ప్రయాణికులకు షాక్.. ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల పెంపు
RTC Bus Fares: తెలంగాణలో ఆర్టీసీ బస్సుల ఛార్జీలు అక్టోబర్ 6 నుంచి పెరుగుతున్నాయి. అన్ని రకాల బస్సుల్లో రూ.5 నుండి రూ.10 వరకు పెంపు అమల్లోకి రానుంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

దసరా తర్వాత ఆర్టీసీ షాక్
ప్రయాణికులకు ఆర్టీసీ షాక్ ఇచ్చింది. మరీ ముఖ్యంగా దసరా పండుగ ముగిసిన కొద్దీ రోజుల్లోనే హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఒక్కసారిగా పెద్ద షాక్ ఇచ్చింది. జంట నగరాల పరిధిలో నడుస్తున్న ఆర్టీసీ బస్సుల ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. సోమవారం (అక్టోబర్ 6) నుంచి ఈ టికెట్ ధరల పెంపు అమల్లోకి వస్తుందని పేర్కొంది.
సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మొదటి మూడు స్టేజీల వరకు రూ.5 పెంపు ఉంటుంది. 4వ స్టేజీ నుండి రూ.10 అదనపు ఛార్జీ వసూలు చేయనున్నారు. మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో కూడా ఇదే విధంగా పెంపు ఉంటుందని ఆర్టీసీ తెలిపింది.
పండుగ సీజన్‌లో టీజీఎస్‌ఆర్టీసీకి రూ.110 కోట్ల ఆదాయం
బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా టీజీఎస్‌ఆర్టీసీ మంచి ఆదాయం పొందింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పండగ ఈ సీజన్‌లో రూ.110 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. తొలుత 7,754 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినా, ప్రయాణికులు తక్కువగా ఉండటంతో చివరికి 5,300 బస్సులు మాత్రమే నడిపినట్టు తెలిపారు.
ప్రత్యేక బస్సుల్లో సగం వరకు అదనపు ఛార్జీలు వసూలు చేయడం ద్వారా ఈ ఆదాయం లభించింది. గతేడాది ఇదే సీజన్‌లో రూ.114 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి సొంతూర్లకు వెళ్లే వారు తక్కువగా ఉండటం, కొందరు ప్రైవేట్ వాహనాలను ఉపయోగించడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు.
దసరా తిరుగు ప్రయాణాల కోసం అదనపు బస్సులు
బతుకమ్మ, దసరా పండగలు పూర్తి కావడంతో మళ్లీ నగరానికి రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలోనే తిరుగు ప్రయాణాల రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 5, 6 తేదీల్లో అదనపు బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వీసులు పెంచనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యాలపై ఎండీ నాగిరెడ్డి సమీక్ష
టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి ఇటీవల ఎంజీబీఎస్, జేబీఎస్ బస్‌స్టేషన్లను పరిశీలించారు. బస్టాండ్లలో శుభ్రత, తాగునీరు, కూర్చునే సౌకర్యం, మరుగుదొడ్లు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలను సమీక్షించారు. దూర ప్రయాణికులకు మెరుగైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అలాగే ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్లు, లాజిస్టిక్స్ కౌంటర్ల పనితీరు కూడా పరిశీలించారు. ప్రయాణికులతో నేరుగా మాట్లాడి సేవలపై అభిప్రాయాలను సేకరించారు.
హైదరాబాద్ పరిధిలో 275 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాబోయే మూడు నెలల్లో 275 ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి తీసుకురావాలని ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాణిగంజ్, పటాన్‌చెరు, కూకట్‌పల్లి డిపోల్లో కొత్త ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
ఇప్పటికే మియాపూర్, జేబీఎస్, హెచ్‌సీయూ, హయత్‌నగర్, బీహెచ్‌ఈఎల్ డిపోలలో ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్ నాటికి మరిన్ని స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి.