Hyderabad History: నిజాంలనాటి చివరిగుర్తులు, మిగిలింది ఇవే..
హైదరాబాద్ ఒక నగరమే కాదు..నిజాంల కాలానికి సజీవ సాక్ష్యం. భాగ్యనగరం అణువణువులోనూ నిజాం నాటి జ్ఞాపకాలు పదిలమై ఉన్నాయి. నగరానికి ల్యాండ్ మార్క్ గా నిలిచిన కొన్ని ప్రాంతాలు..హైదరాబాద్ సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నాయి.

హైదరాబాద్ చరిత్ర ఇదే
హైదరాబాద్ గొప్పదనం.. స్మారకాల్లోనే కాదు..మాటల్లోనూ కనిపిస్తుంది. 16వ శతాబ్దంలో కుతుబ్ షాహీ వంశం స్థాపించిన ఈ నగరం, చార్మినార్ నిర్మాణంతో స్వతంత్ర రాజధానిగా రూపుదిద్దుకుంది. అనంతరం నిజాం పాలనలో హైదరాబాద్ పరిపాలనా, విద్యా, వైద్య రంగాల్లో విశేష ప్రగతి సాధించింది. అప్పటి దేశంలోనే సంపన్న నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
హైదరాబాద్ అణువణువున చరిత్ర దాగి ఉంది. ఈ నగరంలో ప్రతి వీధి, ప్రతి ప్రాంతానికి ఓ కథ ఉంది. మనం రోజూ పిలిచే ప్రాంతాల పేర్ల వెనుక ఎంత ఆసక్తికరమైన కథలు దాగి ఉన్నాయో గమనించారా? అబిడ్స్, తార్నాక, బేగంపేట్ లాంటి పేర్లు నోటికి వచ్చినంత సులభంగా వచ్చాయా, లేక వాటి వెనుక ఏమైనా చరిత్ర ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా?. మనకు సాధారణంగా అనిపించే ఈ పేర్లే ఆనాటి రాజులు, అధికారులు, సైన్యం, వ్యాపారానికి సంబంధించిన జ్ఞాపకాలుగా నిలిచాయి. నగరం ఎంత మారినా, ఈ పేర్లు మాత్రం మారకుండా హైదరాబాద్ గతాన్ని మన రోజువారీ మాటల్లోనే ఇప్పటికీ గుర్తు చేస్తూనే ఉన్నాయి.
చరిత్ర చిరునామాలు
అయితే హైదరాబాద్‌లో దశాబ్దాలుగా మారకుండా నిలిచిపోయిన అబిడ్స్, టార్నాక, గన్ ఫౌండ్రీ, బేగంపేట్, మసబ్ ట్యాంక్, ఏసీ గార్డ్స్, సోమాజీగూడ వంటి ప్రాంతాల పేర్లు భాగ్యనగర గతానికి నిదర్శనాలు. నిజాం పాలన, బ్రిటిష్ కాలం, అప్పటి సైనిక స్థావరాలు, ట్రామ్ మార్గాలు, రాజవంశపు నివాసాల చరిత్ర ఈ పేర్ల వెనుక దాగి ఉన్నాయి. ఆధునిక హైదరాబాద్ ఎంత వేగంగా అభివృద్ధి చెందినా, ఈ ల్యాండ్‌మార్క్స్ పేర్లు మాత్రం మారలేదు. హైదరాబాద్ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవక్కర్లేదు, నగరంలోని ప్రాంతాల పేర్ల వెనుక కథను తెలుసుకుంటే సరిపోతుందనుకోవడంలో అతిశయోక్తి లేదు.
అబిడ్స్, గన్ ఫౌండ్రీ, మాసబ్ ట్యాంక్ పేరు వెనుక కథ తెలుసా?
