- Home
- Telangana
- weather: తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
weather: తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
weather alert: తెలంగాణపై రుతుపవనాల ఆగమన ప్రభావం కనిపిస్తోంది. రాష్ట్రంలో రాబోయే కొన్ని రోజుల పాటు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయి.

బంగాళాఖాతంలో ద్రోణి, ఉపరితల ఆవర్తనం.. తెలంగాణలో భారీ వర్షాలు
Telangana rains: రాష్ట్రవ్యాప్తంగా వచ్చే కొన్ని రోజుల పాటు వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కేంద్రం వెల్లడించింది. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు
సోమవారం, మంగళవారం రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఇతర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి తదితర జిల్లాల్లో వర్షాల ప్రభావం ఉంటుందని తెలిపింది.
హైదరాబాద్‌లోతగ్గనున్న ఉష్ణోగ్రతలు
సోమవారం హైదరాబాద్‌లో వాతావరణ ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, తేమ శాతం 70% ఉంది. తూర్పు-దక్షిణ తూర్పు దిశ నుండి గంటకు 9.3 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. వాతావరణ శాఖ సూచించిన ప్రకారం, మే 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ కాలంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 3 నుండి 5 డిగ్రీల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది.
30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు
వివిధ జిల్లాల్లో 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉప్పల్, మేడిపల్లీ, చర్లపల్లి, రాంపల్లి, తార్నాక, మల్లాపూర్, ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్, ఎల్‌బీ నగర్, వనస్థలిపురం, నాగోల్, రామంతాపూర్ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.
ఒక ద్రోణి దక్షిణ మధ్య బంగాళాఖాతం మీద ఏర్పడిందనీ, దీనిని శక్తి సైక్లోన్ గా వాతావరణ శాఖ పేర్కొంది. ఇది ఆంధ్రప్రదేశ్ వైపు వంపు తీసుకొని ముందుకు సాగుతుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది.
వడగండ్లతో కూడిన భారీ వర్షాలు
ఇది మోస్తరు నుండి భారీ వర్షాలకు కారణమవుతుందని తెలిపింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఇతర జిల్లాలైన మంచిర్యాల, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, మెదక్, వికారాబాద్, కమ్మం, హన్మకొండ, అదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు, వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరిక జారీ చేశారు.
భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్స్
రుతుపవనాలు కూడా ఈ సంవత్సరం మే 27 నే కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. సాధారణంగా ఇది జూన్ 1న ప్రారంభమవుతుంది. 2025 రుతుపవన కాలంలో సాధారణం కంటే అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు.