Betting Apps : బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన తెలుగు నటీనటులు వీళ్లే
యువత జీవితాలను నాశనంచేసే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి జీవితంలో సెటిలయ్యారు కొందరు సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్స్. అలాగే సినీనటులు కూడా గ్యాంబ్లింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసేలా యాడ్స్ లో పాల్గొన్నారు. ఇలా తెలుగురాష్ట్రాల్లో గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినవారు ఎంతమంది ఉన్నారో తెలుసా?

Betting Apps
Gambling Apps : ఒకప్పుడు ఎక్కడో ఊరిబయట చెట్లకింద జూదం ఆడేవారు... ఈ టెక్నాలజీ పుణ్యమా అని అది ఇప్పుడు ఇంట్లోకి చేరింది. చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలా చాలా ఈజీగా జూదం ఆడవచ్చు... దీన్ని స్టైల్ గా బెట్టింగ్ అంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ మాయలోపడి యువత జీవితాలను నాశనం చేసుకుంటుంది. ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా మనీ సంపాదించాలన్న దురాశతో ఉన్నడబ్బులు పోగొట్టుకుంటున్నవారు అనేకమంది. ఈ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పోగొట్టుకుని చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు.
టీవి ఆన్ చేస్తేచాలు ఈ బెట్టింగ్ యాప్స్ యాడ్సే... యూట్యూబ్, సోషల్ మీడియాలోనూ వీటి ప్రమోషన్సే. మరీముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రభావం ఎక్కువగా ఉంది. సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ అందరూ ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసేవారే. తమ అభిమానులు, ఫాలోవర్స్ ఏమైపోతే ఏంటి... బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసామా, లక్షలాది రూపాయలు తీసుకున్నామా అన్నదే వారికి ముఖ్యం. వీరిమాటలు నమ్మి బెట్టింగ్ లో డబ్బులు పెట్టి సర్వస్వం కోల్పోయి రోడ్డునపడ్డవారు చాలామంది ఉన్నారు.
ఇలా కాసులకు కక్కుర్తిపడి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినవారు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ డబ్బులతో ఎంజాయ్ చేసినవారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ప్రముఖ హీరో హీరోయిన్ల నుండి ఇతర నటులు, సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్ ఎవ్వరినీ వదిలిపెట్టడంలేదు పోలీసులు... బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినవారి లిస్ట్ ను ఇక్కడ చూడవచ్చు.
Betting Apps
బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సినీనటులు :
విజయ్ దేవరకొండ :
అర్జున్ రెడ్డి, పెళ్ళి చూపులు, గీతాగోవిందం వంటి సూపర్ హిట్ సినిమాల హీరో విజయ్ దేవరకొండ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్స్ యాడ్స్ లో నటించారు. ఈయన A23 అనే యాప్ ను ప్రమోట్ చేసారు. తాజాగా విజయ్ దేవరకొండపై హైదరాబాద్ మియాపూర్ లో కేసు నమోదయ్యింది.
రానా దగ్గుబాటి :
ప్రముఖ సినీనిర్మాత రామానాయుడు మనవడు, సురేష్ బాబు తనయుడు, హీరో రానా దగ్గుబాటి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కూడా ఈ బెట్టింగ్ లేదా గ్యాబ్లింగ్ యాప్స్ ప్రకటనలో నటించారు. Junglerummy.com ను ప్రమోట్ చేసిన రానాపై హైదరాబాద్ లో కేసు నమోదయ్యింది.
ప్రకాష్ రాజ్ :
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పై కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కేసు నమోదయ్యింది. ఆయన కూడా రానా లాగే కలిసి Junglerummy.com ప్రకటనలో నటించారు. దీంతో ఈయనపై కూడా హైదరాబాద్ లో కేసు నమోదయ్యింది.
నిధి అగర్వాల్ :
సినీనటి నిధి అగర్వాల్ పై కూడా ఈ గ్యాంబ్లింగ్ యాప్ JeetWin యాడ్ లో నటించారు. దీంతో ఆమెపై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది
మంచు లక్ష్మి :
ఇప్పటికే మంచు కుటుంబంలో వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె గతంలో www.yolo247.com గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసే యాడ్ లో పాల్గొన్నారు.
ఇక హీరోయిన్స్ ప్రణీత, అనన్య నాగళ్ల వంటివారు కూడా గ్యాంబ్లింగ్ యాప్స్ ను ప్రమోటు చేసినవారిలో ఉన్నారు. వీరిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
Betting Apps
బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసిన యాంకర్స్, ఇన్ల్పూయెన్సర్స్ :
శ్యామల :
యాంకర్, సినీనటి నుండి రాజకీయ నాయకురాలిగా మారిన శ్యామల కూడా గతంలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసారు. ప్రస్తుతం ఆమె వైసిపి అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినవారిపై వరుసగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆమెపై కూడా నమోదుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా టిడిపి, జనసేన శ్రేణులు, మెగా అభిమానులు ఆమెను టార్గెట్ చేసారు.
విష్ణుప్రియ, శ్రీముఖి :
ఈ యాంకర్స్ కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినవారిలో ఉన్నారు. వీరిలో విష్ణుప్రియకు ఇప్పటికే నోటీసులు జారీచేయగా ఇవాళ(గురువారం) ఆమె విచారణకు హాజరయ్యారు.
బయ్యా సన్నీ యాదవ్ :
ఈ బెట్టింగ్ యాప్స్ వివాదంలో ముఖ్యంగా వినిపిస్తున్న పేరు ఈ బయ్యా సన్నీ యాదవ్. మోటో వ్లాగర్ అయిన ఇతడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా కోట్లు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. ట్రావెలర్ అన్వేష్ ఇతడి బెట్టింగ్ వ్యవహారాన్ని బైటపెట్టారు... గతంలో అన్వేష్, సన్నీయాదవ్ మధ్య సోషల్ మీడియాలో పెద్ద వివాదమే రాజుకుంది. ఐపిఎస్ సజ్జనార్ కూడా ఇతడి బెట్టింగ్ వ్యవహారంపై స్పందించారు.
లోకల్ బాయ్ నానీ (వాసుపల్లి నాని) :
విశాఖపట్నంలో చేపలు పట్టే మత్స్యకార కుటుంబంలో పుట్టిన నానీని సోషల్ మీడియా స్టార్ ని చేసింది. అయితే అతడు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి వివాదంలో చిక్కుకున్నాడు. ఈ వ్యవహారంలో ఇతడిపై కేసులు నమోదయ్యాయి... ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.
టేస్టీ తేజా :
బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్, యూట్యూబర్ టేస్టీ తేజా కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోటు చేసాడు. అతడిపై హైదరాబాద్ లో కేసు నమోదయ్యింది. ఇప్పటికే పోలీసుల విచారణకు కూడా తేజా హాజరయ్యాడు.
ఇతరులు :
యూట్యూబర్ ఇమ్రాన్, హర్ష సాయి పై కూడా కేసులు నమోదయ్యాయి. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసాడు. రీతూ చౌదరి, సుప్రీత, అనలిస్ట్ సుధీర్ వంటివారి పేర్లుకూడా ఈ బెట్టింగ్ యాప్స్ వివాదంలో వినిపిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి తప్పు చేసామని ఒప్పుకున్నా వీరిని పోలీసులు వదిలిపెట్టడంలేదు.