అబిడ్స్: నిజాం రాజుల వ్యక్తిగత సహాయకుడైన ఆల్బర్ట్ అబిడ్ పేరు మీదే ఈ ప్రాంతానికి అబిడ్స్ అనే పేరు వచ్చింది. ఆయన ఏర్పాటు చేసిన చిన్న దుకాణం కాలక్రమంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ దుకాణం కేంద్రంగా చేసుకుని పరిసర ప్రాంతం అదేపేరుతో గుర్తింపు పొందింది. ఒక వ్యక్తి పేరు, ఒక చిన్న వ్యాపారం..హైదరాబాద్‌లోనే అత్యంత కీలక వాణిజ్య ప్రాంతాల్లో ఒకటిగా మారింది.
గన్ ఫౌండ్రీ: హైదరాబాద్‌లోని గన్ ఫౌండ్రీకి ఆ పేరు రావడానికి కారణం..నిజాం కాలంలో ఫ్రెంచ్ జనరల్ రేమండ్ తుపాకుల తయారీ కేంద్రం స్థాపించారు. అందుకే దీన్ని 'తోప్-కా-సాంచా' (తుపాకీల ఫ్యాక్టరీ) అని పిలిచేవారు, కాలక్రమేణా అది గన్‌ఫౌండ్రీగా స్థిరపడింది. కాలం మారి ఆ ఫ్యాక్టరీ కనిపించకపోయినా, ఆ చరిత్రను గుర్తు చేస్తూ ఆ పేరు మాత్రం ఇప్పటికీ అలాగే నిలిచిపోయింది.
మాసబ్ ట్యాంక్: నిజాం కాలానికి చెందిన ఒక రాణి నిర్మించిన మా-సాహెబ్ ట్యాంక్ నుంచే ఈ ప్రాంతానికి పేరు వచ్చింది. క్రమేణా పేరు మారుతూ మాసబ్ ట్యాంక్ అయింది. ఒక నీటి ట్యాంక్‌తో మొదలైన ఈ పేరు..నేడు హైదరాబాద్‌లో కీలక ప్రాంతానికి గుర్తింపుగా మారింది.
కాలక్రమంలో మారిన పేర్లు
తార్నాక: ఉస్మానియా యూనివర్సిటీ ఉన్న ఈ ప్రాంతంలో నిజాంల కాలంలో చెక్ పోస్టు ఉండేది. దాన్ని ప్రజలు తర్ర నాక అని పిలిచేవారు. కాలక్రమంలో అదే పదం మారుతూ తార్నాకగా స్థిరపడింది.
ఏసీ గార్డ్స్: ఒకప్పుడు ఈ ప్రాంతం నిజాం రాజుల ఆఫ్రికన్ సంతతికి చెందిన సైనికుల కోసం ఈ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాన్ని ప్రజలు ఏసీ గార్డ్స్ అని పిలవడం మొదలుపెట్టారు.
సోమాజిగూడ: నిజాం కాలంలో రెవెన్యూ ఉద్యోగిగా పనిచేసిన సోనాజీ పేరుతో..ఈ ప్రాంతానికి సోనాజీ అనే పిలిచేవారు. అప్పట్లో సోనాజీగూడ అని పిలిచేవారు. అదే నేటి సోమాజీగూడ.
నిజాం కాలం నాటి చివరి గుర్తులు
ఇలా ఒక్కో ప్రాంతం గురించి చెప్పుకుంటూ పోతే అర్థమయ్యేది ఒక్కటే. నగరం నరనరాల్లో ఒక కాలం జ్ఞాపకం ఉంది. ఒక కథ దాగి ఉంది. నగరం పెరిగింది, మారింది, కొత్త భవనాలు వచ్చాయి. కానీ ఈ పేర్లు మాత్రం చరిత్రను విడిచిపెట్టలేదు. ఇవే హైదరాబాద్ నిజాం కాలం నాటి చివరి గుర్తులు. అందుకే హైదరాబాద్‌ను చూస్తే కేవలం రోడ్లు, భవనాలే కనిపించవు, మనం గుర్తించలేని, మనకు కనిపించని మన మాటల్లోనే జీవిస్తున్న ఒక భావోద్వేగ చరిత్ర కనిపిస్తుంది.

