జుట్టు రాలడం వెంటనే తగ్గాలంటే ఈ 7 ఫాలో అయితే చాలు!
మనలో చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఖరీదైన ప్రోడక్టులు వాడుతుంటారు. కానీ కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా…

జుట్టు రాలడాన్ని తగ్గించే ఇంటి చిట్కాలు
జుట్టు మన అందానికి ప్రతిబింబం. కానీ గజిబిజి లైఫ్ స్టైల్, పోషకాహార లోపం, ఒత్తిడి ఇతర కారణాల వల్ల చాలామందిలో జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అందుకోసం ఏం చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
కొబ్బరినూనెతో తలపై మసాజ్..
కొబ్బరినూనెను కొద్దిగా వేడి చేసి.. దాన్ని తలపై కొంచెం కొంచెంగా వేస్తూ మృదువుగా మసాజ్ చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇది జుట్టు కుదుళ్లను బలపరచడంలో సహాయపడుతుంది. వారానికి కనీసం రెండు సార్లు ఇలా మసాజ్ చేయడం మంచిది.
ఆముదం..
ఆముదం నూనె జుట్టు పెరుగుదలకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ E అధికంగా ఉంటుంది. కొబ్బరినూనెతో కలిపి ఆముదం నూనెను ఉపయోగిస్తే మంచి ఫలితం లభిస్తుంది.
గుడ్డు మాస్క్
గుడ్డు ప్రోటీన్లతో నిండి ఉంటుంది. ఒక గుడ్డును కొద్దిగా నిమ్మరసం లేదా పెరుగుతో కలిపి తలపై పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇది జుట్టు పటుత్వాన్ని పెంచుతుంది.
వేపాకు మరిగించిన నీరు
వేప ఆకులను నీటిలో మరగబెట్టి ఆ నీటిని తల స్నానానికి ఉపయోగించడం ద్వారా జుట్టు రాలడాన్ని నియంత్రించవచ్చు. ఇది తలపై ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్‌ను తొలగిస్తుంది. చుండ్రు వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.
అలోవెరా గుజ్జు
తాజా అలోవెరా గుజ్జును తలకు పంట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టును మృదువుగా చేస్తుంది. చుండ్రు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఆరోగ్యకరమైన ఆహారం
జుట్టు రాలడం తగ్గాలంటే మంచి ఫుడ్ తీసుకోవడం కూడా ముఖ్యం. ప్రోటీన్, ఐరన్, జింక్, ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పప్పులు, ధాన్యాలు, ఆకుకూరలు, గుడ్లు, చేపలు తీసుకోవడం ఉత్తమం.
ఒత్తిడిని తగ్గించుకోండి
మానసిక ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చు. కాబట్టి.. ధ్యానం, యోగా వంటి అలవాట్ల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోండి. రెగ్యులర్ గా తలస్నానం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని నియంత్రించుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.