పాలు, టీ పొంగిపోకుండా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు
కిచెన్ లో మనం రెగ్యులర్ గా పాలు, టీ వేడి చేస్తూనే ఉంటాం. ఎంత జాగ్రత్తగా గమనించినా ఒక్కోసారి అవి పొంగిపోతుంటాయి. దానివల్ల పాలు, టీ వృథా కావడంతో పాటు శ్రమ కూడా పెరుగుతుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఎలాగో చూడండి.

పాలు, టీ పొంగిపోకుండా ఉండేందుకు చిట్కాలు
కిచెన్ లో చాలామంది మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో పాలు లేదా టీ పొంగిపోవడం ఒకటి. దానివల్ల పాలు, టీ వేస్ట్ అవుతాయి. ఆ పాత్ర పాడవుతుంది. గ్యాస్ పై కూడా మొండి మరకలు ఏర్పడుతాయి. వాటిని క్లీన్ చేయడానికి టైం పడుతుంది. శ్రమ పెరుగుతుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యను పూర్తిగా నివారించవచ్చు. అవేంటో చూద్దాం.
పెద్ద పాత్ర ఉపయోగించాలి
పాలు వేడి చేసేటప్పుడు పాత్రను జాగ్రత్తగా ఎంచుకోవాలి. పాలు పొంగిపోకుండా ఉండాలంటే పాలు మరిగే సమయంలో ఆవిరి పైకి సులభంగా వెళ్లేలా పెద్దపాత్ర, లేదా లోతైన పాత్ర తీసుకోవాలి. చిన్న పాత్రలో ఎక్కువ పాలు పోస్తే వెంటనే పొంగిపోయే అవకాశం ఉంటుంది. అదే పెద్ద పాత్రను ఉపయోగించడం వల్ల పాలు పైకి వచ్చినా ఆ పాత్ర అంచు దాటవు.
చల్లటి నీటితో
పాలు వేడిచేసే ముందు పాత్ర లోపలి భాగాన్ని కొంచెం నీటితో తడిపి లేదా చల్లటి నీటిని వేసి కొద్దిసేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల పాలు గిన్నెకు అంటుకునే అవకాశం తగ్గుతుంది. అలాగే వేడి సమానంగా వ్యాపిస్తుంది. దాంతో పాలు అకస్మాత్తుగా పొంగిపోకుండా క్రమంగా మరుగుతాయి.
పాత్రపై స్పూన్ పెట్టడం
పాలు మరిగే గిన్నెపై అడ్డంగా ఒక చెక్క స్పూన్ ఉంచితే, పాలు పైకి పొంగే సమయంలో చెక్క స్పూన్ తాకి తిరిగి కిందకు వస్తాయి. ఎందుకంటే కర్ర చల్లగా ఉండడం వల్ల పాల పై పొరలోని బుడగలు పగిలి ఆవిరి బయటకు పోతుంది.
తక్కువ మంటపై
పాలు మరిగేటప్పుడు మంట నియంత్రణ కూడా చాలా ముఖ్యం. హై ఫ్లేమ్ పై పెడితే పాలు త్వరగా మరిగి పొంగిపోతాయి. కాబట్టి పాలు మరిగే దశలో మంటను కొంచెం తగ్గించాలి. మొదట హై ఫ్లేమ్ పై పెట్టినా.. కాస్త వేడి కాగానే లో ఫ్లేమ్ లోకి మార్చడం మంచిది. దీనివల్ల పాలు పొంగే అవకాశం తగ్గుతుంది.
పాలు, నీళ్లు సరైన మోతాదులో
టీ విషయంలో కూడా ఇంతే. టీ పొంగిపోకుండా ఉండాలంటే నీరు, పాలు సరైన మోతాదులో కలపడం ముఖ్యం. ఎక్కువ పాలు వేసినప్పుడు టీ పొంగిపోవడం సాధారణం. కాబట్టి నీళ్లు సరైన మోతాదులో కలపాలి. అలాగే టీ పొంగకుండా ఉండాలంటే లో ఫ్లేమ్ పై మరిగించాలి. మరిగే సమయంలో స్పూన్ తో కలుపుతూ ఉండాలి.
నెయ్యి లేదా వెన్న
టీ పొంగిపోకుండా ఉండటానికి నెయ్యి లేదా వెన్న చుక్క వేసే చిట్కా కూడా చాలా ప్రసిద్ధి. టీ వేడెక్కే సమయంలో ఒక చుక్క నెయ్యి వేసి కలిపితే, అది పై పొర ఏర్పడకుండా చేస్తుంది. తద్వారా టీ పొంగిపోకుండా ఉంటుంది.
టీలో స్పూన్ వేయడం
టీ పాత్రలో స్పూన్ వేయడం ద్వారా కూడా టీ పొంగకుండా చూసుకోవచ్చు. నిజానికి ఈ చిట్కాను చాలామంది మహిళలు పాటిస్తుంటారు. టీ మరిగేటప్పుడు ఈ స్పూన్ చిన్న శబ్దం చేస్తుంది. అది ఒక హెచ్చరికగా పనిచేస్తుంది.
పాలు లేదా టీ పొంగిపోకుండా ఉండటానికి ధ్యాస, సహనం కూడా చాలా అవసరం. చాలా మంది స్టవ్ పై పాలు పెట్టి ఇతర పనుల్లో నిమగ్నమవుతారు. అలాంటప్పుడు పాలు, టీ పొంగిపోవడం సహజం. కాబట్టి పాలు మరిగేటప్పుడు కొద్దిసేపు ఆ పాత్ర దగ్గర ఉండడం ఉత్తమం.