Weather Update: తెలంగాణలో మరో 4 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్
Rain Alert: తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. అలాగే, పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు
వచ్చే నాలుగు రోజులపాటు తెలంగాణ రాష్ట్రం అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. రానున్న రోజుల్లో మోస్తరు నుంచి కుండపోత వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణలోని ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ములుగు జిల్లాలోని ఏటూరు నాగరంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం లింగాలలో 9.3, ఖమ్మం రూరల్‌లో 8.9, మేడారంలో 8.4, జనగాం గూడూరులో 7.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్, రంగారెడ్డి జాల్లాల్లో కూడా పలు చోట్ల భారీ వర్షం కురిసింది.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు
దక్షిణ కర్ణాటక నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు తమిళనాడు మీదుగా సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. అలాగే, తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ వ్యవస్థల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు మోస్తారు నుంచి భారీగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయని తెలిపింది.
హైదరాబాద్‌కు భారీ వర్షాల హెచ్చరికలు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎస్‌ఆర్ నగర్, మెహిదీపట్నం, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచే వాన కురుస్తోంది.
రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రాజేంద్రనగర్, బాలాపూర్, మీర్‌పేట్, చార్మినార్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో కూడా వర్షం తీవ్రంగా పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు
వాతావరణశాఖ అంచనా ప్రకారం ఆదివారం, సోమవారం, మంగళవారం ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు దేశంలోని పలు ప్రాంతాలపై శక్తి తుఫాను ప్రభావం కొనసాగుతోంది.
ప్రజలకు అధికారుల హెచ్చరికలు
భారీ వర్షాల క్రమంలో వాతావరణ శాఖ, అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని సలహా ఇచ్చారు.
వర్షాల సమయంలో విద్యుత్ తీగలు, చెట్ల కింద నిలబడటం, నీటి ప్రవాహాలు దాటడం మానుకోవాలని హెచ్చరించింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు చేస్తున్న రైతులు వర్షాలు తగ్గే వరకు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది.