Rains : ఏప్రిల్ 5,6న భారీ వర్షసూచన... ఈ రెండ్రోజులు తెలంగాణలో సెలవులే
తెలంగాణ, ఆంధ్ర ప్రదేేశ్ లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇలా వేసవికాలంలో కురిసే వర్షాలను ఏమంటారో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Rains in Andhra Pradesh and Telangana
Rains in Andhra Pradesh and Telangana : మండువేసవిలో తెలుగు రాష్ట్రాలు చల్లబడ్డాయి. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో నిన్న(గురువారం) నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వల్ల వాతావరణం చల్లబడింది. ఈ వర్షాలు మరో రెండ్రోజులు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఇలా వీకెండ్ లో వాతావరణం చల్లబడటం, ఉద్యోగులు, విద్యార్థులకు వరుస సెలవులు రావడం కలిసివచ్చాయి. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇక ఆదివారం ఎలాగూ సెలవే. అంతేకాదు ఈరోజు అంటే ఏప్రిల్ 6న శ్రీరామ నవమి ఉంది. ఈరోజు తెలంగాణ అయోధ్య భద్రాచలంలో సీతారాముల కల్యాణం అంగరంగవైభవంగా జరగనుంది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో రామనవమి ఉత్సవాలు జరగనున్నాయి.
శ్రీరామ నవమి వేళ భక్తులు ఇబ్బంది పడకూడదనే ఆ వరుణుడు దిగివచ్చినట్లుగా ఉంది పరిస్థితి. ఇన్ని రోజులు ఎండలు మండిపోగా సరిగ్గా శ్రీరామ నవమికి ముందు వర్షాలు మొదలయ్యాయి. ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది... అంటే శ్రీరామ నవమి రోజు కూడా వాతావరణం చల్లగా ఉండనుంది. వరుస సెలవులు, వాతావరణం కలిసి రావడంతో తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి వేడుకలకు భక్తులు భారీగా తరలిరానున్నారు.
Rains in Andhra Pradesh and Telangana
మండు వేసవిలో ఈ వర్షాలేంటి?
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు పలు దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నారు. తమిళనాడులో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి... కర్ణాటకలో కూడా భారీ వానలు కురుస్తున్నారు. నడి వేసవిలో ఇలా వర్షాలు కురవడం పిల్లలు, యువతకు ఆశ్చర్యంగా ఉన్నా పెద్దవాళ్లుమాత్రం ఇది సహజమేనని అంటున్నారు.
వేసవిలో ఇలా ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు ప్రతిసారి కురుస్తాయని చెబుతున్నారు. అయితే ఈసారి కాస్త ఎక్కువగా కురుస్తున్నాయని అంటున్నారు. ఇలా వేసవిలో కురిసే వర్షాలను 'మామిడి జల్లులు' లేదా 'వేసవి వర్షాలు' అంటారని తెెలిపారు.
మార్చిలో మామిడి పూత ప్రారంభమయ్యే సమయం నుండి మామిడి కాయలు సీజన్ ఏప్రిల్, మే లో ఎప్పుడైనా ఈ వర్షాలు కురుస్తాయి. ఈదురుగాలులు, వడగళ్ల వానల కారణంగా మామిడి పంట దెబ్బతింటుంది... ఇలా రైతులను తీవ్ర నష్టాన్ని చేస్తాయి ఈ అకాల వర్షాలు. మామిడి పంటను దెబ్బతీస్తాయి కాబట్టే ఈ వర్షాలను మామిడి జల్లులు అంటారట.
ప్రస్తుతం సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది... దీనికి సమాంతరంగా ద్రోణి కూడా ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇలా వాతావరణ పరిస్థితులు మారడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తగ్గి వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు.
మరో రెండ్రోజులు అంటే ఏప్రిల్ 5,6న (శని, ఆదివారం) కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని... ఈదురుగాలులు, వడగండ్లు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. కొన్ని జిల్లాలో వర్షాలు పడనుండగా మరికొన్ని జిల్లాల్లో వాతావరణం చల్లబడుతుందని ప్రకటించారు.
Telangana Rains
తెలంగాణలో భారీ వర్షాలు ... ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ :
తెలంగాణలో గురువారం భారీ వర్షం కురిసింది. రాజధాని హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షం దంచికొట్టింది. వర్షాకాలంలో మాదిరిగా గంటసేపు వర్షం కురవడంతో రోడ్లపైకి వరదనీరు చేరింది. అలాగే పిడుగుపాటుకు పలువురు ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్ లోని హైటెక్ సిటీతో పాటు కూకట్ పల్లి, మియాపూర్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లి, ట్యాంక్ బండ్, ఉప్పల్, హిమాయత్ నగర్, అంబర్ పేట్, దిల్ సుఖ్ నగర్, అమీర్ పేట్ వంటి ప్రధాన ప్రాంతాలతో శివారులో కూడా వర్షం దంచికొట్టింది. అత్యధికంగా హిమాయత్ నగర్ లో 9.1, ఛార్మినార్ లో 9 సెంటిమీటర్ల వర్షం కురిసింది. ఈ ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా చారిత్రాత్మక ఛార్మినార్ పెచ్చులూడిపడ్డాయి. అలాగే ఆ ప్రాంతంలో మోకాళ్లలోతు వరదనీరు పారడంతో చిరువ్యాపారులు, పర్యాటకులు ఇబ్బందిపడ్డారు.
నగరంలో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. రోడ్లపై భారీగా వరదనీరు చేరడమే కాదు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జి కిందకు భారీగా వరదనీరు చేరడంతో మలక్‌పేట్ - దిల్‌సుఖ్ నగర్ మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. సికింద్రాబాద్ ఒలిఫెంట్ బ్రిడ్జి దగ్గర కూడా ఇలాగే వరదనీరు కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి.
ఇక తెలంగాణ జిల్లాల విషయానికి వస్తే అత్యధికంగా సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సిద్దిపేట, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో వర్షం కురిసింది. ఈ జిల్లాల్లో అకాలవర్షాల కారణంగా మామిడితో పాటు వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులు, వడగళ్లు, ఉరుముల వల్ల పంటనష్టమే కాదు ప్రాణనష్టం కూడా జరిగింది.
మరో రెండ్రోజులు తెలంగాణలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని ప్రకటించారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు. ఇక హైదరాబాద్ తో పాటు మిగతా జిల్లాల్లో కూడా ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Andhra Pradesh Rains
ఆంధ్ర ప్రదేశ్ లో వానలు :
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా నిన్నటి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లా కందనదిలో పిడుగుపాటు కారణంగా ఓ బాలుడు మృతి చెందాడు. అలాగే అనంతపురం జిల్లా కదిరిపల్లిలో మహిళ మృతి చెందింది.
ఏపీలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 6.8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక ప్రకాశంలో 6.5, అన్నమయ్య జిల్లాలో 5.7, నంద్యాలలో 4.3, ఎన్టిఆర్ జిల్లాలో 3.9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. మిగతా జిల్లాలో కూడా చిరుజల్లులు కురిసాయి... రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది.
ఆంధ్ర ప్రదేశ్ లోని అల్లూరి, కాకినాడ, తూర్పు గోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో రానున్న రెండ్రోజులు వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వేసవికాలం వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉంటుంది... అలాగే ఈదురుగాలులు, వడగళ్ల వల్ల కూడా ఆస్తినష్టం, ప్రాణనష్టం జరుగుతుంది. కాబట్టి వర్షసూచనలున్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు జాగ్రత్తలు సూచించారు.