INDW vs PAKW : భారత్ vs పాకిస్తాన్.. మహిళల ప్రపంచ కప్ లో ‘హ్యాండ్‌షేక్’ వివాదం !
INDW vs PAKW : మహిళల ప్రపంచకప్ లో తలపడేందుకు భారత్-పాకిస్తాన్ సిద్ధంగా ఉన్నాయి. అయితే, ఈ మ్యాచ్‌లో ‘హ్యాండ్‌షేక్’ వివాదం చెలరేగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. దీని కథేంటో ఇక్కడ తెలుసుకుందాం.

INDW vs PAKW : మళ్లీ హ్యాండ్‌షేక్ వివాదం..
ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో భారత్-పాకిస్తాన్ మహిళల మధ్య జరగబోయే మ్యాచ్ ఉత్కంఠను రేపుతోంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 5న కొలంబోలో జరగనుంది. ఇటీవల జరిగిన ఆసియా కప్ 2025లో పురుషుల జట్ల మధ్య జరిగిన ‘హ్యాండ్‌షేక్’ వివాదం ఇప్పుడు మహిళల ప్రపంచకప్‌లో కూడా ఇది కనిపించే అవకాశముంది. పురుషుల జట్టు మాదిరిగానే భారత మహిళా జట్టు కూడా పాకిస్తాన్ ఆటగాళ్లతో హ్యాండ్‌షేక్ చేయొద్దని నిర్ణయించుకున్నారనే టాక్ నడుస్తోంది.
ఆసియా కప్ 2025లో ప్రారంభమైన షేక్ హ్యాండ్ వివాదం
భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య షేక్ హ్యాండ్ వివాదం ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో మొదలైంది. పహాల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన "ఆపరేషన్ సింధూర్" నేపథ్యంలో రెండు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఉన్న భారత పురుషుల జట్టు, పాకిస్తాన్ ఆటగాళ్లతో టాస్ సమయంలో గానీ, మ్యాచ్ అనంతరం గానీ చేతులు కలపలేదు.
ఇదే నిర్ణయం ఫైనల్ తర్వాత కూడా కొనసాగింది. భారత్ మూడు సార్లు ఆసియా కప్ 2025 లో పాకిస్తాన్ తో తలపడింది. మూడు సార్లు కూడా చేతులు కలపలేదు. భారత జట్టు ఆసియా కప్ ట్రోఫీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్, ఏసీసీ అధ్యక్షుడు మోహ్సిన్ నక్వీ చేతుల మీదుగా స్వీకరించేందుకు కూడా నిరాకరించింది. ఈ చర్యలతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు కూడా చేసింది. అక్కడ కూడా పాక్ కు భంగపాటు తప్పలేదు.
అదే మార్గంలో భారత మహిళల జట్టు..
ఇప్పుడు ప్రపంచకప్‌లో మహిళల జట్లు తలపడుతుండగా, అందరి దృష్టి భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా పైనే ఉంది. బీసీసీఐ పురుషుల జట్టు మాదిరిగానే చేతులు కలపకుండా వుండే విధానాన్ని కొనసాగించాలని మహిళా జట్టు నిర్ణయం తీసుకుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ.. “ఆ దేశంతో మా సంబంధాల్లో ఎలాంటి మార్పు లేదు. పరిస్థితి గత వారంలాగే ఉంది” అని పేర్కొన్నారు. దీని అర్థం రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోందని స్పష్టమవుతోంది.
అందువల్ల టాస్ లేదా మ్యాచ్ అనంతరం హ్యాండ్‌షేక్ జరగకపోవచ్చని భావిస్తున్నారు. ఇది మరోసారి క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశం కానుంది.
పాకిస్తాన్ పై భారత్ ఆధిపత్యం
రాజకీయ ఉద్రిక్తతలతో పాటు క్రీడా పరంగా చూస్తే భారత్ మహిళల జట్టు పాకిస్తాన్‌పై స్పష్టమైన ఆధిపత్యం కలిగి ఉంది. వన్డేల్లో భారత్ ఇప్పటివరకు పాకిస్తాన్‌పై 11-0 విజయాల రికార్డు కలిగి ఉంది. ప్రపంచకప్‌లో భారత జట్టు శ్రీలంకపై 59 పరుగుల తేడాతో గెలిచింది. దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్ కీలక ప్రదర్శన ఇచ్చారు. మరోవైపు పాకిస్తాన్ మహిళల జట్టు బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. ఈ తేడా రెండు జట్ల మధ్య సామర్థ్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. భారత్ గెలుపు పక్కా అని క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
ఉత్కంఠను పెంచుతున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్
ఆసియా కప్ 2025 వివాదం ఈ మ్యాచ్ వాతావరణంపై కూడా ప్రభావం చూపవచ్చని అంచనా. పాకిస్తాన్ జట్టు నిర్వాహకులు ఇప్పటికే పీసీబీతో సంప్రదించి ఎలా వ్యవహరించాలో సూచనలు తీసుకున్నట్లు సమాచారం. భారత మీడియా, అధికారులు బీసీసీఐ విధానాలను కచ్చితంగా పాటించనున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు రాజకీయ ఒత్తిళ్ల మధ్య తమ దృష్టిని ఆటపై కేంద్రీకరించగలరా అనేది ప్రధాన ప్రశ్నగా మారింది. ఇప్పటికే ఇరు దేశాల అభిమానుల్లో ఈ మ్యాచ్ ఉత్కంఠను క్రియేట్ చేసింది.
క్రికెట్ డిప్లోమసీపై ప్రభావం
ఈ వివాదం క్రీడా సంబంధాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోందని పలువురు క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సాధారణంగా క్రికెట్ దేశాల మధ్య సాన్నిహిత్యానికి వేదికగా నిలుస్తుంది. కానీ భారత్-పాకిస్తాన్ సంబంధాలు మాత్రం రాజకీయ ఉద్రిక్తతలతో ముడిపడి ఉన్నాయి. ఏదేమైనా అక్టోబర్ 5న జరిగే ఈ మ్యాచ్ కేవలం క్రికెట్ పోరాటం కాదు.. ఇది రెండు దేశాల మధ్య ఉన్న సున్నితమైన రాజకీయ బంధాన్ని ప్రతిబింబించే ఘట్టంగా నిలవనుందని చెప్పవచ్చు.