- Home
- Telangana
- IMD Rain Alert : తెలంగాణలో అత్యధిక వర్షం కురిసిన టాప్ 10 ప్రాంతాలివే.. ఈ జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ యాక్టివ్
IMD Rain Alert : తెలంగాణలో అత్యధిక వర్షం కురిసిన టాప్ 10 ప్రాంతాలివే.. ఈ జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ యాక్టివ్
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు మరోవైపు వానలతో వింత వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో అయితే 45 డిగ్రీల హయ్యెస్ట్ టెంపరేచర్స్, మరికొన్నిచోట్ల 10 మిల్లిమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు...
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో ఈ వేసవిలో ఎండలే కాదు వర్షాలు కూడా దంచికొడుతున్నాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు... సాయంత్రం అయ్యిందంటే మేఘాలు కమ్ముకుని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అసలు ఇది వేసవికాలమా లేక వర్షాకాలమా అన్న అనుమానం కలుగుతోంది. అల్పపీడనాలు, ఉపరితల ద్రోణులు ప్రభావంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో జోరువానలు మొదలయ్యాయి... ఇవాళ (ఏప్రిల్ 20, సోమవారం) కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి.
తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనాలివే..
తెలంగాణలో నిన్న(ఏప్రిల్ 19, ఆదివారం) పలుచోట్ల భారీ వర్షం కురిసింది… ఇవాళ (ఏప్రిల్ 20) మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశాలున్నాయట. ఏయే జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయో తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, జనగాం, సిరిసిల్ల, కామారెడ్డి, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి, మలుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. మధ్యాహ్నం ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో మొదలయ్యే వర్షాలు సాయంత్రానికి ఊపందుకుంటాయని... రాత్రి జోరువానలు కురుసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ హెచ్చరించారు.
హైదరాబాద్ లో భారీ వర్షాలు...
హైదరాబాద్ లో కూడా వర్షాలు కొనసాగుతాయని వెదర్ మ్యాన్ తెలిపారు. మధ్యాహ్నం ఎండలు కొనసాగినా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారుతుంది... వర్షాలు మొదలవుతాయని హెచ్చరించారు. నగరంలో కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయట... దీంతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వర్ష సమయంలో హోర్డింగ్ ల వద్ద, చెట్లకింద ఉండరాదని వెదర్ మ్యాన్ సూచిస్తున్నారు.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్...
ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా వర్షాలు కురిసే అవకాశాలున్న జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటోంది. ఈ వర్షాలకు ఉరుములు మెరుపులు, 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు తోడయి ప్రమాదకరంగా మారతాయని హెచ్చరిస్తోంది. కొన్నిచోట్ల పిడుగులు పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, వికారాబాద్ , సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లోనూ వర్షాలుంటాయట. ఈ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలే కురిసే అవకాశాలుండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నాలుగైదు రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
ఆదివారం అత్యధిక వర్షపాతం నమోదైన టాప్ 10 ప్రాంతాలివే...
కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని - 11.4 మిల్లిమీటర్లు
మేడ్చల్ జిల్లా బాచుపల్లి - 10.7 మి.మీ
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి - 9.2 మీ.మి
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి - 8.3 మి.మీ
నిజామాబాద్ జిల్లా శిర్కొండ - 2.6 మి.మీ
సంగారెడ్డి జిల్లా కంగ్టి - 1.8 మి.మీ
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి - 1.6 మి.మీ
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ - 1.5 మి.మీ
నాగర్ కర్నూల్ జిల్లా బల్కూర్ - 1.3 మి.మీ
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి - 1.2 మి.మీ
తెలంగాణలో వింత వాతావరణం...
తెలంగాణలో ఓవైపు మధ్యాహ్నం 41 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపోతున్నాయి... మరోవైపు సాయంత్రం జోరువానలు కురుస్తున్నాయి. ఇలా ఎండా వానలతో వింత వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అన్నిజిల్లాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... నిన్న ఆదివారం అత్యధికంగా ఆదిలాబాద్ లో 44.3 డిగ్రీలు నమోదయ్యింది. ఇక నిజామాబాద్ లో 43.1, మహబూబ్ నగర్ లో 42.3, మెదక్ 42, డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో అత్యధికంగా హకీంపేటలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.
ఆంధ్ర ప్రదేశ్ లో ఎండావానలు...
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఓవైపు ఎండలు, మరోవైపు వానలు కొనసాగుతున్నాయి. ఇవాళ (ఏప్రిల్ 20, సోమవారం) కూడా కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. ద్రోణి ప్రభావంతో సోమవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది.

