మిక్సీ ఎక్కువ కాలం చక్కగా పనిచేయాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు
కిచెన్ లో ఎక్కువగా ఉపయోగించే వస్తువుల్లో మిక్సీ ఒకటి. కూరలు, చట్నీలు, మసాలాల వంటి వాటిని నిమిషాల్లో సిద్ధం చేసి వంట పనిని ఈజీ చేస్తుంది మిక్సీ. కానీ చాలా మిక్సీలు త్వరగా చెడిపోతుంటాయి. మరి ఎక్కువ కాలం పనిచేయాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.

మిక్సీ ఎక్కువకాలం పనిచేయాలంటే ఏం చేయాలి?
ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో మిక్సీ ఉంటోంది. వంటగదిలో కూరలు, చట్నీలు, జ్యూస్‌లు, పిండివంటలు ఏం చేసినా మిక్సీ తప్పనిసరి. అయితే చాలామంది మహిళలు తమ మిక్సీ సరిగ్గా పనిచేయడం లేదని చెబుతుంటారు. నిజానికి మిక్సీ జీవితకాలం దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుతున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. మరి మిక్సీ ఎక్కువకాలం చక్కగా పనిచేయాలంటే ఏం చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ప్లగ్ పాయింట్
మిక్సీని ఎప్పుడూ సరైన ప్లగ్ పాయింట్‌లో కనెక్ట్ చేయాలి. ఇది పవర్ ఎక్కువగా వినియోగించే యంత్రం కాబట్టి.. ఓవర్‌లోడ్ లేదా లూజ్ కనెక్షన్ ఉంటే మోటార్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఒకే ప్లగ్ బాక్స్ లో ఎక్కువ ఎలక్ట్రానిక్ వస్తువులు ఒకే సారి వాడటం కూడా మంచిది కాదు. అలాగే మిక్సీని ఎక్కువసేపు విరామం లేకుండా వాడకూడదు. దానివల్ల మోటార్ దెబ్బతింటుంది. కాబట్టి ప్రతి 30–40 సెకన్లకు ఒకసారి ఆపి, కొద్ది సేపు విశ్రాంతి ఇవ్వడం మంచిది.
మిక్సీ జార్ లో పదార్థాలు నింపడం
మిక్సీ జార్‌లో పదార్థాలు వేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జార్‌ను పూర్తిగా నింపడం వల్ల బ్లేడ్ సరిగ్గా తిరగక, మోటార్‌పై ఒత్తిడి పడుతుంది. అందుకే జార్‌లో సగం నుంచి మూడొంతుల వరకు మాత్రమే పదార్థాలు వేసుకోవాలి. అలాగే గట్టిగా ఉన్న పదార్థాలను ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే మిక్సీకి తేలికగా ఉంటుంది. పొడి పదార్థాలు గ్రైండ్ చేసే సమయంలో కొద్దిగా నీరు వేసుకోవడం మంచిది.
మిక్సీని శుభ్రం చేయడం
మిక్సీని వాడిన తర్వాత జార్ లను వెంటనే శుభ్రం చేయాలి. వాడిన వెంటనే కడగకపోతే పదార్థాలు ఎండిపోయి బ్లేడ్ చుట్టూ పేరుకుపోతాయి. ఇది రుచిని మాత్రమే కాదు, పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. జార్ లను గోరువెచ్చని నీటిలో కొద్దిగా సబ్బు వేసి కడగడం మంచిది.
బ్లేడ్ లు మార్చడం
బ్లేడ్‌లు పదును తగ్గినా లేదా జార్ కింద ఉన్న రబ్బరు సీల్ పాడైనా మిక్సీ పనితీరు తగ్గిపోతుంది. నెలకోసారి ఈ భాగాలను చెక్ చేయడం మంచిది. అవసరమైతే కొత్త బ్లేడ్‌లు మార్చుకోవాలి. అలాగే మిక్సీని ఆన్ చేసే ముందు జార్ లో పదార్థాలు వేసి, మూత బిగించి, ప్లగ్ సరిగ్గా ఉందో చూసుకోవాలి. ఆపిన తర్వాతే ప్లగ్ తీయడం సురక్షితమైన పద్ధతి.
పొడి క్లాత్ తో..
మిక్సీ మోటార్ బేస్ కూడా తరచూ శుభ్రం చేయాలి. దుమ్ము, ధూళీ లేదా మసాలా పొడి వెంట్స్‌లో పేరుకుపోతే గాలి ప్రసరణ తగ్గిపోతుంది. అప్పుడు మోటార్ వేడెక్కుతుంది. పొడి క్లాత్ తో లేదా చిన్న బ్రెష్‌తో తుడవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. మిక్సీ నుంచి వింత శబ్దం వచ్చినా లేదా సరిగ్గా పనిచేయకపోయినా వెంటనే సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్లడం మంచిది. సంవత్సరానికి ఒకసారి ప్రొఫెషనల్ సర్వీసింగ్ చేయించుకుంటే మిక్సీ ఎక్కువ కాలం చక్కగా పనిచేస్తుంది.