వీడి దుంపతెగ... కలలు నియంత్రణకు..స్వయంగా బుర్రకు డ్రిల్ చేసుకుని ‘చిప్’ పెట్టుకున్నాడు.. చివరికి...
తన కలలను తానే నియంత్రించాలనుకున్నాడో వ్యక్తి. యూ ట్యూబ్ లో వీడియోలు చూసి బుర్రకు డ్రిల్ చేసుకున్నాడు. చిప్ కూడా పెట్టుకున్నాడు. కానీ...
కజకిస్తాన్ : కళ్ళు మూసుకుంటే కల సాక్షాత్కారమవుతుంది. ప్రతి ఒక్కరికి రోజు కలలు వస్తాయి.. కానీ, అందులో గుర్తుండేవి చాలా తక్కువ. కొన్నిసార్లు ఆ కల ఒక అందమైన అనుభూతిగా మిగిలిపోతే మరోసారి పీడకలగా మారి వెంటాడుతుంది.. మనకు వచ్చే కలలకు కూడా అర్థాలు ఉంటాయని కలల నిపుణులు చెబుతుంటారు.
అలాంటప్పుడు.. మనకి ఈ కలలు మాత్రమే రావాలి.. మంచి కలలు కనాలి అని నియంత్రించుకోవడం వీలవుతుందా?.. అంటే అది మన చేతుల్లో లేని పని… కానీ, ఓ వ్యక్తి మాత్రం తన కలలను తానే నియంత్రించుకోవాలనుకున్నాడు.
దీనికోసం దారుణానికి దిగాడు. దీంతో అతను చేసిన ప్రమాదకరమైన పని అతడిని.. చావు ముంగిటి నిలబెట్టింది. కానీ, అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు. ఇంతకీ అతను ఏం చేశాడంటే.. కలల నియంత్రణ కోసం మెదడులో చిప్ పెట్టుకోవాలనుకున్నాడు.
వైద్య నిపుణులు సంప్రదించాల్సింది పోయి.. స్వయంగా తానే తలకు డ్రిల్లింగ్ యంత్రంతో డ్రిల్ చేసుకున్ని రంద్రం చేసుకున్నాడు… వింటుంటేనే భయంతో, అంత నొప్పిని ఎలా భరించాడు అన్న అనుమానంతో.. ఒళ్ళు ఒక్కసారిగా జలదరిస్తుంది.
అయితే అతను మాత్రం ఆ నొప్పిని భరిస్తూనే.. తలకి డ్రిల్ చేసుకుని.. మెదడు దగ్గర చిప్ప అమర్చుకున్నాడు. కానీ తీవ్ర రక్తస్రావం కావడంతో కూలిపోయాడు. గమనించిన వారు అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో చావుతప్పి కనులు లొట్టబోయిన చందాన… ఎలాగోలా బతికి బయటపడ్డాడు. ఈ ఘటన కజకిస్తాన్ లో చోటుచేసుకుంది. అక్కడి స్థానిక వార్తా సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం…
ఈ పిచ్చిపనికి పూనుకున్న వ్యక్తి పేరు మిఖాయిల్ రాదుగా (40). కలలను నియంత్రించవచ్చన్న సమాచారం తెలుసుకున్న అతను.. అది అది ఎలా చేయవచ్చో ఇంటర్నెట్లో వెతికాడు. న్యూరో సర్జన్లు చేస్తున్న వీడియోలు చూశాడు. ఇంకేముంది ఓ డ్రిల్లింగ్ మిషన్ కొనుక్కొని తన మీద తానే ప్రయోగం చేసుకున్నాడు. దీనికోసం తన ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నాడు.
Dream Interpretation
డ్రిల్లింగ్ మిషన్ తో కపాలానికి స్వయంగా రంధ్రం చేసుకున్నాడు. ఆ తరువాత ఓఎలక్ట్రోడ్ చిప్ ను తలలో అమర్చుకున్నాడు. నొప్పి గురించిన మాట పక్కన పెడితే.. ఈ ప్రాసెస్ అంతా సాగడానికి నాలుగు గంటల సమయం పట్టింది. దీంతోపాటు తీవ్ర రక్తస్రావం అయింది. దాదాపు లీటర్ రక్తం కోల్పోయాడు. అదే అతడి ప్రాణాల మీదికి తెచ్చింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్పించారు.
డాక్టర్లు తీవ్రంగా శ్రమించి అతనిని బతికించారు. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే రాదుగా తాను చేసిన పనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అంతేకాదు తాను చేసిన ప్రయత్నాన్ని గొప్పగా చెప్పుకుంటూ…‘మెదడులో స్వయంగాఎలక్ట్రోడ్ ఇంప్లాంటేషన్ చేసుకున్నాను.
దీంతో మెదడులోని ఓ భాగంలో ఎలక్ట్రిక్ స్టిములేషన్ నిర్వహించా. . దీనివల్ల కలలు కనేటప్పుడు మెదడు ఉద్దీపనను పరీక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్రయోగం చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి’ అని గొప్పగా రాసుకొచ్చాడు.
అంతేకాదు.. ఈ ప్రయోగ ఫలితాల వల్ల కలల నియంత్రణ సాంకేతికతలకు అవకాశాల ద్వారాలను తెరుస్తాయని చెబుతున్నాడు. నిజానికి ఈ ఆపరేషన్ కోసం న్యూరో సర్జన్ల దగ్గరికి వెళదామని అనుకున్నాడట.. కానీ, అటూ ఇటూ అయితే వారి మీద కేసులు నమోదవుతాయని.. వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకుని తానే స్వయంగా రంగంలోకి దిగాడట.