- Home
- Telangana
- Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. భారీ వర్షాలు, ఈదురుగాలులపై ఐఎండీ అలర్ట్
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. భారీ వర్షాలు, ఈదురుగాలులపై ఐఎండీ అలర్ట్
Weather Update:తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోతోంది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో పలు ప్రాంతాల్లో తీవ్రమైన పొడి వాతావరణం ఉంటుందని ఐఎండీ పేర్కొంది.

పొడి వాతావరణం.. ఆ తర్వాత దంచికొట్టనున్న వానలు!
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో వాతావరణం పూర్తిగా మారనుంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో పాటు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం, ప్రజలు రాబోయే వాతావరణ మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అండమాన్ సమీపంలో ఆవర్తనం.. వాయుగుండంగా మారే ఛాన్స్
ఉత్తర అండమాన్ సముద్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశముంది. దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందనే దానిపై రాబోయే రెండు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఎల్ నినో ప్రభావం ఉన్న సంవత్సరాల్లో బంగాళాఖాతంలో తుపాన్లు ఏర్పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ మూర్తి తెలిపారు.
తెలంగాణలో ఐదు రోజులు పొడి వాతావరణం.. ఆ తర్వాత వానల ఎంట్రీ
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అక్టోబర్ 22 రాత్రి విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, అక్టోబర్ 22 నుంచి 27 వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఈ కాలానికి ప్రత్యేక హెచ్చరికలేవీ జారీ చేయలేదు. అయితే, అక్టోబర్ 27 నుంచి 28 వరకు, అలాగే అక్టోబర్ 28 నుంచి 29 వరకు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు.
ఈ సమయంలో పిడుగులు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రమాద స్థాయిని మధ్యస్థంగా అంచనా వేశారు. రక్షణ లేని నిర్మాణాలు, వదులుగా ఉన్న వస్తువులకు స్వల్ప నష్టం కలగవచ్చు. ప్రతికూల వాతావరణంలో సురక్షిత ప్రాంతాలకు చేరుకునేలా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు, తెలంగాణలో ఎండలు, ఉక్కపోత పెరగడానికి రుతువుల మార్పే ప్రధాన కారణమని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. వర్షాకాలం నుంచి శీతాకాలానికి మారుతున్న సమయంలో ఇలాంటి పరిస్థితులు సాధారణమని, అయితే ఎల్ నినో ప్రభావాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమని పేర్కొన్నారు.
కోస్తాంధ్ర, యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
అమరావతి వాతావరణ కేంద్రం అక్టోబర్ 22 రాత్రి విడుదల చేసిన సూచనల ప్రకారం, కోస్తాంధ్ర, యానాంలో అక్టోబర్ 22న కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచవచ్చు.
అక్టోబర్ 23న కొన్ని చోట్ల భారీ వర్షాలు పడవచ్చు. 24న ఒకటి, రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. 25, 26 తేదీల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని, ప్రత్యేక హెచ్చరికలు లేవు. కానీ 27, 28 తేదీల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాయలసీమలో వాతావరణ పరిస్థితి ఇదే
రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడా భారీ వర్షాలు పడవచ్చు. 23, 24 తేదీల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. 25, 26 తేదీల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చని, ప్రత్యేక హెచ్చరికలు లేవని అధికారులు తెలిపారు. అయితే, 27, 28 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి కాబట్టి రైతులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.








