- Home
- Telangana
- Telangana Rain Alert : ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త, వానలు దంచికొడతాయట, అందుకే ఎల్లో అలర్ట్
Telangana Rain Alert : ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త, వానలు దంచికొడతాయట, అందుకే ఎల్లో అలర్ట్
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసారు. ఇలా వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంతకూ ఏఏ జిల్లాలకు అలర్ట్ జాారీ చేసారంటే…

ఈ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో మరో మూడురోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కొన్నిచోట్ల ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని.. మిగతాచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. వాయుగుండం ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తక్కువగానే ఉండనుంది.. ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటకపై ఎక్కువగా ఉంటుందని... ఈ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ జారీ చేసారు.
తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణ విషయానికి వస్తే శనివారం ఉష్ణోగ్రత 3 నుండి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవడం, మిగతా జిల్లాల్లో ఆకాశం మేఘాలతో నిండివుండటంతో వాతావరణం చల్లగానే ఉంటుందని వెల్లడించారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసారు.
ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, భూపాలపల్లి, కరీంనగర్, ములుగు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక హైదరాబాద్ తో పాటు శివారు జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్ లో కూడా చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. కొన్నిచోట్ల గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయట. అందుకే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు.
ఏపీలో ఈ మూడ్రోజులు వర్షాలే
ఇక మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో కూడా నేడు(శనివారం) వర్షాలు దంచికొట్టనున్నాయని వాతావరణ విభాగం తెలిపింది. ఈ మూడురోజులు అంటే శని, ఆది, సోమవారం వరకు కొన్నిప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయట... మరికొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
ఈ ఏపీ జిల్లాలకు వర్షసూచన
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, కర్నూల్, నంద్యాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కగా చిరుజల్లులు కురుస్తాయని...మిగతాచోట్ల ఆకాశం మేఘాలతో కప్పేసి వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వ్యవసాయ పనులు
తెలుగు రాష్ట్రాల్లోకి ముందుగానే రుతుపవనాలు ప్రవేశించాయి... సాధారణంగా జూన్ ఆరంభంలో రుతుపవనాలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో విస్తరిస్తాయి... కానీ ఈసారి మేలోనే వచ్చాయి. దీంతో వర్షాలు ముందే మొదలయ్యాయి... తొలకరి వానలకే వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.. జలాశయాలు, చెరువులు నిండాయి.. నదుల్లోనూ నీటి ప్రవాహం పెరిగింది. వానలు దంచికొడుతుండటంతో రైతులు కూడా వ్యవసాయ పనులు ముందుగానే ప్రారంభించున్నారు.

