బంగారమైన టమాటా పంట.. ఒక్క నెలలో రూ.3 కోట్ల సంపాదనతో కోటీశ్వరుడైన రైతు...ఎక్కడంటే..
పండిన టమాటా బంగారమయ్యింది. ఒక్కనెలలోనే రూ.3 కోట్ల రూపాయలకు అధిపతిని చేసింది. పూణే రైతు ఇంట్లో సిరులు కురిపించింది.
tomato
పూణే : టమాటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. సామాన్య జనం టమాటాలు కొనలేక తెగ ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు టమాటా రైతుల ఇంట సంతోషాలు ఉప్పొంగుతున్నాయి.
ఏళ్లుగా టమాటా సాగు చేస్తున్నా.. ఎన్నడూ కనీ, వినీ ఎరుగని లాభాలు కళ్ల చూస్తున్నారు టమాటా రైతులు. ధరలు కలిసి రావడంతో వారి పంట పండినట్టు అయింది.
తాజాగా మహారాష్ట్రలోని పూణేలో ఓ రైతు ఏకంగా ఒక్కనెలలోనే రూ. మూడు కోట్లు సంపాదించాడు. జీవితంలో ఎప్పుడూ ఊహించని విధంగా లాభాలు రావడంతో ఆ రైతు ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.
దీని గురించి ఈశ్వర్ గైకార్ అనే ఆ టమాటా రైతు మాట్లాడుతూ…‘నాకున్న 16 ఎకరాల భూమిలో.. 12 ఎకరాల్లో టమాటా వేస్తాను. గతంలో ధరలు సరిగా లేకపోవడంతో గిట్టుబాటు కూడా రాకపోయేది కొన్నిసార్లు అయితే లక్షల్లో నష్టాలు కూడా చూశాను.
2021లో దాదాపు రూ. 16 లక్షలు నష్టపోయాను. నిరుడు కూడా కేవలం స్వల్ప లాభాలతో బయటపడ్డాను. ఈ ఏడాది కూడా మేలో టమాట ధరలు చాలా పడిపోవడంతో పెద్ద మొత్తంలో టమాటాలను పడేసాను. ఆ సమయంలో తీవ్రంగా బాధపడ్డాను.
నా బాధనంతా తీర్చేస్తూ గత కొద్ది రోజులుగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. జూన్ 11 నుంచి జూలై 18 వరకు పెరిగిన టమాట రేట్ల వల్ల రూ. మూడు కోట్లు సంపాదించాను’ అని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Tomato price hike
ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈమేరకు చెప్పుకొచ్చారు. తాను ఇన్నేళ్లుగా టమాటా సాగు చేస్తున్నప్పటికీ ఎప్పుడూ ఈ రేంజ్ లో రేట్లు పెరగలేదని అన్నారు. తమ కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందని ఆ కుటుంబం సంతోషంగా చెబుతోంది.
భారీ వర్షాలు, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం లాంటి కారణాలతో టమాటా ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఒక్కసారిగా టమాటా రేటు ఆకాశాన్నంటుతోంది. టమాటధరలను నియంత్రించేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర నుంచి టమాటాలను కొనుగోలు చేయాలని నేషనల్ కోపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్సీసీఎఫ్).. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లను కేంద్రం ఆదేశించింది.
ఢిల్లీ ఎన్సీఆర్, పాట్నా తదితర ప్రాంతాల్లో గతవారం నుంచి ధరలు అధికంగా ఉండడంతో ఆయా ప్రాంతాల్లో టమాటాలను డిస్కౌంట్ ధరలకు విక్రయించడం ప్రారంభించింది.