుభమ్ గుణే.. తన పోస్టులో మొదట ‘మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా’ అని మొదలుపెట్టాడు. తర్వాత ‘నా గురించి జడ్జ్ చేసే ముందు పూర్తిగా నా మాట వినండి’ అని ఆరంభించాడు. ఇదే నా చివరి ప్రయత్నం.. డేటింగ్ యాప్ లు, మ్యాట్రిమోనీ యాప్ లు, స్నేహితులు, బంధువులు.. ఇలా అన్ని రకాలుగా ప్రయత్నించాను. కానీ ఇంతవరకు పెళ్లి కాలేదు. కేవలం నేను ఒక్కడినే కాదు ఎంతోమంది నాలా ఉన్నారు. లింక్డ్‌ఇన్ ఉద్యోగాలను, క్లయింట్లను, పెట్టుబడిదారులను వెతికి ఇస్తున్నప్పుడు జీవిత భాగస్వామిని మాత్రం ఎందుకు వెతికి ఇవ్వదు? అని ప్రశ్నించాడు. కాబట్టి Opentomarry హ్యాష్ ట్యాగ్ ప్రారంభించాలని పిలుపు ఇచ్చాడు. తాను నిజాయితీగా పెళ్లికి సిద్ధంగా ఉన్నానని, ఆసక్తి ఉన్న అమ్మాయిలు తమ ఉద్యోగం, వారు నివసిస్తున్న నగరం పేరును కామెంట్ల రూపంలో తెలియజేయమని కోరాడు. ఏ సిటీ పేరు ఎక్కువగా వస్తుందో ఆ సిటీలో ఒక ఈవెంట్ ను పెడతానని చెప్పుకొచ్చాడు. అంటే దాదాపు స్వయంవరమేనని చెప్పుకోవాలి.
పెళ్లికాక అబ్బాయిల బాధ
వృత్తిగతంగా విజయవంతమైనా, భావోద్వేగపరంగా, పరిణితి చెందినా, ఆర్థికంగా స్థిరపడినా కూడా నిజమైన జీవిత భాగస్వామిని కనుగొనడంలో యువత వెనకపడుతోందని చెప్పడానికి శుభమ్ గుణే ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. అతడు లింక్డ్‌ఇన్ లో చేసిన ఈ ప్రయోగం చాలా సాహసోపేతమైనదే. క్లయింట్లు, ఉద్యోగాలనే వెతికి పెడుతున్న లింక్డ్‌ఇన్ నిజంగానే జీవిత భాగస్వామిని కూడా వెతికి పెట్టగలదని నమ్మాలి.
పెళ్లి బాధ
శుభమ్ గుణే పోస్టు ఇప్పుడు లింక్డ్‌ఇన్ లో వైరల్ గా మారిపోయింది. OpentoMarry హ్యాష్ ట్యాగ్ కూడా అందరికీ నవ్వు తెప్పిస్తోంది. ఎంతోమంది అతని పోస్టుకు స్పందించారు. శుభమ్ గుణేలాగే పెళ్లికాక మిగిలిపోయిన ఒక యువకుడు ‘మా అమ్మ కూడా చెబుతోంది.. నేను కూడా ఇలాగే ప్రయత్నించాలి’ అంటూ మెసేజ్ పెట్టాడు. మరి కొందరు ‘షాదీ డాట్ కామ్ వారు వింటున్నారా’ అంటూ మెసేజ్ చేశారు.
డేటింగ్ యాప్ లా మారింది
మరికొందరు వినియోగదారులు మాత్రం లింక్డ్‌ఇన్ ఇప్పటికే ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌గా మారుతోందని కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు డేటింగ్ యాప్, మ్యాట్రీమనీ యాప్ గా కూడా మారిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయని అంటున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు.. అయితే శుభమ్ గుణే పోస్టు వల్ల మన భారతీయ యువత.. జీవిత భాగస్వామి వెతుక్కోలేక ఎంత ఇబ్బంది పడుతోందో, ఎంతమంది ఇలా ఒంటరిగా మిగిలిపోతున్నారో అర్థం అయ్యేలా చేస్తోంది.